హింస పరిష్కారం కాదు
ABN , Publish Date - Feb 28 , 2026 | 03:59 AM
హింస ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం కాదని, ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారానే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు....
ప్రజాస్వామ్య పద్ధతులతోనే ప్రజల ఆకాంక్షలు సాకారం.. లొంగిపోయిన మావోయిస్టు నేతలతో రేవంత్
రేవంత్‌ను కలిసిన మావోయిస్టు నేతలు
పునరావాసంలో ఎలాంటిలోపాలు ఉండవని సీఎం హామీ
ఓఆర్‌ఆర్ లోపలి హోటల్ కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
పురపాలక శాఖ సమీక్షలో సీఎం రేవంత్
హైదరాబాద్, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): హింస ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం కాదని, ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారానే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇటీవల లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టు అగ్రనేతలు శుక్రవారం రేవంత్‌రెడ్డిని సచివాలయంలో కలిశారు. దేవ్‌జీ, రాజిరెడ్డి, ప్రసాదరావు, కల్పన, చొక్కారావు, నర్సింహారెడ్డిలను ఎస్‌ఐబీ అధికారులు సచివాలయానికి తీసుకునివచ్చారు. ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్, ఎస్‌ఐబీ చీఫ్ సుమతిల సమక్షంతో రేవంత్‌రెడ్డి పలు అంశాలపై మాజీ మావోయిస్టు నాయకులతో ముఖాముఖి మాట్లాడారు. లొంగిపోయిన మావోయిస్టుల అభ్యర్థన మేరకే అధికారులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాయుధ పోరాటాన్ని విరమించి ప్రధాన జనజీవన స్రవంతిలోకి రావడానికి అవకాశం కల్పించిన సీఎంకు మావోయిస్టు నాయకులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. మావోయిస్టులకు పొరుగు రాష్ట్రాల్లో ఇస్తున్న పునరావాస ప్యాకేజీలను గమనించి తమకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు. లొంగిపోయిన మావోయిస్టుల భద్రత, పునరావాస ప్రయోజనాల కల్పనలో ఎలాంటి లోపాలు ఉండబోవని సీఎం రేవంత్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య మార్గాన్ని ఎంచుకున్నందుకు వారిని అభినందించారు.
ఏదైనా పార్టీలో చేరాలనుకుంటున్నారా?
ఇటీవల లొంగుబాటు సమయంలో తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని తిప్పిరి తిరుపతి(దేవ్‌జీ) ప్రకటించిన నేపఽథ్యంలో.. ‘‘ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలని అనుకుంటున్నారా’’ అని దేవ్‌జీని సీఎం రేవంత్ ఆరా తీసినట్లు తెలిసింది. ప్రజా క్షేత్రంలో ఉండి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటానని తిరుపతి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో లొంగిపోతే తమకు రూ.కోటి పునరావాసం ప్యాకేజీ వచ్చేదని, ఇక్కడ కేవలం రూ.25 లక్షలు ఇచ్చారని, ఈ విషయంలో చొరవ తీసుకోవాలని తిరుపతి కోరినట్లు సమాచారం.
మహిళా పోలీసుల పాత్ర అభినందనీయం
పోలీసు శాఖలోని కీలక విభాగాలైన లా అండ్ ఆర్డర్, నేర పరిశోధన, ట్రాఫిక్ నిర్వహణ, బందోబస్తు విధుల్లో మహిళా పోలీసుల పాత్ర పెరగడం అభినందనీయమని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ పోలీసు అకాడమీ వార్షిక మాసపత్రికను సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులనుద్దేశించి మాట్లాడుతూ పోలీసుశాఖలో మహిళల పాత్రను పెంచడం, వారికి శిక్షణ, పదోన్నతులు తదితర అంశాల్లో తమిళనాడు రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇక తుపాకీ సిద్ధాంతం నడవదు: దేవ్‌జీ
లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పాలసీ బాగుందని దేవ్‌జీ అన్నారు. సీఎంతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పునరావాస ప్యాకేజీని రూ.కోటికి పెంచాలని కోరినట్లు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఐదెకరాల భూమి ఇవ్వటం సాధ్యం కాదని సీఎం తెలిపారని.. అయితే, ఇల్లు, ఉద్యోగం, జీవనభృతి కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న మావోయిస్టులను కలుస్తామని చెప్పారు. అందరం కలిసి ప్రజలకు బహిరంగ లేఖ రాస్తామని తెలిపారు. దేశంలో ఇకపై తుపాకీ సిద్ధాంతం నడవదని అన్నారు. ఆ మార్గంలో వెళ్లేవారికి ఈ విషయాన్ని వివరిస్తామని వెల్లడించారు.
జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం
ఔటర్ రింగురోడ్డు (కోర్ అర్బన్) పరిధిలోని మూడు కార్పొరేషన్లకు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) స్థానంలో కోర్ అర్బన్ చట్టం రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అనుమతులు, రుసుములు, అభివృద్ధి పనుల నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నింటికి ఆ చట్టమే ఆధారంగా ఉండాలని సూచించారు. కోర్ అర్బన్ పరిధిలో ఆహార నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. హోటళ్ల కిచెన్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. మార్కు చేసిన స్థలాల్లోనే చెత్త వేసేలా మున్సిపల్ అధికారులు ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. 50 అంతస్తులకు పైగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయని, అంత ఎత్తులో అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు అవసరమైన అధునాతన సామగ్రి, సాంకేతికతను సమకూర్చుకోవాలని సూచించారు. కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఆర్‌అండ్‌బీ, ఇతర విభాగాల పరిధిలోని రోడ్లన్నింటిని పురపాలకశాఖ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను నిర్దేశిత సమయంలో పూర్తిచేయాలని ఆదేశించారు.