ఇంటి ముంగిటకే పౌర సేవలు: మంత్రి శ్రీధర్ బాబు
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:18 PM
హైదరాబాద్ బేగంపేటలో GOVconnect, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ ఆధ్వర్యంలో జరిగిన 'ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కాంక్లేవ్'ను ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 7: నగరంలోని బేగంపేటలో GOVconnect, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన 'ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కాంక్లేవ్' కార్యక్రమాన్ని రాష్ట్ర సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘనంగా ప్రారంభించారు. పాలనలో ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడంపై నిర్వహించిన ఈ సదస్సులో మహారాష్ట్ర సీఎంవో చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్, మిత్రా సీఈవో ప్రవీణ్ పరదేశి, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఎండీ జీవీఎల్ సత్యకుమార్, నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా సీఈవో డా.దేవేష్ త్యాగి, అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అడిషనల్ సెక్రటరీ సౌరభ్ కె.తివారీ వంటి ప్రముఖ అధికారులు పాల్గొని తమ ఆమోదయోగ్యమైన సలహాలు, అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్‌తో పాటు మోసాలకు తావులేని బ్లాక్‌చెయిన్ ఆధారిత సర్టిఫికెట్ల సేవలను అందుబాటులోకి తెస్తున్నాం. టీ-ఫైబర్ ద్వారా దాదాపు 80 లక్షలకు పైగా గ్రామీణ కుటుంబాలకు డిజిటల్ కనెక్టివిటీ అందించడమే లక్ష్యం. అలాగే, వృద్ధులు, దివ్యాంగులకు పౌర సేవలను నేరుగా ఇంటి ముంగిటకే త్వరలో అందిస్తాం. 'డిజిటల్ ఆఫీస్' ప్రాజెక్ట్ ద్వారా పేపర్ లెస్ గవర్నెన్స్‌ను వేగవంతం చేస్తాం. 20కి పైగా ప్రభుత్వ శాఖలను ఒకే తాటిపైకి తెచ్చేలా రియల్ టైమ్ గవర్నమెంట్ డ్యాష్ బోర్డును సైతం రూపొందిస్తున్నాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
శ్రీలంక సిరీస్‌లో భారత్‌కు ‘డూ ఆర్ డై’.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు నిలవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వరుణ యాగం.. ముహూర్తం ఫిక్స్