Share News

గొప్పల కోసం తప్పుడు లెక్కలు

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:25 AM

నలభై లక్షల టన్నుల బొగ్గు తవ్వకం మిథ్య.. అమ్మకం మిథ్య.. లాభాలు మిథ్య! అయినా పన్నులు కట్టారా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోల్‌ సెస్‌ చెల్లించారా..

గొప్పల కోసం తప్పుడు లెక్కలు

  • 2024-25లో బొగ్గు ఎక్కువ ఉత్పత్తి అయినట్టు చూపడమే వివాదానికి కారణం

  • 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు మాయం కల్పితమే అంటున్న అధికారవర్గాలు

  • బొగ్గు మాయం కావడానికి అవకాశమే లేదు.. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం

హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): నలభై లక్షల టన్నుల బొగ్గు తవ్వకం మిథ్య.. అమ్మకం మిథ్య.. లాభాలు మిథ్య! అయినా పన్నులు కట్టారా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోల్‌ సెస్‌ చెల్లించారా? కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్‌) కింద నిధులు కూడా వెచ్చించారా?.. అంటే, విశ్వసనీయ వర్గాలు ఔననే సమాధానమిస్తున్నాయి. కృతిమ లాభాల పేరుతో షేర్‌మార్కెట్‌లో విలువలు పెంచుకోవడానికి ప్రైవేట్‌ కంపెనీలు అడ్డదారులు తొక్కుతాయని ఇప్పటిదాకా విన్నాం. కానీ సింగరేణి కూడా అలాగే చేసిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సింగరేణిలో రూ.1600 కోట్ల కుంభకోణం జరిగిందని.. 40 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు మాయం అయిందని జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఆరా తీయగా.. గొప్పల కోసం చెప్పిన తప్పుడు లెక్కలే ఆ సంస్థ పరువు పోవడానికి కారణమయ్యాయని తెలిసింది. దీనికి బీజం 2024-25 ఆర్థిక సంవత్సరంలో పడినట్టు సమాచారం. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో కాగితాల్లో లెక్కలు మారుతుంటాయని.. ఆదాయం పెరిగినట్లు చూపించుకునే క్రమంలో కనిష్ఠంగా ఒకటి-రెండు మిలియన్‌ టన్నుల బొగ్గు విక్రయాలు అధికంగా జరిగినట్లు లెక్కలు చూపించడం సింగరేణిలో ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ అని... 2024-25 ఆర్థిక సంవత్సరంలో అది శ్రుతి మించిందని విమర్శలు వస్తున్నాయి. ఆ ఏడాది ఏకంగా 4 మిలియన్‌ టన్నులు (40 లక్షల టన్నుల) బొగ్గు అధికంగా ఉత్పత్తి అయిందని, నిర్దేశిత టార్గెట్‌ కన్నా అధికంగా ఉత్పత్తి జరిగిందని సింగరేణి యంత్రాంగం పేర్కొనడమే ప్రస్తుత వివాదానికి కారణమని విమర్శలు వస్తున్నాయి. దాన్ని సరిచేయడానికి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 4 మిలియన్‌ టన్నుల కల్పిత బొగ్గును లెక్కలో నుంచి తీసివేయడంతో వివాదం రేగిందని తెలియవచ్చింది. ఈ వివాదంపై విచారణ జరపాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి లేఖ రాయగా.. అంతకు ముందే బీఆర్‌ఎస్‌ దీనిపై పోరాటం ప్రారంభించింది. త్వరలోనే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కూడా జరుగనున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా... కోల్‌బెల్ట్‌లో సత్తా చాటుకోవడం అత్యంత అవసరం. ఆ క్రమంలోనే ఈ వివాదం ముదిరిందనే వాదన కూడా వినిపిస్తోంది.


బొగ్గు మాయం అసంభవమేనా..

సింగరేణిలో బొగ్గును మాయం చేయడం అసంభవమేనని అధికారులు చెబుతున్నారు. ఒక్క తట్ట బొగ్గును కూడా అక్రమంగా తరలించే అవకాశాలు ఉండవని వారు స్పష్టం చేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి కాగానే దాన్ని రవాణా చేయడానికి ఇన్‌వాయి్‌సలు జారీ చేస్తుంటారు. ఆ ఇన్‌వాయిస్‌లు చేతికి అందాకే రైల్వే ఆ బొగ్గును థర్మల్‌ కేంద్రాలకు రవాణా చేస్తుంది. ఇన్‌వాయిస్‌లు లేకుండా బొగ్గును రైల్వే తరలించదు. రవాణా అయిన బొగ్గు ఇన్‌వాయిస్‌లపై జీఎస్టీ బిల్లులు జనరేట్‌ అవుతాయి. విక్రయాలు జరిపిన తర్వాత వచ్చిన ఆదాయంపైనే ఆదాయపన్ను కడుతుంటారు. ఈ నేపథ్యంలో.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో టార్గెట్‌ల కోసం చేసిన తప్పిదం.. ఆ తర్వాత దాన్ని సరిదిద్దడానికి చేసిన ప్రయత్నమే సింగరేణి పరువు పోవడానికి కారణంగా గుర్తిస్తున్నారు.

కాగితాల్లోనే లాభాలు

సింగరేణి సంస్థకు జెన్‌కో నుంచి ఏకంగా రూ.20,312 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. డిస్కమ్‌ల నుంచి రూ.15,500 కోట్లు రావాల్సి ఉంది. ఆయా సంస్థలు చెల్లింపులు చేయకపోవడంతో ప్రతి నెలా వేతనాలకు పక్కచూపులు చూడాల్సిన పరిస్థితి. చెల్లింపులు సరిగ్గా జరిగితే దేశంలో అత్యున్నత సంస్థల్లో ఒకటిగా సింగరేణి ఉండే అవకాశాలు ఉన్నాయి.

నిల్వ.. 28.77 లక్షల టన్నులే

ఈ ఏడాది మే 26 నాటికి సింగరేణిలో అత్యల్పంగా 28.77 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని యాజమాన్యం ప్రకటించింది. ఇది గత పదేళ్ల స్టాక్‌ చరిత్రలో అత్యల్పం. 2015-16లో 70 లక్షల టన్నులు, 2016-17 లో 74 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు రికార్డు అయింది. 2014 నుంచి 2024 వరకు సగటున 50 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు గనులు, సీహెచ్‌పీల వద్ద ఉన్నాయని యాజమాన్యం తెలిపింది.

బొగ్గు మాయం అబద్ధం

సింగరేణిలో బొగ్గు మాయం అనే ప్రచారం పూర్తిగా అబద్ధం. ఒక్క తట్ట బొగ్గు కూడా గనుల నుంచి బయటికి వెళ్లడానికి అవకాశ మే లేదు. కేవలం 2024-25 ఆర్థిక సంవత్సరంలో గొప్పల కోసం చేసిన తప్పిదం వల్లే ఈ వివాదం ఏర్పడింది. ఏటా సంస్థలు కృతిమ లెక్కలు చూపించడం ఆనవాయితీగా ఉంది. బొగ్గు బావుల వద్ద నిల్వలున్నాయి. బొగ్గు ఎక్కడికీ పోలేదు.

- వాసిరెడ్డి సీతారామయ్య, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం

Updated Date - Jun 20 , 2026 | 04:25 AM