Share News

గద్దెపైకి సారలమ్మ

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:38 AM

లక్షలాది మంది భక్తులు నిలువెల్లా కనులై ఎదురుచూస్తున్న సారలమ్మ బుధవారం ఆదివాసీ సంప్రదాయాల మధ్య అట్టహాసంగా మేడారంలోని గద్దెపైకి చేరుకుంది. దీనితో మహా జాతర తొలిఘట్టం ప్రశాంతంగా పూర్తయినట్టయింది.

గద్దెపైకి సారలమ్మ

  • ఉదయం నుంచి సారలమ్మ గుడిలో పూజలు

  • సాయంత్రం బయలుదేరిన కన్నెపల్లి కల్పవల్లి

  • అడుగడుగునా భక్తుల నీరాజనం.. కన్నెపల్లి నుంచి మేడారం దాకా 2 కి.మీ. మేర బారులు

  • డోలు వాయిద్యాలతో సంప్రదాయ నృత్యాలు

  • శిగమూగిన వేలాది మంది మహిళలు

  • నేడే గద్దెపైకి సమ్మక్క తల్లి.. పూర్తైన ఏర్పాట్లు

  • జంపన్నవాగులో కొట్టుకుపోయి ఒకరి మృతి

మేడారం, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): లక్షలాది మంది భక్తులు నిలువెల్లా కనులై ఎదురుచూస్తున్న సారలమ్మ బుధవారం ఆదివాసీ సంప్రదాయాల మధ్య అట్టహాసంగా మేడారంలోని గద్దెపైకి చేరుకుంది. దీనితో మహా జాతర తొలిఘట్టం ప్రశాంతంగా పూర్తయినట్టయింది. కన్నెపల్లిలోని గుడి నుంచి సారలమ్మ బుధవారం రాత్రి 7.38 గంటలకు బయలు దేరింది. జంపన్నవాగు వద్దకు 8.48 గంటలకు చేరుకున్నది. అక్కడి నుంచి అశేష భక్తజనం నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠించారు. అమ్మను పూజారులు మేడారంలోని గద్దెకు తరలించే ఘట్టం భక్తులను దివ్యానుభూతికి లోను చేసింది. ఈ ప్రక్రియ బుధవారం ఉదయం నుంచే మొదలైంది. కన్నెపల్లిలోని సారలమ్మ గుడిని పూజారుల కుటుంబ సభ్యులు తొలుత శుద్ధి చేశారు. గుడి లోపల, బయట అలికి ముగ్గులు వేసి మామిడి తోరణాలు, బంతి పూలతో అందంగా అలంకరించారు. సాయంత్రం అసలైన పూజాతంతు మొదలైంది. పూజా మందిరంలో ప్రధాన పూజారి కాక సారయ్యతో పాటు ఇతర వడ్డెలు రహస్య పూజలు చేశారు. లోపల పూజలు జరుగుతున్నంతసేపూ గుడి బయట ఆదివాసీ కళాకారులు డోలు వాయిద్యాలతో సంప్రదాయ నృత్యాలు చేశారు. సారలమ్మను కీర్తిస్తూ పాటలు పాడారు. శివసత్తులు శిగమూగారు. మరోవైపు.. సారలమ్మ రాకను కళ్లారా చూడాలన్న తపనతో వేలాదిగా భక్తులు ఉదయం నుంచే పెద్దసంఖ్యలో కన్నెపల్లికి చేరుకున్నారు. సాయంత్రం 7 గంటల వరకూ గుడి లోపల పూజలు జరిగాయి. పూజారి కాక సారయ్య.. సారలమ్మ ప్రతి రూపమైన కుంకుమ భరిణను తీసుకొని బయలుదేరుతున్న సంకేతం అందగానే అప్పటి వరకు గుడి బయట వేచివున్న వేలాది భక్తజనం శిగమూగారు. సంతానం లేనివారు పిల్లల కోసం వరాలు పట్టారు. గుడిలో హారతి ఇచ్చి గంటానాథం, బూరకొమ్ము ధ్వనితో మహిళలు గుడి ముందర తడిబట్టలతో సాగిలపడ్డారు.


దారి పొడవునా నీరాజనాలు

పూజారి సారయ్య సారలమ్మ తల్లి రూపాన్ని తలకెత్తుకొని గుడిబయట అడుగు పెట్టగానే భక్తుల కేరింతలతో తల్లికి స్వాగతం పలికారు. అద్వితీయమైన అనుభూతితో నిలువెల్లా పులకించి పోయారు. దారికి అడ్డంగా పడుకున్న మహిళలపై పసుపు కుంకుమలు, అక్షింతలు, శుద్ధ జలాన్ని చల్లుతూ వారిని దాటుకుంటూ సారయ్య.. తల్లితో ముందుకు సాగారు. సారలమ్మ తల్లి రూపాన్ని తాకాలన్న తపనతో వడ్డెల వద్దకు చేరుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ముందుకు చొచ్చుకువచ్చారు. అయితే.. రోప్‌ పార్టీలు వడ్డెలకు రక్షణ వలయంగా నిలబడి దారి కల్పించారు. భక్తులు చొచ్చుకు రాకుండా అడ్డుగా నిలిచారు. సారలమ్మ మేడారంవైపు సాగివస్తుండగా.. కన్నెపల్లి గ్రామస్థులు ఎదురెళ్లి హారతులు ఇచ్చారు. తమ ఇళ్ల ముందు నిల్చొని స్వాగతం పలికారు. మహిళలే తల్లి ప్రయాణించే మార్గంలో అడుగడుగునా నీళ్లారబోశారు. కోళ్లు, మేకలను బలి ఇచ్చారు. మొక్కులను సమర్పించుకున్నారు. ‘‘సారలమ్మ తల్లీ.. మమ్మల్ని చల్లంగ చూడ’’ంటూ వేడుకున్నారు. కన్నెపల్లి నుంచి మేడారం వరకు 2 కిలోమీటర్ల మేర దారి పొడవునా భక్తులు బారులుతీరి నిల్చున్నారు. తల్లికి అడుగడుగునా నీరాజనాలు పలికారు.

జంపన్నవాగు వద్ద పూజలు

కన్నెపల్లి నుంచి జంపన్నవాగు వద్దకు వచ్చిన తర్వాత వాగు ఒడ్డున కొద్దిసేపు తల్లికి జంపన్న తరఫున ప్రత్యేక పూజలు నిర్వహించారు. జంపన్నవాగు దాటుతుండగా భక్తులు జయజయధ్వానాలు చేశారు. వాగుకు ఇటువైపున ఒడ్డుపై ప్రతిష్ఠితమైన నాగులమ్మ వద్ద కూడా పూజారులు కొద్దిసేపు ఆగారు. అక్కడ కూడా నాగులమ్మ పక్షాన సారలమ్మకు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మేడారంలోని సమ్మక్క గుడికి సారలమ్మను తీసుకువచ్చారు. అప్పటికే మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి చేరిన పగిడిద్దరాజుతో పాటు గోవిందరాజుతో సహా సమ్మక్క గుడిలో సారలమ్మకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పగిడిద్దరాజుకు, సమ్మక్కకు కల్యాణం తంతు నిర్వహించారు. ఇది పూర్తయిన తర్వాత గోవిందరాజు, పగిడిద్దరాజు తోడు రాగా, సారలమ్మను మేడారం గద్దె వద్దకు పూజారులు చేర్చారు. ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం అమ్మను గద్దెపై ప్రతిష్ఠించారు. అదే ప్రాంగణంలో ఒకవైపు గోవిందరాజును, మరోవైపు పగిడిద్దరాజును వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దెలపైకి చేర్చారు. దీనితో మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర తొలిఘట్టం దిగ్విజయంగా ముగిసినట్లయింది. పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. సారలమ్మ రాక సందర్భంగా గద్దెల వద్ద భక్తులు పోటెత్తారు. సారలమ్మను, గోవిందరాజు, పగిడిద్దరాజును ఏకకాలంలో దర్శించుకొని తన్మయత్వానికి లోనయ్యారు. ఈ ముగ్గురు దేవతల రాకతో సమ్మక్క ఆగమనానికి సంకేతం లభించినట్లయింది. గతంలో కన్నా భిన్నంగా గద్దెల ఆధునికీకరణలో భాగంగా సమ్మక్కతో పాటు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్ద్దెలను ఒకదాని వెనుక ఒకటిగా నిర్మించడంతో భక్తులకు దర్శనం సులువైంది.


జంపన్నవాగులో కొట్టుకుపోయి ఒకరి మృతి

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర తొలిరోజే జంపన్నవాగులో విషాదం చోటు చేసుకుంది. జాతర కోసం సంతోషంగా వచ్చిన ఓ కుటుంబానికి కన్నీరే మిగిలింది. జంపన్నవాగులో పుణ్యస్నానం కోసం వెళ్లిన కిరణ్‌(45) అనే భక్తుడు నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు. మత్య్సశాఖ అధికారులు, రెస్క్యూ టీం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన ఆర్‌.కిరణ్‌ తన కుటుంబ సభ్యులతో మంగళవారం మేడారం జాతరకు వచ్చారు. చిలుకలగుట్ట ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. బుధవారం సాయంత్రం సారలమ్మ వస్తోందని తెలిసి జంపన్నవాగులో కుటుంబ సభ్యులతో కలిసి పుణ్య స్నానాలకు వెళ్లారు. జంపన్నవాగు మధ్యలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుందని తెలియక ఆయన లోపలికి వెళ్లి.. వాగు ఉధృతికి కొట్టుకుపోయారు. అక్కడున్న కొందరు యువకులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. గల్లంతైన కిరణ్‌ కోసం రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లు గాలించగా.. అక్కడికి చాలాదూరంలో ఆయన మృతదేహం కనిపించింది. సంతోషంగా జాతరకు వచ్చిన ఆ కుటుంబం కిరణ్‌ మృతితో కన్నీరుమున్నీరైంది. ఈ నేపథ్యంలో.. జంపన్నవాగులో స్నానాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

కోళ్లకు వైరస్‌ దెబ్బ

మేడారం మహా జాతరలో కోళ్లకు వైరస్‌ దెబ్బ తగిలింది. జాతర ప్రారంభమైన బుధవారం రోజున పలు షాపుల్లో వేల సంఖ్యలో బ్రాయిలర్‌, నాటు కోళ్లు మృతి చెందాయి. మృతి చెందిన కోళ్లను ట్రాక్టర్లలో అడవికి తరలించి ఖననం చేశారు. మొదటిరోజే పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లింది. వైరస్‌ దెబ్బకు మరింత నష్టం జరుగుతుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. అనారోగ్యం బారిన పడిన కోళ్లను సరఫరా చేస్తున్న హోల్‌సేల్‌ వ్యాపారులపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

సమ్మక్క తల్లి రాకకు ఏర్పాట్లు పూర్తి..

కోట్లాది మంది ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న వనదేవత సమ్మక్క గురువారం మేడారంలోని గద్దెపైకి రానున్నది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. సమ్మక్క రాకతో మేడారం మహా జాతర శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటుంది. ఈ సందర్భంగా ఏర్పాట్లపై రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) బుధవారం పూజారులు, అధికారులతో చర్చించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు నివాస గృహానికి వెళ్లి సమ్మక్క ఆలయ శుద్ధి గురించి చర్చించారు. అనంతరం సమ్మక్క గుడిని సందర్శించారు. అక్కడి నుంచి గద్దెలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

3.jpg7.jpg8.jpg2.jpg6.jpg5.jpg4.jpg

Updated Date - Jan 29 , 2026 | 06:12 AM