Share News

దానం, కడియంలకూ క్లీన్‌చిట్‌

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:25 AM

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లనూ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ డిస్మిస్‌ చేశారు.

దానం, కడియంలకూ క్లీన్‌చిట్‌

  • అనర్హత పిటిషన్లను డిస్మిస్‌ చేసిన స్పీకర్‌

  • ఇప్పటికే మరో 8 మంది ఎమ్మెల్యేలపై వచ్చిన పిటిషన్లు కూడా డిస్మిస్‌

  • ఏ తప్పు చేయలేదు.. కాబట్టే క్లీన్‌చిట్‌: దానం నాగేందర్‌

  • ఎంపీగా పోటీ చేశా.. కానీ ఆపార్టీ సభ్యత్వం తీసుకోలేదని వ్యాఖ్య

  • స్పీకర్‌ తీర్పును స్వాగతిస్తున్నా

  • ఆ పిటిషన్‌కు అర్హతే లేదు: కడియం

  • స్పీకర్‌ తీర్పుపై హైకోర్టుకు బీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌/బంజారాహిల్స్‌/హనుమకొండ/స్టేషన్‌ఘన్‌పూర్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లనూ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ డిస్మిస్‌ చేశారు. దానంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి.. కడియంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై బుధవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో స్పీకర్‌ మరోసారి విచారణ చేపట్టారు. దానం, కడియం పార్టీ మారినట్లుగా పిటిషన్‌దారులు సరైన ఆధారాలు సమర్పించని నేపథ్యంలో వారి పిటిషన్లను డిస్మిస్‌ చేస్తున్నట్లు ఆయన తీర్పును వెలువరించారు. వాస్తవానికి దానం, కడియంతో పాటుగా మరో 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరారని, వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేశారు. ఇటు ఆయా పిటిషన్లపై త్వరగా విచారణ చేపట్టాలని స్పీకర్‌కు సూచించాలంటూ సుప్రీం కోర్టులోనూ పిటిషన్‌ వేశారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సూచన మేరకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ప్రక్రియను స్పీకర్‌ చేపట్టారు. దానం, కడియం మినహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లపై తొలుత విచారణను పూర్తి చేశారు. వారు పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని తేల్చిన స్పీకర్‌.. ఆయా పిటిషన్లను డిస్మిస్‌ చేశారు. దానం, కడియంలపై పిటిషన్లపై విచారణ ప్రక్రియను పూర్తిచేసేందుకు ఈనెల 12 వరకూ సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరిపై దాఖలైన పిటిషన్లపైనా విచారణ ప్రక్రియను పూర్తి చేసిన స్పీకర్‌.. ఆయా పిటిషన్లనూ తాజాగా డిస్మిస్‌ చేస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పుకు సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత అసెంబ్లీ వెబ్‌సైట్‌లో తీర్పు కాపీ పెట్టనున్న ట్లు అసెంబ్లీ కార్యదర్శి వెల్లడించారు. మరోవైపు.. పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను డిస్మిస్‌ చేస్తూ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ ఇచ్చిన తీర్పుపై హైకోర్టును ఆశ్రయించాలని బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాజా తీర్పు కాపీ కూడా వెలువడిన వెంటనే హైకోర్టులో సవాల్‌ చేయనున్నట్లు సమాచారం.


తప్పు చేయలేదని తేలడంతోనే క్లీన్‌చిట్‌..: దానం

అసెంబ్లీ స్పీకర్‌ పరిధిలో ఎటువంటి తప్పు చేయలేదని తేలింది కాబట్టే తనకు క్లీన్‌చిట్‌ ఇచ్చారని దానం నాగేందర్‌ అన్నారు. ఎంపీగా పోటీ చేశాను తప్పితే ఎక్కడా ఆ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్‌ కొట్టేసిన నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని నివాసంలో దానం మీడియాతో మాట్లాడారు. ‘రాజ్యాంగపరంగా ఉన్న హక్కుతోనే సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేశా.. కానీ ఎన్నికల్లో ఓడిపోవడానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ అవిపవిత్ర కలయికే కారణం. ఎంపీగా గెలిచి ఉంటే ఈ పంచాయితీ ఉండేది కాదు. పోటీ అనంతరం కేసీఆర్‌ ఎప్పుడు వివరణ కోరలేదు కాబట్టి నేను స్పందించలేదు. సీఎం పదవి చేజారిపోయిందని ఇబ్బంది పడుతున్న కేటీఆర్‌ నాపై అనవసర ఫిర్యాదులు చేయించారు. ఆనాడు సబితారెడ్డి, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌లను పార్టీలోకి తీసుకొని మంత్రి పదవి ఇచ్చిన సబబే అని చెప్పిన వారు.. ఇప్పుడు అభ్యంతరాలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారు’ అని ప్రశ్నించారు. అసలు తన ఎన్నిక పట్ల బీజేపీకి ఏం సంబంధముందో అర్థం కావడం లేదన్నారు. మహేశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డిలు తనపై ఏ హక్కుతో ఫిర్యాదు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ పార్టీకి ఎక్కడ వ్యతిరేకంగా పనిచేయలేదని.. అందుకే స్పీకర్‌ స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. ఒకవేళ తనకు వ్యతిరేక నిర్ణయం వచ్చినా ఉప ఎన్నికల్లో పోటీ చేసేవాడినని ఆయన స్పష్టం చేశారు.

అనర్హత పిటిషన్‌కు అర్హతే లేదు: కడియం

తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ స్పీకర్‌ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపుల పిటిషన్లు చట్టబద్ధం కావని, అసలు అనర్హత పిటిషన్‌కు అర్హత లేదన్నారు. బీఆర్‌ఎస్‌ నియమావళి ప్రకారం పార్టీ ఫిరాయింపునకు పాల్పడితే ఆ సభ్యుడికి షోకాజ్‌ నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని.. అలా తనకు ఎలాంటి షోకాజ్‌ నోటీసులు ఇవ్వలేదని, వివరణ తీసుకోలేదని చెప్పారు. పార్టీ విప్‌ ఏనాడు ధిక్కరించలేదని వెల్లడించారు. కేసీఆర్‌ ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడలేదని, పార్టీ పరంగా కేసీఆర్‌ ఎందుకు పిటిషన్‌ వేయలేదని ప్రశ్నించారు. శాసనసభా సమావేశాల్లో కేటీఆర్‌ తమ సభ్యుల సంఖ్య 38 అని చెప్పి, అందుకు తగట్టు తమకు సమయమివ్వాలని స్పీకర్‌ను అడిగినట్లు గుర్తుచేశారు. తమపై అనర్హత వేటు వేయాలని పిటిషన్‌ ఇచ్చి.. బీఆర్‌ఎ్‌సఎల్పీకి నెలకు రూ.5 వేలను తమ జీతం నుంచి సభ్యత్వ రుసుం తీసుకుంటున్నారని తెలిపారు. అసలు కేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో ఎన్ని రాజకీయ పార్టీల నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అసలు పార్టీ ఫిరాయింపులకు పాత్రధారులు, సూత్రధారులు వారేనన్నారు. 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలను మంత్రులను చేసిన చరిత్ర వారిదని మండిపడ్డారు. అయినా కేటీఆర్‌ సుద్దపూస లెక్క మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. అనాడు వారు చేసింది తప్పని.. ఇప్పటికైనా కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అలా చెప్పిన మరుక్షణమే తాను రాజీనామా చేస్తానని కడియం సవాల్‌ విసిరారు.


చరిత్రహీనుడిగా స్పీకర్‌ మిగిలిపోతాడు: రాజయ్య

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరిల విషయంలో స్పీకర్‌ తన తీర్పు ద్వారా క్లీన్‌చిట్‌ ఇచ్చి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడని స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే రాజయ్య ధ్వజమెత్తారు. స్పీకర్‌ తీర్పు ఇచ్చిన రోజు అసెంబ్లీ చరిత్రలోనే బ్లాక్‌డేగా మిగిలిపోతుందన్నారు. సీఎం రేవంత్‌ రాసి ఇచ్చిన స్ర్కిప్టును స్పీకర్‌ తన తీర్పుగా ప్రకటించారని ఆరోపించారు. దీపాదాస్‌ మున్షీ, సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలోనే కడియం పార్టీ మారిన విషయం అందరికీ తెలుసని.. శ్రీహరికి దమ్ముంటే స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొని రావాలని సవాల్‌ విసిరారు.

Updated Date - Mar 12 , 2026 | 05:25 AM