ఉన్న నీటినే పొదుపుగా వాడుకోక తప్పదు
ABN , Publish Date - Sep 19 , 2026 | 05:39 AM
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాబోయే 11-12 నెలలపాటు తాగునీటికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు.
‘ఎల్‌నినో’ను ఎదుర్కొనేందుకు చర్యలు
ఈ ఏడాది సాగు 18శాతం తగ్గింది
విద్యుత్తు డిమాండ్‌ను ఎదుర్కొంటాం
‘ఉపాధి’ కోసం కేంద్రం నిధులివ్వాలి: భట్టి
బీఆర్‌ఎస్ పాలనా వైఫల్యంతోనే
నీటి సంక్షోభం: మంత్రి ఉత్తమ్
తుమ్మిడిహెట్టి సాధనకు కేంద్రంపై ఒత్తిడి
తేవాలని బీజేపీ నాయకులకు పిలుపు
ప్రతి ఫ్యామిలీపై ఎల్‌నినో ఎఫెక్ట్: సీతక్క
హైదరాబాద్, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాబోయే 11-12 నెలలపాటు తాగునీటికే ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు. పలు ఎత్తిపోతల పథకాల ద్వారా రిజర్వాయర్లు, చెరువులను నింపేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, గ్రామీణ ఉపాధిని అనుసంధానిస్తూ ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమాన్ని ప్రారంభించామని వివరించారు.
అందులో భాగంగా 24 లక్షల ఇంకుడు గుంతలు, 50వేల వ్యవసాయ కుంటలు, 12వేల పర్క్యులేషన్ ట్యాంకులు, 12వేల బోరు బావుల నిర్మాణాలను చేపట్టాలని ప్రతిపాదించినట్టు చెప్పారు. శుక్రవారం శాసనసభలో ఎల్‌నినో అం శంపై జరిగిన స్వల్పకాలిక చర్చకు భట్టి సమాధానం ఇచ్చారు. తెలంగాణపై ఎల్‌నినో ప్రభావం గణనీయంగా ఉందని.. వర్షపాతం లోటు, జలాశయాల్లోకి నీటి ప్రవాహం తగ్గడం, వ్యవసాయంపై ఒత్తిడి, విద్యుత్తు డిమాండ్ పెరుగుదల నమోదయ్యాయని తెలిపారు. ఈసారి జూన్‌లో 12 శాతం, జూలైలో ఒక శాతం, ఆగస్టులో ఏకంగా 38 శాతం లోటు వర్షపాతం నమోదైందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈసారి వానాకాలం సాగువిస్తీర్ణం 123.74 లక్షల ఎకరాలకు చేరిందని.. గత ఏడాది 139.29 లక్షల ఎకరాలతో పోల్చితే 18 శాతం తగ్గిందని చెప్పారు. ఎల్‌నినో పరిస్థితులతో ఉన్న నీటినే పొదుపుగా వినియోగించేలా చర్య లు చేపట్టామన్నారు. వానల్లేక జలవిద్యుత్తు ఉత్పత్తి కూడా పడిపోయిందని వివరించారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెంచుతూ, థర్మల్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. కరువు పరిస్థితులు ఉన్న సంవత్సరాల్లో ఉపాధి హామీ పథకానికి కేంద్రం మరింతగా నిధులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తాం: ఉత్తమ్
వర్షాభావం ఎంతటి పరీక్ష పెట్టినా రైతాంగానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని, ఆకాశం కరుణించకపోయినా అన్నదాత ఆశలు ఎండిపోనివ్వబోమని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శాసనసభలో చెప్పారు. ప్రస్తుత నీటి సంక్షోభం వెనుక ప్రకృతి ప్రతికూలతతో పాటు పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సాగునీటి రంగానికి జరిగిన అన్యాయం, అసంపూర్ణ పథకాలు, లోపభూయిష్ట నిర్మాణాలు కారణమని మండిపడ్డారు. రాష్ట్రంలోని చెరువుల్లో 40 శాతం చెరువులు పావువంతు మాత్రమే నిండాయని తెలిపారు.
మిషన్ భగీరథ, తాగునీరు, వేసవి అవసరాలకు నీటిని భద్రపరిచిన తరువాతే మిగులు జలాలను సాగుకు విడుదల చేస్తామని.. ఇందుకోసం ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక నీటి బడ్జెట్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి కేంద్రం చొరవ తీసుకునేలా రాష్ట్ర బీజేపీ నేతలు ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం సహకరించాలని.. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాష్ట్ర ప్రతినిధుల బృందాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి కృషి చే యాలన్నారు. ఇక బీజేపీ నాయకులు ఓట్ల కోసం జైశ్రీరాం నినాదాలు చేస్తారని.. వానల కోసం, ప్రజల అవసరాల కోసం పూజలు చేయరని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి విమర్శించారు.
అంతటా ఎల్‌నినో ప్రభావం: మంత్రి సీతక్క
ఎల్‌నినో కేవలం తెలంగాణ సమస్య కాదని, ప్ర పంచవ్యాప్తంగా ఈ సమస్య ఉందని.. ప్రతి కుటుంబంపై దీని ప్రభావం ఉందని మంత్రి సీతక్క చెప్పా రు. సింగూరు జలాశయంలో 75 రోజులకు సరిపడే జలాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. 4 జిల్లాలు, 2,395 గ్రామాలు, 19 పట్టణ ప్రాంతాలు సింగూరు జలాలపై ఆధారపడి ఉన్నాయన్నారు. అందువల్ల తాగునీటి అవసరాలకే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు, ఉపాధి పనులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు.
ఉపోద్ఘాతాలు కాదు.. పరిష్కార మార్గాలు చెప్పండి: మహేశ్వర్‌రెడ్డి
మంత్రులు ఎల్‌నినోపై ఉపోద్ఘాతాలు ఇస్తే ప్రజలకు ఉపయోగం లేదని.. ఆ ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. పరిష్కారాల గురించి మాట్లాడకుండా ఎల్‌నినో చరిత్ర చెబితే ఉపయోగం ఏమిటని నిలదీశారు 27 మందితో నిపుణుల కమిటీ వేసి, ఆ కమిటీ సిఫార్సులతో రూ.802 కోట్లు కేటాయించామని చెబుతున్న ప్రభుత్వం.. ఆ నిధులను ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వానల్లేక చాలా మంది రైతులు బోరుబావులపై ఆధారపడి సాగు చేస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వమేమో కరెంటు కోతలు పెడుతోందని విమర్శించారు. సీఎం సొంత ఊరిలోనే రైతులు ధర్నాలు చేస్తున్నారంటే పరిస్థితిని ఎలా ఉందో అర్థమవుతోందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి