Share News

ఇంజనీరింగ్‌ విద్య క్రిమినల్‌ వేస్ట్‌!

ABN , Publish Date - Jul 31 , 2026 | 05:32 AM

‘‘మీ ఊర్లో ఎవరైనా ఇంజనీరింగ్‌ పూర్తయిన విద్యార్థి ఉంటే.. ఒక తెల్ల కాగితం ఇచ్చి ఉద్యోగం కోసం దరఖాస్తు పత్రం రాయమనండి.. రాయలేరు.. అలాంటివారు రాష్ట్రంలో ఏటా...

ఇంజనీరింగ్‌ విద్య క్రిమినల్‌ వేస్ట్‌!

కొందరు విద్యాశాఖ మంత్రిగా రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని విమర్శిస్తున్నారు. నేను ఎందుకు రాజీనామా చేయాలి? నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు అల్పాహారం ఇస్తున్నందుకా? టీచర్ల నియామకం, ప్రమోషన్లు సక్రమంగా చేపట్టినందుకా? ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకా? స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుకా?

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  • కనీసం ఉద్యోగాలకు దరఖాస్తు కూడా రాయలేకపోతున్నారు

  • విద్యార్థులదే తప్పుకాదు.. సరైన చదువు చెప్పలేకపోయాం

  • ఇన్నాళ్లుగా తగిన నైపుణ్యాలను నేర్పించలేకపోయాం

  • అందుకే నైపుణ్యాల పెంపును బాధ్యతగా తీసుకున్నా

  • ప్రక్షాళన కోసమే విద్యాశాఖను నా వద్దే ఉంచుకున్నా

  • కేసీఆర్‌కు సంపాదనే ముఖ్యం.. అందుకే

  • ఆర్థిక, రెవెన్యూ శాఖలు దగ్గరపెట్టుకున్నారు

  • నేను మాత్రం రోజూ తిట్లు తినే విద్యాశాఖ తీసుకున్నా

  • పాస్‌ చేస్తారో, ఫెయిల్‌ చేస్తారో మీరే నిర్ణయించుకోండి

  • 2034 వరకు ముఖ్యమంత్రిగా నేనే ఉంటా

  • ఉపాధ్యాయుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ‘‘మీ ఊర్లో ఎవరైనా ఇంజనీరింగ్‌ పూర్తయిన విద్యార్థి ఉంటే.. ఒక తెల్ల కాగితం ఇచ్చి ఉద్యోగం కోసం దరఖాస్తు పత్రం రాయమనండి.. రాయలేరు.. అలాంటివారు రాష్ట్రంలో ఏటా వేల సంఖ్యలో ఇంజనీరింగ్‌ పూర్తి చేస్తున్నారు. వారికి ఉద్యోగాలెలా వస్తాయి? ఇంజనీరింగ్‌ విద్య క్రిమినల్‌ వేస్ట్‌. ఇక్కడ తప్పు కేవలం విద్యార్థిదే కాదు.. వారికి సరైన చదువు చెప్పలేకపోతున్నాం. ఇన్నాళ్లూ సరిగా నైపుణ్యాలు నేర్పించలేకపోయాం. సరిగా చెబితే ఎందుకు నేర్చుకోరు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అందుకే ఈ అంశంపై తమ ప్రభుత్వం తీవ్రంగా దృష్టిసారించిందని చెప్పారు. రాష్ట్రంలోని 22 ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 24వేల విద్యార్థులు ఉన్నారని, వారిలో నైపుణ్యాల పెంపునకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపును తాను బాధ్యతగా తీసుకున్నానని, విద్యాశాఖలో ప్రక్షాళన కోసమే నా వద్ద పెట్టుకున్నానని స్పష్టం చేశారు. జర్మనీ, ఫిన్లాండ్‌లలో అత్యుత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో సీఎం రేవంత్‌ గురువారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో సమావేశమై మాట్లాడారు.


రోజూ తిట్లు తినే శాఖ తీసుకున్నా..

‘‘రెండుసార్లు రాష్ట్రానికి సీఎంగా చేసిన పెద్దాయన భారీ నీటిపారుదల శాఖ, ఆర్థిక, రెవెన్యూ వంటి కీలక శాఖలన్నీ ఎవరికీ కేటాయించలేదు. అయినా ఆయన పర్యవేక్షించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలేశ్వరం అయింది. ఆయనకు సంపాదన ముఖ్యం. కానీ నేనేమో రోజూ తిట్లుతినే విద్యాశాఖను నా వద్దే పెట్టుకున్నాను. విద్యార్థుల భవిష్యత్తు, వారు ప్రపంచంతో పోటీపడేలా చేయడమే నా లక్ష్యం’’ అని సీఎం రేవంత్‌ చెప్పారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా సగటున రూ.1.08 లక్షలు వ్యయం చేస్తోందని, అంత ఖర్చు చేస్తున్నా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు వెళుతున్నారో ఆలోచించాలని ఉపాధ్యాయులకు సూచించారు. నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు. రానున్న ఐదేళ్లు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందిస్తామనే దీక్షబూనాలని కోరారు. తెలంగాణలోని 12 వేల గ్రామాల్లో ప్రతి విద్యార్థిలో రేవంత్‌ రెడ్లున్నారని, వారిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తాను పాటుపడతానని, ఉపాధ్యాయ సంఘాలు మాత్రం విద్యార్థుల సమస్యలపై కొట్లాడాలని చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా తనను పాస్‌ చేస్తారో, ఫెయిల్‌ చేస్తారో నిర్ణయించుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. వద్దంటే విద్యాశాఖ వదిలేస్తానని, మీరు కోరుకున్నవారికే ఇస్తానని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులకు హార్వర్డ్‌లో శిక్షణ

తెలంగాణలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా వ్యవస్థ ఉండాలనే లక్ష్యంతోనే ఉపాధ్యాయులను విదేశీ పర్యటనలకు పంపుతున్నామని తెలిపారు. ఏటా కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులకు స్టాన్‌ఫోర్డ్‌, హార్వర్డ్‌ వంటి వర్సిటీల్లో ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక శిక్షణ అందిస్తామని చెప్పారు. ఆ నైపుణ్యాలతో ఇక్కడ విద్యార్థులకు బోధించి ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలన్నారు. ఆస్తులు లేకపోవడం వెనుకబాటుతనం కాదని, విద్య లేకపోవడమే వెనుకబాటుతనమని తాము నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, కులసర్వే తేల్చిందని సీఎం రేవంత్‌ చెప్పారు. ఉపాధ్యాయులు ఏ మండలానికి ఆ మండ లం యూనిట్‌గా తీసుకొని, వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. ఆ మండలంలోని పాఠశాలల్లో ఏ వసతులు కావాలి, ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి, మెరుగైన విద్యా బోధనకు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరేందుకు ఏం అవసరమనే అంశాలు సదరు ప్రణాళికలో ఉం డాలన్నారు. డిసెంబరు నెలాఖరుకు ప్రణాళికలను తమకు అందజేస్తే.. వాటికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.


పీఆర్‌వోల శిక్షణపై సీఎం ఫోకస్‌..

ప్రభుత్వ పథకాల ప్రచారంపై కార్యచరణ

ప్రజాప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతీ పౌరుడికీ చేరడంపై సీఎం రేవంత్‌ దృష్టిసారించారు. పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లడంలో పీఆర్‌వోల పాత్ర కీలకమని భావిస్తూ.. వారు సమన్వయంతో ముందుకుసాగాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పీఆర్‌వోల సామర్థ్య పెంపు, శిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమలు నుంచి రైతులు, మహిళలు, యువత, పేదల సంక్షేమంతో పాటు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రుణమాఫీ, రైతుభరోసా, సన్నధాన్యానికి బోనస్‌, గిగ్‌ వర్కర్ల చట్టం వరకు అన్ని వర్గాలకు ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చట్టాలు, చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతీ కుటుంబానికి చేరేలా నిరంతరం కృషి చేయాలని సూచించారు. సీఎం సీపీఆర్‌వో గుర్రం మల్సూర్‌ నేతృత్వంలోని బృందం సీఎం పీఆర్‌వోలు, మంత్రుల పీఆర్‌వోలు, సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్లతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంలో ఏకరీతి, వేగం, సమన్వయం ఉండేలా మార్గదర్శకాలు ఇస్తోంది.

ఈ వార్తలనూ చదవండి:

కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి

కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ

Updated Date - Jul 31 , 2026 | 05:33 AM