Share News

సింగరేణి ఇంటర్న్‌కు లైంగిక వేధింపుమనస్తాపంతో ఆత్మహత్య

ABN , Publish Date - Sep 16 , 2026 | 05:46 AM

సింగరేణి ఇంటర్న్‌కు లైంగిక వేధింపులు.. సంబంధించి సదరు యువతి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన యువతి పాలిటెక్నిక్‌లో డిప్లొమా చేసి ఈసెట్‌ ద్వారా ఉస్మానియా ఇంజనీరింగ్‌ కళాశాలలో సీటు సాధించింది. అయితే ఇంటర్న్‌షిప్‌ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో సింగరేణి సంస్థలో చేరింది.

సింగరేణి ఇంటర్న్‌కు లైంగిక వేధింపుమనస్తాపంతో ఆత్మహత్య
image of harrasment

  • పని ప్రదేశంలో ఓవర్‌మ్యాన్‌ వేధింపులు

  • ఫిర్యాదు చేస్తే తోసిపుచ్చిన యాజమాన్యం

  • సింగరేణిలో మానేసి వేరే చోట

  • ఇంటర్న్‌షిప్‌లో చేరిన విద్యార్థిని

  • అయినా వేధింపులు కొనసాగించిన

  • ఓవర్‌మ్యాన్‌, మరో లెక్చరర్‌

  • మనస్తాపంతో బాధితురాలి బలవన్మరణం

  • ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు

  • ఓవర్‌మ్యాన్‌ తనను రేప్‌ చేశాడని

సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్న విద్యార్థిని!

కోల్ సిటీ (పెద్దపల్లి),సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి) సింగరేణి సంస్థలో ఇంటర్న్ షిప్ కు వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్ధిని(21) ఓ ఓవర్ మ్యాన్ (సూపర్ వైజర్) నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొంది. ఈ విషయమై ఆమె ఫిర్యాదు చేయగా యాజమాన్యం తోసిపుచ్చింది. దీంతో ఆమె ఇంటర్న్ షిప్ మానేయగా, వేధింపులు మాత్రం కొనసాగడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించి సదరు యువతి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన యువతి పాలిటెక్నిక్‌లో డిప్లొమా చేసి ఈసెట్‌ ద్వారా ఉస్మానియా ఇంజనీరింగ్‌ కళాశాలలో సీటు సాధించింది. అయితే ఇంటర్న్‌షిప్‌ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో సింగరేణి సంస్థలో చేరింది. ఈ క్రమంలో స్థానిక 2ఇంక్లైన్‌లో బొమ్మకంటి రవికుమార్‌ అనే ఓవర్‌మ్యాన్‌(సూపర్‌వైజర్‌)తో ఆమెకు పరిచయమైంది. తానూ మంచిర్యాల నస్పూర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థినని, లెక్చరర్‌ నవీన్‌ శిష్యుడిని చెప్పి అతడు ఆ యువతికి దగ్గరయ్యాడు. అనంతరం ఆమెను లైంగికంగా వేధించాడు. దీనిపై బాధితురాలు సింగరేణి యాజమాన్యానికి ఫిర్యాదు కూడా చేసింది. కానీ, ఆమె వాదనలను యాజమాన్యం తోసిపుచ్చింది. దీంతో సింగరేణిలో ఇంటర్న్‌షిప్‌ మానేసిన ఆ యువతి గోదావరిఖనిలోని ఓ కంప్యూటర్‌ సెంటర్‌లో పని చేస్తోంది. కానీ, ఓవర్‌మ్యాన్‌ రవికుమార్‌తోపాటు పాలిటెక్నిక్‌ కళాశాల అధ్యాపకుడు నవీన్‌ ఆమెను వేధించడం ఆపలేదు. ఈ క్రమంలో ఈ నెల 13, ఆదివారం గోదావరిఖనిలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పాలిటెక్నిక్‌ అధ్యాపకుడు నవీన్‌.. ఆ యువతిని గోదావరిఖనిలోని ఆమె ఇంటికి చేర్చాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను జనరల్‌ ఆస్పత్రిలో చేర్పించిన తర్వాత నవీన్‌ పరారయ్యాడు.


చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి ఆమె మృతి చెందింది. ఈ మేరకు యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మకంటి రవి కుమార్‌, నవీన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలిసింది. కాగా, బాధిత యువతి రాసినట్టు చెబుతున్న ఓ సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. తాను ఇంటర్న్‌షిప్‌కు జీడీకే 2ఇంక్లైన్‌కు వస్తే తనపై ఓవర్‌మెన్‌ బొమ్మకంటి రవికుమార్‌ అత్యాచారం చేశాడని, ఈ విషయంపై యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, తప్పుడు ఆరోపణ అని ఫిర్యాదును క్లోజ్‌ చేశారని అందులో రాసి ఉంది. మానసిక క్షోభ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుతో అయినా రవికుమార్‌కు తగిన శిక్ష పడాలని కోరుకుంటున్నానని పేర్కొంది.

దళిత సంఘాల ఆందోళన...

సదరు యువతిని వేధించిన రవికుమార్‌, నవీన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, సింగరేణి అధికారులను బాధ్యులను చేయాలని దళిత సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు యువతి మృతదేహంతో గోదావరిఖని మున్సిపల్‌ జంక్షన్‌ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. బాధితురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దళిత సంఘాల నాయకులతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఫోన్‌లో మాట్లాడారు. తగిన న్యాయం చేస్తానని, యువతి మృతికి కారణమైన వారిని వదిలిపెట్టేది లేదని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

ఈ వార్తలు కూడా చదవండి

2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గోదావరి పుష్కరాలకు నిధుల మంజూరు

Updated Date - Sep 16 , 2026 | 05:46 AM