ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ డీఈఈ అరెస్ట్
ABN , Publish Date - Nov 12 , 2026 | 08:35 PM
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో నీటిపారుదల శాఖ డీఈఈ సత్యనారాయణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 12: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (DEE) సత్యనారాయణను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్ట్ చేశారు. నాగర్‌కర్నూల్, హైదరాబాద్‌తో పాటు మొత్తం పది ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో సత్యనారాయణకు సంబంధించినట్లు గుర్తించిన భారీ స్థిర, చరాస్తుల వివరాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా వనపర్తి ప్రాంతంలో సుమారు 25 ఎకరాల వ్యవసాయ భూమి, అందులో ఫామ్‌హౌస్, తొమ్మిది ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయన ఆదాయ వనరులు, ప్రకటించిన ఆస్తులు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆదాయానికి మించి ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా సమకూరాయనే కోణంలో విచారణ చేపట్టారు.
మరోవైపు.. సోదాల్లో భాగంగా సుమారు 50 తులాల బంగారం, మూడు కార్లను ఏసీబీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సత్యనారాయణ భార్య ప్రస్తుతం ట్రాన్స్‌కో శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా (AD) పనిచేస్తుండటంతో, ఆమె ఆదాయ వనరులు, కుటుంబ ఆస్తుల వివరాలను కూడా అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల పేర్లపై కొనుగోలు చేసిన స్థిరాస్తులు, బ్యాంకు లావాదేవీలు, ఇతర పెట్టుబడులపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. పది ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో బయటపడిన ఆస్తుల విలువను అంచనా వేసేందుకు సంబంధిత పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..