చిట్టీల వ్యాపారం పేరుతో మోసం.. రూ.3 కోట్లతో దంపతుల పరార్
ABN , Publish Date - Aug 03 , 2026 | 11:10 AM
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక లాభాలు వస్తాయని నమ్మించి మహిళల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన దంపతులు రాత్రికి రాత్రే పరారవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
సంగారెడ్డి, ఆగస్టు 3: అమీన్‌పూర్ మండలం బీరంగూడ డివిజన్‌లోని రాఘవేంద్ర కాలనీలో చిట్టీల పేరుతో భారీ మోసం జరిగింది. స్థానికంగా సాయి గణేష్ టెక్స్‌టైల్స్ పేరుతో బట్టల దుకాణం నిర్వహిస్తున్న శిరీష.. తన భర్త సాంబశివరావుతో కలిసి కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపిస్తూ కాలనీలోని పలువురు మహిళలను ఆకర్షించి, వారి నుంచి విడతల వారీగా భారీ మొత్తంలో నగదు సేకరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో దాదాపు రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం.
చిట్టీల గడువు సమీపిస్తుండటంతో డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన సమయంలో శిరీష, సాంబశివరావు దంపతులు తమ సొంత ఇంటిని విక్రయించి రాత్రికి రాత్రే పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో మోసపోయిన మహిళలు తీవ్ర ఆందోళనకు గురై అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుల నుంచి పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా సుభదీప్ ఘోష్ నియామకం
కోర్టుల్లో విచారణకు నోచని ‘పరీక్షల్లో అక్రమాల’ కేసులు..158