Share News

రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పాలన

ABN , Publish Date - Aug 28 , 2026 | 04:01 AM

రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. సమస్యలపై గళమెత్తే ప్రతిపక్షాలు, విద్యార్థులపై పోలీసు నిర్బంధాలను ప్రయోగిస్తోందని విమర్శించారు. రామంతాపూర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థుల దీక్షకు మద్దతు తెలిపేందుకు బయలు దేరుతున్న రాంచందర్‌రావును ఓయూ పోలీసులు తార్నాకలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు.

రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పాలన
Bjp Ramchander rao

  • జీవో నంబర్‌ 97ను రద్దు చేయాలి

  • తెలంగాణలో విద్యా విధ్వంసంపై రాహుల్‌ గాంధీ నోరు విప్పాలి

  • బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు

  • రామంతాపూర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో

  • దీక్షా శిబిరానికి వెళుతుండగా హౌస్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌/తార్నాక, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు. సమస్యలపై గళమెత్తే ప్రతిపక్షాలు, విద్యార్థులపై పోలీసు నిర్బంధాలను ప్రయోగిస్తోందని విమర్శించారు. రామంతాపూర్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థుల దీక్షకు మద్దతు తెలిపేందుకు బయలు దేరుతున్న రాంచందర్‌రావును ఓయూ పోలీసులు తార్నాకలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. దాంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఎంపీ ఈటల రాజేందర్‌.. రాంచందర్‌రావు నివాసానికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ తనను గృహ నిర్బంధం చేయడం ప్రభుత్వ పిరికితనానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. ప్రభుత్వం జీవో 97తో పాలిటెక్నిక్‌ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిందని, ఈసెట్‌ను రద్దు చేసే కుట్ర జరుగుతోందన్నారు. శక్తి స్కీమ్‌ పేరుతో వింత ప్రయోగాలు చేస్తూ, పాలిటెక్నిక్‌ విద్యార్థుల చదువును అవమానిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షి్‌పలు సక్రమంగా ఇవ్వకుండా వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తిరుగుతూ డ్రామాలు ఆడడం మానేసి, తెలంగాణలో విద్యా విధ్వంసంపై నోరు విప్పాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల హక్కులు సాధించేవరకు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.


కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో ఆసంతృప్తి: ఈటల

కాంగ్రెస్‌ పాలనపై రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందా అని ఎదురుచూస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. 1965లో ఏర్పడిన కాలనీలు, అక్కడ కట్టిన అపార్ట్‌మెంట్లను ఇవాళ 22ఏ జాబితాలో చేర్చారన్నారు. దీంతో తమ పిల్లల విదేశీ చదువులు, ఆడపిల్లల పెళ్లిళ్లకు బ్యాంకు రుణాల కోసం వెళ్తే.. ‘మీ ఆస్తి 22ఏ కింద ఉంద’ని చెబుతున్నారని ఆయా కాలనీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.


ఈ వార్తలను కూడా చదవండి

మంత్రి లోకేష్‌ పర్యటనకు భారీ ఏర్పాట్లు

టీడీపీ శ్రేణుల్లో జోష్‌

Updated Date - Aug 28 , 2026 | 06:07 AM