Share News

మైసూరు దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Oct 21 , 2026 | 06:12 PM

కర్ణాటక రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే చారిత్రక మైసూరు దసరా ఉత్సవాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

మైసూరు దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి.. చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు
Mysuru Dasara

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే చారిత్రక మైసూరు దసరా ఉత్సవాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాలను వీక్షించేందుకు ముఖ్యమంత్రి మైసూరుకు చేరుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఈ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ముందుగా మైసూరు ప్రజల ఆరాధ్య దైవమైన చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని.. ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం మైసూరు రాజభవనం ఎదుట అత్యంత వైభవంగా నిర్వహించిన దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు.


మైసూరు దసరా ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన జంబూ సవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తిగా వీక్షించారు. అందంగా అలంకరించిన ఏనుగుపై బంగారు అంబారీలో కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని దర్శించుకున్నారు. సంప్రదాయ వాయిద్యాల నడుమ, కన్నడ సంస్కృతిని ప్రతిబింబించే జానపద కళాకారులు, సంగీత బృందాలు, నృత్య బృందాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో సాగిన ఈ ఊరేగింపు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.

రంగురంగుల వస్త్రధారణలు, సంప్రదాయ నృత్యాలు, కళాకారుల ప్రదర్శనలు, అలంకరించిన ఏనుగులు ఈ వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి. కర్ణాటకలో రాష్ట్ర పండుగగా జరుపుకునే నాడ హబ్బ ఉత్సవాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి, కళలు, చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ వేడుకల్లో కేరళకు చెందిన ప్రముఖులతో పాటు దేశ, విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని ఉత్సవాలను వీక్షించారు. వివిధ రాష్ట్రాల నాయకులు, ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు జాతీయ స్థాయిలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.


ఇవి కూడా చదవండి..

ఒక్క గ్రాము యురేనియం కూడా ఇవ్వం.. అమెరికాకు తేల్చి చెప్పిన ఇరాన్..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 21 , 2026 | 06:12 PM