అసెంబ్లీలో ఇప్పసారా రచ్చ.. రాకేష్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రుల ఆగ్రహం..
ABN , Publish Date - Mar 25 , 2026 | 05:55 PM
ఇప్పసారా అంశంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ రభసకు దారి తీసింది. ఇప్పసారాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తన వెర్షన్ వినిపించగా.. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి సెటైర్ వేశారు. ఇప్పసారా అంటే ప్రభుత్వానికి నవ్వులాటగా ఉందని మండిపడ్డారు.
హైదరాబాద్, మార్చి 25: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా అంశంపై చర్చ రభసకు దారి తీసింది. ఇప్పసారాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తన వెర్షన్ వినిపించగా.. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి సెటైర్ వేశారు. ఇప్పసారా అంటే ప్రభుత్వానికి నవ్వులాటగా ఉందని మండిపడ్డారు. ఇప్పసారా తయారుచేస్తే ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టొద్దని అన్నారు. దీంతో మంత్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పసారా గురించి మాట్లాడుతూ ఇందిరమ్మ పేరు తీయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాకేష్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ‘ఇందిరాగాంధీపై అంత కక్ష ఎందుకు?. మహిళా నేతను కించపరిచారు. రాకేష్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి. సంక్షేమ పథకాలకు మాత్రమే ఇందిరమ్మ పేరు పెడతాం. సంక్షోభం తెచ్చేవాటికి కాదు’ అని అన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మహిళలకు బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. రాకేష్‌రెడ్డి నోరు జారారని, క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు.
నేను ఇందిరాగాంధీని అవమానించలేదు: రాకేష్‌రెడ్డి
తాను ఇందిరాగాంధీని అవమానించలేదని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి స్పష్టం చేశారు. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ..‘ ఇందిరాగాంధీ ఉక్కు మహిళ.. ప్రపంచస్థాయి నేత. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు ఇందిరమ్మ పేరు పెడుతుంటారు. ఇప్పసారా పథకానికి గొప్ప మహిళానేత ఇందిర పేరు పెట్టొద్దని.. గౌరవంతో సూచించా గానీ అవమానించాలని కాదు. నా వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు. తమాషా చేస్తున్నారా అంటూ నన్ను బెదిరిస్తారా?. నేనేం తప్పు మాట్లాడానో రికార్డులు పరిశీలించండి. అవసరమైతే హౌస్ కమిటీ వేయండి. క్షమాపణ చెప్పాల్సి వస్తే చెబుతా. మాజీ ప్రధాని ఇందిర అంటే మాకు ఎప్పుడూ గౌరవమే’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
కవిత కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు
ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్