Share News

92.86 లక్షల మందికి నోటీసులు

ABN , Publish Date - Aug 18 , 2026 | 07:02 AM

తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌) ప్రక్రియలో 92.86 లక్షల మంది ఓటర్ల వివరాలు సరిగా లేవని గుర్తించినట్లు ఎన్నికల సంఘం ప్రధానాధికారి...

92.86 లక్షల మందికి  నోటీసులు

  • అనామలీస్‌ జాబితాలో 60.50 లక్షల మంది

  • ఎన్యూమరేషన్‌ ఫారాల్లో

  • పూర్తి వివరాలివ్వనివారు 32.36 లక్షలు

  • వీరంతా సరైన ఆధారాలు సమర్పించేందుకు

  • సెప్టెంబరు 16 వరకు గడువు

  • సర్‌ ముసాయిదా ఓటరు జాబితా

  • విడుదల చేసిన ఎన్నికల సంఘం

  • ఫారం సమర్పించని వారికి మరో అవకాశం

  • అర్హులందరికీ ఓట్లు: సీఈవో సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌) ప్రక్రియలో 92.86 లక్షల మంది ఓటర్ల వివరాలు సరిగా లేవని గుర్తించినట్లు ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. వారికి త్వరలో నోటీసులు జారీచేయనున్నటు చెప్పారు. సర్‌ ఓటరు ముసాయిదా జాబితాను సోమవారం ఆయన విడుదల చేశారు. ఓటరు జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ గత రికార్డులతో అనుసంధానం (మ్యాపింగ్‌) చేసే క్రమంలో ఓటరు పేరు, తల్లి, తండ్రి పేర్లలో తేడాలు, చిరునామా సరిగా లేకపోవడం వంటి కారణాలతో 60,50,918 మందిని అనామలీస్‌ క్యాటగిరీలో చేర్చారు. వీరితోపాటు ఎన్యూమరేషన్‌ ఫారాల్లో మూడు కాలమ్స్‌ నింపకపోవడం, సమగ్రంగా వివరాలు నమోదు చేయని 32,36,659 మందికి నోటీసులు జారీచేయనున్నారు. వీరు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే తుది ఓటరు జాబితాలో చేర్చుతారు. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు గాను 2,64,87,213 మంది ఎన్యూమరేషన్‌ ఫారాలు సమర్పించారు. ఈ నెల పదోతేదీ వరకు పూర్తిచేసిన ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రకారం.. మొత్తం ఓటర్లలో ఫారాలు సమర్పించని 73.39 లక్షల మందిని ఏఎ్‌సడీడీ క్యాటగిరీలో చేర్చారు. వీరిలో శాశ్వతంగా చిరునామా మారినవారు 45,18,963 మంది, మరణించిన వారు 9,22,229 మంది, రెండుచోట్ల ఓటరుగా నమోదైనవారు 6,70,203 మంది ఉన్నారు. మిగిలిన 11,25,546 మంది నమోదిత చిరునామాలో లేకపోవడం, బీఎల్‌వోలు వెళ్లినప్పుడు అందుబాటులో లేకపోవడంతో ఎన్యూమరేషన్‌ ఫారాలు పొందలేదు. వీరికి మరో అవకాశం ఇవ్వనున్నట్లు సీఈవో తెలిపారు. వీరితోపాటు ఇతర క్యాటగిరీల్లోని 1,02,294 మందికి కూడా ఫారం 6ఏ ద్వారా ఓటరుగా నమోదు చేసుకునేందుకు వీలు కల్పించనున్నారు. ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత గత ఎస్‌ఐఆర్‌ జాబితాతో వివరాలు సరిపోలని వారికి సంబంధించిన అంశాలను ఈఆర్‌వోలు పరిశీలిస్తారు. అవసరమైతే వారికి నోటీసులు జారీచేసి, వారి జాబితాలను సంబంధిత కార్యాలయాలు, పోలింగ్‌ కేంద్రాలు, డీఈవో వెబ్‌ సైట్లలో ప్రదర్శిస్తారు. నోటీసులు ఇవ్వకుండా ముసాయిదా ఓటరు జాబితాలో ఉన్న వ్యక్తి పేరును నేరుగా తొలగించడానికి వీల్లేదు.


సకాలంలో రుజువులు సమర్పించాలి

నోటీసులు అందుకున్నవారు సకాలంలో తగిన ఆధారాలను ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఓటరు జాబితాలో తమ పేరు, ఫొటో, అడ్రస్‌, ఇతర వివరాల్లో తప్పులుంటే వివరాల ధ్రువీకరణ కోసం సమర్పించాల్సిన పత్రాలు ప్రధానంగా... ఆధార్‌ కార్డు, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డు, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు. ఈఆర్‌వో నిర్ణయంపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లో జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పీల్‌ చేసుకోవచ్చు. అక్కడి నిర్ణయంతో కూడా సంతృప్తి లేకపోతే జిల్లా మేజిస్ట్రేట్‌ ఆదేశం వెలువడిన నాటి నుంచి 30 రోజుల్లో ఎన్నికల సీఈవోకు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

అభ్యంతరాలకు సెప్టెంబరు 16 వరకు గడువు

నోటీసులపై వివరాలు సమర్పించేందుకు, అభ్యంతరాలు తెలిపేందుకు సోమవారం (ఆగస్టు 17) నుంచి సెప్టెంబరు 16 వరకు గడువు ఉందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ సమయంలో అర్హులు ఫారం-6తోపాటు నిర్దేశిత డిక్లరేషన్‌ సమర్పించి ఓటరు జాబితాలో పేరును చేర్చుకోవచ్చు. ముసాయిదా ఓటరు జాబితాలను బీఎల్‌వోల వద్ద, ఈఆర్‌వో, ఏఈఆర్‌వో కార్యాలయాల్లో పరిశీలించవచ్చు. అలాగే సీఈవో తెలంగాణ వెబ్‌సైట్‌, ఈసీఐనెట్‌ మొబైల్‌ యాప్‌, ఈసీఐ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ ద్వారా కూడా పరిశీలించే అవకాశం ఉంది. మరణించిన, వలస వెళ్లిన, గైర్హాజరైన, డూప్లికేట్‌ ఓటర్ల జాబితాను బూత్‌లవారీగా ఈఆర్‌వో, ఏఈఆర్‌వో కార్యాలయాలు, గ్రామపంచాయతీ, మున్సిపల్‌ కార్యాలయాలు, పోలింగ్‌ ేస్టషన్ల నోటీసు బోర్డులపై ఏర్పాటుచేస్తారు. వాటిని ప్రజలు పరిశీలించుకొని తప్పులున్నా.. జాబితాలో పేరు లేకపోయినా బీఎల్‌వోలను సంప్రదించాలి. అదే సమయంలో ఈ ఏడాది అక్టోబరు1 నాటికి 18 సంవత్సరాలు నిండే యువత కూడా ఓటరు జాబితాలో చేరేందుకు ఫారం-6తో పాటు నిర్దేశిత డిక్లరేషన్‌ సమర్పించాలి. విదేశాల్లో నివసిస్తున్నవారు ఓటరు నమోదు కోసం ఫారం 6 ఏను ఇవ్వాలి. జాబితాలో తప్పులపై అభ్యంతరం చెప్పేందుకు, పేరును తొలగించాలని కోరేందుకు ఫారం 7ను సమర్పించాలి. చిరునామా మార్పు, వివరాల్లో సవరణ, కొత్త ఎపిక్‌ కార్డు పొందడం, పీడబ్ల్యూడీ ఓటరుగా గుర్తించడం వంటివాటికి ఫారం 8ను సమర్పించాలి. ఈ దరఖాస్తులను ఈఆర్‌వో, ఏఈఆర్‌వో, బీఎల్‌వోలకు భౌతికంగా ఇవ్వవచ్చు. ఈసీఐ వెబ్‌సైట్‌, ఈసీఐనెట్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం అక్టోబరు 19న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు.


అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు: సీఈ సుదర్శన్‌రెడ్డి

అర్హులైన ప్రతి వ్యక్తి పేరు ఓటరు జాబితాలో ఉంటుందని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఒకే వ్యక్తి.. ఒకే ఓటు అన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. వివరాలు సమగ్రంగా లేని ఓటర్లకు ఇంటింటికీ వెళ్లి నోటీసులు అందజేస్తారని వెల్లడించారు. ప్రజలకు సహాయం చేేసందుకు రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో హెల్ప్‌డె్‌స్కలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1950 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను కూడా అందుబాటులో ఉంచామన్నారు. ఎస్‌ఐఆర్‌ను రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించారు. ఇందులో 119 మంది ఈఆర్‌వోలు, 892 మంది ఏఈఆర్‌వోలు, 3,590 మంది బీఎల్‌వో సూపర్‌వైజర్లు, 35,985 మంది బూత్‌లెవల్‌ అధికారులు పనిచేస్తున్నట్లు తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో సోమవారం సమావేశమయ్యారు. సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ తరఫున పులిపాటి రాజేశ్‌, బీజేపీ తరఫున మర్రి శశిధర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ తరఫున బోయినపల్లి వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా

Updated Date - Aug 18 , 2026 | 07:02 AM