నేనే రాజు.. నేనే మంత్రి
ABN , Publish Date - Feb 13 , 2026 | 05:50 AM
రాజకీయాల్లోనైనా, వ్యక్తిత్వంలోనైనా ‘నేనే రాజు... నేనే మంత్రి’. నేనెవరితో పోల్చుకోను. నాకెవరూ పోటీ లేరు. నాకు నేనే పోటీ. నేను మొనగాణ్ని’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.....
నాకెవరూ పోటీ లేరు.. నాకు నేనే పోటీ.. నేను మొనగాణ్ని
2029లో జమిలి.. మళ్లీ నేనే సీఎం.. మరో ఆరునెలలు సీఎం పదవి నాకు బోనస్
పదిన్నరేళ్లు పదవిలో ఉండి రికార్డు సృష్టిస్తా.. కాళేశ్వరం కూలితే నాపై వేయాలని కుట్ర
సీబీఐ దర్యాప్తుపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ జవాబు చెప్పాలి
బిర్యానీ తిని ఖుబానీ కోసం కొట్లాడినట్టుగా నీటిపై ఆంధ్రప్రదేశ్ వ్యవహారం
ఎన్టీఆర్ జాతీయ నేత.. భారతరత్న ఇవ్వాలి.. ఆయన విగ్రహాన్ని హైదరాబాద్‌లో పెడతాం
ప్రభాకర్‌రావు వాంగ్మూలంతోనే కేసీఆర్‌ను ప్రశ్నించి ఉంటారు
నేను ప్రధాని మోదీ, కేసీఆర్‌లా కాదు.. రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగను
కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత అంతా ఒకటే.. అన్నీ డ్రామాలే.. ఢిల్లీలో మీడియాతో సీఎం
‘‘బీఆర్‌ఎస్ వాళ్లు చెప్పినట్లు నేను ఇన్వాల్వ్ అయితే.. వాళ్లెవరూ బయట తిరగరు. ఫోన్ ట్యాపింగ్ క్షమించారని నేరం. నాయకుడు ప్రజలు ఏం అనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకోవాలి తప్ప.. ప్రజల బెడ్‌రూముల్లోకి దూరి వినాలని అనుకోకూడదు. అయినా కేసీఆర్‌ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది. ఆయనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు’’
- సీఎం రేవంత్‌రెడ్డి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ‘‘రాజకీయాల్లోనైనా, వ్యక్తిత్వంలోనైనా ‘నేనే రాజు... నేనే మంత్రి’. నేనెవరితో పోల్చుకోను. నాకెవరూ పోటీ లేరు. నాకు నేనే పోటీ. నేను మొనగాణ్ని’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం న్యూఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని తన అధికారిక నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన.. 2029లో జమిలి ఎన్నికలు జరగడం ఖాయమని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సైతం అప్పుడే ఉంటాయని పేర్కొన్నారు. దీనివల్ల తాను ఐదున్నరేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని.. తనకు ఆరు నెలలు సీఎం పదవి బోనస్ అని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ కచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేశారు. 2029లోనూ తానే సీఎం అవుతానని, రాష్ట్రంలో పదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తాను రికార్డు సృష్టించబోతున్నానని జోస్యం చెప్పారు. తెలంగాణలో జిల్లాల పెంపు, తగ్గింపు వంటివేవీ 2027 వరకు ఉండబోవని రేవంత్ తేల్చిచెప్పారు. ఎన్టీఆర్ జాతీయ నాయకుడు, జాతీయ సొత్తు అని.. ఆయనకు హద్దులేమీ లేవని.. హైదరాబాద్‌లో ఆయన విగ్రహం పెట్టి తీరుతామని తెలిపారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందిగా తాను ప్రతిపాదిస్తానని చెప్పారు. పార్లమెంట్‌లోనూ ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తుచేశారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ప్రారంభోత్సవం నిర్వహిస్తామని.. రెండేళ్లలో పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని సీఎం చెప్పారు. రెండోదశలో కొత్తగూడెం, రామగుండం విమానాశ్రయాలు నిర్మిస్తామన్నారు. కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన ఆరు బుల్లెట్ (హైస్పీడ్) ట్రైన్లలో మూడింటికి హైదరాబాదే కేంద్ర బిందువన్నారు. శంషాబాద్‌ను బుల్లెట్ (హైస్పీడ్) ట్రైన్ హబ్‌గా మార్చాలని, శంషాబాద్‌లో విమానం దిగి, ముంబయి, బెంగళూరు, చెన్నై, పూణె వెళ్లేలా ప్రణాళికలు రచించాలని కేంద్రాన్ని కోరారు. తమ పోరాటంతోనే ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగానికి నంబర్ వచ్చిందని, మూడు హైస్పీడ్ ట్రైన్లు వచ్చాయని, రక్షణ భూముల బదలాయింపు జరిగిందని గుర్తు చేశారు. అయితే, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తణరకు కేంద్రం మద్దతివ్వడంలేదని సీఎం ఆరోపించారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవడమే చూశామని.. కానీ తాము మెట్రో ప్రాజెక్టును ఎల్‌అండ్ టీ నుంచి కొనుగోలు చేశామన్నారు. కవిత కొత్త పార్టీ గురించి చెప్పేందుకు ఏమీ లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఒక్కటేనని, వాళ్లు ఆడేవన్నీ డ్రామాలేనని ఆరోపించారు.
వాళ్లే చెప్పాలి..
కాళేశ్వరంపై విచారణ ఎంతవరకూ వచ్చిందో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లే చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో కేసీఆర్‌ను అరెస్టు చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. కాళేశ్వరంపై విచారణ చేపట్టాలని సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశాం. అదే కాపీని హోం సెక్రటరీకి జత చేశాం. ఆరు నెలలు గడుస్తున్నా కేసీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయలేదో కిషన్ రెడ్డి చెప్పాలి. తెలంగాణ రాసిన లేఖను సీబీఐ డీవోపీటికి రిఫర్ చేస్తుంది. డీవోపీటీ ప్రధానికి పంపుతుంది. మరి.. పీఎంవోలో ఎక్కడ ఆగిందో? ఎందుకు ఆగిందో? కిషన్ రెడ్డి లేదంటే బండి సంజయ్ అయినా సమాధానం చెప్పాలి. ఈ ఫార్ములా రేసులో ఐఏఎస్ అధికారిని విచారించేందుకు డీవోపీటీ అనుమతి ఇవ్వట్లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ కేంద్రం అదే నిర్లక్ష్యం చూపింది. ఏ1 గా ఉన్న ప్రభాకర్ రావును భారత్‌కు తీసుకు వచ్చేందుకు సహకరించలేదు. చివరికి.. మేమే సుప్రీంకోర్టుకు వెళ్లి ఆయన్ను దేశానికి తీసుకొచ్చాం. ఆయన వాంగ్మూలం మేరకే కేసీఆర్ ను విచారించి ఉంటారు’’ అని సీఎం పేర్కొన్నారు. ఒక కౌన్సిలర్ కోసం హత్యలు చేసే సంప్రదాయం కాంగ్రె్‌సలో ఉండదని.. బీజేపీ శవ రాజకీయాలకు పాల్పడిందని ఆయన దుయ్యబట్టారు. ‘‘ఒక బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకుంటే ఆ పార్టీ సింపతీకి వాడుకుంది. కిషన్ రెడ్డికి తెలంగాణ పోలీసులపై నమ్మకం లేకపోతే సీబీఐ విచారణ కోసం లేఖ రాయవచ్చు. కిషన్ రెడ్డి లేఖ రాస్తే.. ఆ కేసును కూడా సీబీఐకి అప్పగిస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసునూ సీబీఐకి ఇస్తాం. ఇప్పటి వరకు ఇచ్చిన కాళేశ్వరం, ఈ ఫార్ములా రేసు కేసుల్లో కిషన్ రెడ్డి ఏంచేశారో అందరం చూశాం కదా?’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
నెపం నాపై నెట్టాలని..
కుంగిన కాళేశ్వరం బ్యారేజీలో నీళ్లు నింపేలా నాపై ఒత్తిడి పెంచి.. ఆ తర్వాత ప్రాజెక్టు కూలిపోతే ఆ డ్యామేజీని తన ఖాతాలో వేయాలని బీఆర్‌ఎస్ చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘‘కేసీఆర్, కేటీఆర్, హరీశ్, సురేష్ రెడ్డిలా నేనేమీ ఇంజినీరింగ్ మేధావిని కాదు. కేసీఆర్ మేధావి కాబట్టి మూడు నెలలకే ప్రాజెక్టు కుప్పకూలింది. నేను సామాన్యుడిని. అందుకే నిపుణుల సలహాలు తీసుకుంటున్నాం. కాళేశ్వరం కుంగడంపై సాంకేతిక నిపుణుల మాటకు, బీఆర్‌ఎస్ చెప్పేదానికి పొంతన లేదు. బాంబులు పెట్టి కాళేశ్వరాన్ని కూల్చామనడం హాస్యాస్పదంగా ఉంది. మరీ అంత అవివేకమైతే ఎలా? బాంబులు పెడితే విస్ఫోటం జరిగి పైకి లేవాలి. అంతేగానీ పిల్లర్లు కుంగుతాయా? కాళేశ్వరం అత్యంత ప్రమాదకర ప్రాజెక్టుల జాబితాలో చేరిందని కేంద్రమే పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. అయినా, బీఆర్‌ఎస్ మొండి వాదన చేస్తే ఎలా? ప్రాజెక్టులో నీళ్లు నింపమనడం వెనుక పెద్ద కుట్రే దాగి ఉంది. నీళ్లు నింపాకప్రాజెక్టు పూర్తిగా కూలిపోతే.. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూల్చినట్టుగా ప్రచారం చేయాలని చూస్తున్నారు. కాళేశ్వరంలో ఇంకెన్ని పిల్లర్లు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయో, నీళ్లు నింపితే ఇంకెన్ని కూలుతాయో చెప్పాలంటే ప్రాజెక్టు లోపలి నుంచి పరీక్షించాలని డ్యాం సేఫ్టీ అథారిటీ చెబుతోంది. అలాంటప్పుడు నీళ్లెలా నింపుతాం? అయినా కాళేశ్వరం వల్లే తెలంగాణ అన్నపూర్ణగా మారిందని చెప్పారు. మరి.. కాళేశ్వరం నీళ్లు లేకపోయినా దేశంలోనే అత్యధిక ధాన్యం తెలంగాణలో ఎలా పండింది’’ అని నిలదీశారు.
ఆ అవసరం లేదు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పు చేసిన వాళ్లను జైలుకు పంపేందుకే సిట్ వేశాం తప్ప.. కక్షపూరిత రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని సీఎం స్పష్టం చేశారు. ఎవరినైనా అరెస్టు చేయాలంటే తనకు ఒక్క ఫోన్ కాల్ చాలని.. కానీ, తాను మోదీ, కేసీఆర్‌లా కాదని, 100 శాతం రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటానని చెప్పారు. ‘‘ట్యాపింగ్ కేసులో సిట్ అధికారిగా సజ్జనార్‌ను కావాలనే నియమించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ కేసు పంజగుట్ట పీఎస్‌లో నమోదైంది. హైదరాబాద్ కమిషనర్‌గా ఎవరుంటే సిట్ ఇంచార్జిగా వాళ్లే ఉంటారు. అది కూడా తెలియకుండా మాట్లాడితే ఎలా? చివరికి.. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం కూడా రేవంత్ రెడ్డి వల్లేనంటే ఎలా? అయినా, ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఫైళ్లన్నీ 2020లోనే కోర్టుకు అందజేశారు. అది కూడా తెలియకుండా మాట్లాడుతుంటే.. తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. బీఆర్‌ఎస్ వాళ్లు చెప్పినట్లు ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అయితే.. వాళ్లెవరూ బయట తిరగరు. మళ్లీ చెబుతున్నా.. ఫోన్ ట్యాపింగ్ అనేది క్షమించారని నేరం. నాయకుడు ప్రజలు ఏం అనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకోవాలి తప్ప.. ప్రజల బెడ్‌రూముల్లోకి దూరి వినాలని అనుకోకూడదు. అయినా కేసీఆర్‌ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది. ఆయనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు’’ అని సీఎం వ్యాఖ్యానించారు.
సింగరేణి టెండర్లలో అవకతవకలు అవాస్తవం
సైట్ విజిట్ నిబంధన కేంద్రమే విధించింది
బొగ్గు కుంభకోణం ఆరోపణలన్నీ బూటకమని.. సింగరేణి టెండర్లలో అవకతవకలు అవాస్తవమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2018 కేంద్ర మార్గదర్శకాల మేరకే టెండర్ ప్రక్రియ కొనసాగిందని ఆయన తేల్చిచెప్పారు. ‘‘కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్లు సింగరేణి టెండర్ల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలూ జరగలేదు. 2018, 2021, 2023, 2025లో జరిగిన టెండర్లన్నీ మార్గదర్శకాల ప్రకారమే జరిగాయి. 2018 కేంద్ర మార్గదర్శకాల్లో మేం ఒక్క అక్షరం కూడా మార్చలేదు. సైట్ విజిట్ నిబంధన కేంద్రమే విధించింది. అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో టెండర్ల దాఖలుకు సైట్ విజిట్ నిబంధన తప్పనసరిగా ఉంది. సదరు కాంట్రాక్టర్ సైట్ విజిట్ చేసినట్టు అక్కడి ఇంజినీర్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిందే. సింగరేణి టెండర్లు, కిషన్ రెడ్డి ఆరోపణలన్నింటిపైనా అసెంబ్లీ వేదికగా నిజాలు బహిర్గతం చేస్తా. అప్పుడు.. కిషన్ రెడ్డి క్షమాపణలు చెబుతారా?’’ అని సవాల్ చేశారు. సింగరేణిని కొత్తగా తామేమీ అప్పుల్లో పడేయలేదని.. ఆ సంస్థబీఆర్‌ఎస్ హయాం నుంచే అప్పుల్లో ఉందని, పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్, కేంద్రంలో ఉన్న కిషన్ రెడ్డి తీరుతోనే సింగరేణి అప్పులపాలైందని దుయ్యబట్టారు. ‘‘మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేదు. బీఆర్‌ఎస్ హయాంలోనే జెన్ కోకు సింగరేణి బొగ్గును సరఫరా చేసింది. ఆ డబ్బులు ఎందుకు ఇవ్వలేదు. కేసీఆర్‌ను కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించరు. నేను అమాయకుడిని, మంచోడిని కాబట్టే కిషన్ రెడ్డి నాపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై ఎప్పుడైనా కేసీఆర్‌ను ప్రశ్నించారా, కేసీఆర్‌ను ప్రశ్నించే ధైర్యం కిషన్ రెడ్డికి ఎందుకు లేదు?’’ అని రేవంత్ నిలదీశారు. అలాగే.. తన సొంతఖర్చులతోనే హార్వర్డ్ వర్సిటీకి వెళ్లానని, తన తమ్ముడు ఫీజు చెల్లించాడని సీఎం చెప్పారు. అక్కడ తనతోపాటు 40 దేశాలకు చెందిన 60 మంది ప్రముఖులు కోర్సు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆ ప్రముఖుల్ని విడిగా కలవాలంటే జన్మ సరిపోదన్నారు.
హైస్పీడ్ కారిడార్ల అలైన్‌మెంట్లకు సీఎం సూచనలు
హైదరాబాద్-బెంగళూర్, హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ల అలైన్‌మెంట్లకు సంబంధించి రేవంత్ రెడ్డి కన్సల్టెంట్ సంస్థకు పలు సూచనలు చేశారు. ఈ కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ తయారీ బాధ్యతను రైల్వేశాఖ ఆర్‌ఐటీఈఎస్ కన్సల్టెన్సీకి అప్పజెప్పింది. ఆ సంస్థ ప్రతినిధులు ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ఇందుకు సంబంధించిన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. వారి ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం.. పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజు, సెక్రటరీ కో-ఆర్డినేషన్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఆర్‌ఐటీఈఎస్ కన్సల్టెన్సీ సంస్థ ఈడీ లలిత్ కుమార్ పాల్గొన్నారు.
బిర్యానీ తిని ఖుబానీ కోసం కొట్లాడినట్లుగా ఏపీ తీరు
గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ చేపట్టే ప్రాజెక్టులకు మార్గం సుగమం చేసిన తర్వాత ఏపీ నిర్మించబోయే ప్రాజెక్టులకు తాము సహకరిస్తామని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. ‘‘గోదావరిలో 968 టీఎంసీల మా వాటా మమ్మల్ని వాడుకోనివ్వండి. మా ప్రాజెక్టులకు అడ్డుపడుతూ, కేంద్రం వద్ద కొర్రీలు పెడుతూ. కోర్టుల్లో కేసులు వేస్తుంటే.. మేం మీ ప్రాజెక్టులను ఎలా ముందుకు సాగనిస్తాం. మా ప్రాజెక్టులు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, సమ్మక్క-- సారక్క సహా ఇతర ప్రాజెక్టులకు అభ్యంతరాలు చెప్పకండి. ముందు మా ప్రాజెక్టులు పూర్తి చేసుకుని. మా నీళ్లను మేం వాడుకునేలా అవకాశం కల్పించండి. వరద జలాలు వాడుకుంటే తప్పేంటని ఏపీ అర్థంపర్థం లేని వాదన చేస్తోంది. ఇది సరికాదు. ఇకనైనా.. గోదావరి, కృష్ణా నదుల్లో మా వాటాను మమ్మల్ని వాడుకోనివ్వండి. అప్పుడు ఏపీ ప్రాజెక్టులు కట్టుకుంటే మేం అభ్యంతరం తెలపం. సముద్రంలో కలిసే వరద జలాల్లో 300 టీఎంసీలు మమ్మల్ని వాడుకోనిస్తే.. మీకు(ఏపీ) 300 టీఎంసీలు వాడుకునే అవకాశం కల్పిస్తాం. గోదావరికి కొత్త ట్రిబ్యునల్ కావాలని ఏపీ అడుగుతోంది. దానికి అంగీకరించే ప్రసక్తే లేదు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు ప్రధాన కారణం కృష్ణా నదిలో పంపకాలే. అది తేలకుండా గోదావరిపై ఏపీ కొత్త ప్రాజెక్టులు కడతామంటే ఎందుకు అంగీకరిస్తాం’’ అని వ్యాఖ్యానించారు. నీళ్ల విషయంలో ఏపీ తీరు బిర్యానీ తిని, ఖుబానీ (‘ఖుబానీ కా మీఠా’ స్వీట్) కోసం కొట్లాడినట్లు ఉందని, తమకు(తెలంగాణ) మాత్రం తెల్లన్నం కూడా లేదని అసహం వ్యక్తం చేశారు. అసలీ జలవివాదాలన్నింటికీ కారణం కేసీఆర్, హరీశ్‌రావులేనని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.