గింజ కూడా కొనట్లే
ABN , Publish Date - May 26 , 2026 | 04:34 AM
వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించిన కేంద్రం.. ఒక్క గింజనూ కొనడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. పండిన పంటలో 30శాతమైనా సేకరించడం లేదని, పంట ఉత్పత్తుల ....
పంట ఉత్పత్తుల కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాలి
బెంగాల్ ఎన్నికల వల్లే హమాలీల కొరత ఏర్పడింది
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొంటాం
వామపక్ష నేతలతో సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
40 లక్షల టన్నులపైగా ధాన్యం రోడ్లపైనే ఉంది
వర్షాలు పడితే పంట దెబ్బతినే ప్రమాదం: సీపీఎం
సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రేవంత్
హైదరాబాద్, మే 25 (ఆంధ్ర జ్యోతి): వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించిన కేంద్రం.. ఒక్క గింజనూ కొనడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. పండిన పంటలో 30శాతమైనా సేకరించడం లేదని, పంట ఉత్పత్తుల కొనుగోలుపై కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సచివాలయంలో సోమవారం పలువురు వామపక్ష నేతలు సీఎంతో సమావేశమై ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీఇచ్చారు. బెంగాల్ ఎన్నికల వల్ల హ మాలీల కొరత ఏర్పడిందని తెలిపారు. ఎండల వల్ల మధ్యాహ్నా సమయంలో పనులు జరగడం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం సమీక్ష చేస్తున్నామని చెప్పారు. రూ.500బోనస్ ఇచ్చి సన్న వడ్లు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. కేంద్రం మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదని, నష్టం వస్తుందని తెలిసినా తాము మొక్కజొన్న కొనుగోలు చేశామని తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని స్పష్టంచేశారు. కాగా, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును బీఆర్‌ఎస్, బీజేపీ రాజకీయం చేస్తున్నాయని, మూసీ నిర్వాసితులకు స్థానికంగానే ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం తెలిపారు. మూసీ ప్రాజెక్టు వల్ల యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. హైదరాబాద్ ప్రజలకు నాణ్యమైన జీవన సదుపాయాలు కల్పించడమే తమ ఉద్దేశమన్నారు. కాగా, ప్రభుత్వవిద్యను ప్రక్షాళన చేస్తామని సీఎం స్పష్టంచేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ఆరుట్ల స్కూల్‌ను ఒక సారి సందర్శించాలని సీపీఎం నాయకులకు సూచించారు. అంతకుముందు పలు అంశాలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నేతృత్వంలో ప్రతినిధుల బృందం సీఎంకు వినతి పత్రం అందజేసింది.
రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం బృందం సీఎం దృష్టికి తీసుకెళ్లింది. ప్రస్తుతం 40 లక్షల టన్నుల ధాన్యం రోడ్లపై ఉందని, వర్షాలు పడితే పంట దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ మేరకు సీఎం స్పందిస్తూ.. ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. కనీస వేతన సవరణలు అన్‌స్కిల్డ్ వర్కర్లకు మాత్రమే ఉపయోగపడేలా ఉన్నాయని, స్కిల్డ్, హైస్కిల్డ్ కార్మికులకు ఉపయోగం లేదని సీఎంకు వివరించగా.. పరిశీలించాలని అప్పటికప్పుడు అధికారులను ఆదేశించారని పేర్కొంది. ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారని, పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరగా.. నెలలోగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వివరించింది. సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్యపై సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పినట్లు వెల్లడించింది.
భూదాన్ భూముల్లో పేదలకు పట్టాలివ్వండి: సీపీఐ
భూధాన్ భూములు, ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో సీపీఐ బృందం సీఎంను కోరింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక చేపట్టాలని, మొక్కజొన్న రైతులకు బకాయిలు చెల్లించాలని కోరింది.