కేసీఆర్‌కు అధికారం గతమే
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:41 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి కేసీఆర్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడమన్నది కలేనని, ఆయనకు గతమే తప్ప..
ఎమ్మెల్యేగా రాడట.. అధికారంతో దోచుకోవడానికి వస్తాడట
పదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దోపిడీ చేశారు.. వారితో కలిసి పనిచేసిన అధికారుల వద్ద వందల కోట్లు దొరుకుతున్నాయి
లక్ష కోట్ల ఆస్తులు.. వెయ్యి ఎకరాల ఫౌంహౌస్ ఎలా వచ్చాయి?
రాష్ట్రానికి రూ.8.21 లక్షల కోట్ల అప్పులు ఎలా అయ్యాయి?
ప్రజాప్రభుత్వం ఎందుకు పోవాలి? వారు ఎందుకు రావాలి?
రాహుల్‌ను ప్రధానిని చేయాలంటే మళ్లీ నేను సీఎం కావాలి
మిడ్జిల్‌లో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థాన కృతజ్ఞత సభలో రేవంత్
మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మహబూబ్‌నగర్, జూలై 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి కేసీఆర్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావడమన్నది కలేనని, ఆయనకు గతమే తప్ప.. భవిష్యత్తు లేదని అన్నారు. కేసీఆర్ భవిష్యత్తుకు తెలంగాణ ప్రజలు శాశ్వతంగా ముగింపు పలికారని వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. వారితో కలిసి దోపిడీ చేసిన అధికారుల వద్ద రూ.100 కోట్లు, రూ.200 కోట్లు, రూ.300 కోట్లు ఏసీబీకి దొరుకుతున్నాయని, ఇదంతా తెలంగాణ ప్రజల వద్ద దోచుకున్నదేనని తెలిపారు. ‘‘కేసీఆర్‌కు గజ్వేల్, ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫాంహౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన తాత, ముత్తాతలు ఇచ్చారా? నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను దోచుకుంటే వచ్చింది. ఆయన కొడుక్కి జన్వాడలో వంద ఎకరాల ఫాంహౌస్, అల్లుడు హరీశ్‌రావుకు మొయినాబాద్‌లో 50 ఎకరాల ఫాంహౌస్, బిడ్డ కవితకు శంకరపల్లిలో పాతిక ఎకరాల ఫాంహౌస్ ఎక్కడి నుంచి వచ్చాయి? సడ్డకుడి కొడుకు సంతోష్ రావు లెక్కలైతే చెప్పేట్లు లేవు. వజ్ర వైడూర్యాలు, బెంజ్ కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏం వ్యాపారం చేశారు?’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం తన రాజకీయ ప్రస్థానంలో 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. తనను తొలిసారిగా జడ్పీటీసీగా గెలిపించి రాజకీయ జన్మనిచ్చిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో సీఎం పర్యటించారు. ముందుగా నాగర్‌కర్నూలు జిల్లా ఉర్కొండపేట మండలంలోని అభయాంజనేయస్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించి అక్కడే సహపంక్తి భోజనానికి వచ్చిన ఆత్మీయులతో కలిసి మాట్లాడారు. అనంతరం మిడ్జిల్ చేరుకొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ జడ్పీచైర్మన్ ద్యాప గోపాల్‌రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన కృతజ్ఞత సభలో మాట్లాడారు.

దోచుకోవడానికి వస్తారట!
‘‘గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రజలు కేసీఆర్ ఉద్యోగం ఇస్తే అసెంబ్లీకి మాత్రం రారట.. ప్రజల తరపున మాట్లాడరట.. ప్రజా సమస్యలను ప్రస్తావించరట. అధికారంలోకి మాత్రం దోచుకోవడానికి వస్తారట.. దొంగతనం చేయడానికి వస్తారట. నీకు అధికారం అనేది కలలో మాట’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లు అధికారం ఇస్తే ఇసుక దోపిడీకి అడ్డంపడ్డ నేరెళ్ల దళితులను లారీలు పెట్టి తొక్కించారని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర అడిగితే ఖమ్మం జిల్లాలో గిరిజనులకు బేడీలు వేసి జైలుకు తీసుకెళ్లారని సీఎం రేవంత్ ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా ప్రశ్నపత్రాలను పల్లీ బఠానీల్లా అమ్ముకున్నారని, వందల కోట్లు కొల్లగొట్టి నీళ్లు ఇవ్వలేదని, పింఛన్లు ఇవ్వలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కుటుంబ సభ్యులను, చుట్టాలను, కావాల్సినోళ్లను మంత్రులను చేసుకున్నారని, ఓడిపోతే ప్రభుత్వ సలహాదారులను చేసుకున్నారని ఆరోపించారు. పదేళ్ల పాలనలో లక్షల కోట్లు దోచుకొని సంక్షేమ పాలన అందిస్తున్న ప్రజాప్రభుత్వం పోవాలని గుండెలు బాదుకుంటూ తాపత్రయ పడుతున్నారని మండిపడ్డారు. చూపించుకోవడానికి టీవీ, రాసుకోవడానికి పేపర్, అబద్ధాలు చెప్పడానికి భజనపరులను ఇచ్చినందుకు ఆ పాపాల భైరవుడిని రావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ప్రజాపాలన ఎందుకు పోవాలి?
ప్రజాపాలన ఎందుకు పోవాలో, ఫాంహౌస్‌లో బందీ అయిన పాపాల భైరవుడు ఎందుకు రావాలో ప్రజలు ప్రతిచోటా చర్చ పెట్టాలని సీఎం రేవంత్ అన్నారు. ‘‘రేషన్ కార్డు ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలా? సన్నబియ్యం పెట్టినందుకు పోవాలా? ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినందుకు పోవాలా? ఉచిత కరెంటు ఇచ్చినందుకు పోవాలా? రైతు రుణమాఫీ చేసినందుకు పోవాలా? రైతు భరోసా వేసినందుకు పోవాలా? వరి వేస్తే ఉరి వేసుకున్నట్లని ఆ దుర్మార్గుడు చెబితే.. 2.88 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తే చివరి గింజ వరకు కొని రూ. 80 వేల కోట్లు రైతులకు ఇచ్చినందుకు పోవాలా? డ్రగ్స్, గంజాయి అమ్మేవారిని పట్టుకొని బొక్కల పెట్టి, మక్కెలిరగ కొట్టినందుకు పోవాలా? మీరొస్తే ఏం చేస్తరు? ఫాంహౌ్‌సలలో అమ్మిన గంజాయి, డ్రగ్స్‌ను రైతు బజారులో పెట్టి అమ్ముతారా?’’ అని రేవంత్ ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలకు సేవ చేస్తున్న ప్రభుత్వం పోవాలనడానికి వారి సంపాదన, దోపిడీ, దొంగతనాలు ఆగిపోవడమే కారణమని ఆరోపించారు. గతంలో ఆడబిడ్డలకు ఇచ్చిన బతుకమ్మ చీరల్లో కూడా కమీషన్లు కొట్టేశారని తెలిపారు. కేసీఆర్ లక్ష కోట్లు ఎలా సంపాదించారో, రాష్ర్టానికి రూ.8.21 లక్షల కోట్ల అప్పు ఎలా మిగిలిందో యువకులు, జెన్‌జీ పిల్లలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డల ఫోన్లు కూడా విన్నవారిని మళ్లీ రానివ్వాలా? అని మండిపడ్డారు. రాహుల్ ప్రధానమంత్రి కావడం చారిత్రక అవసరమని రేవంత్ అన్నారు. తనను సీఎం చేసిన రాహుల్‌ను పీఎం చేయాలంటే తాను 2029లో మళ్లీ గెలవాలన్నారు. డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా రేవంత్ అందిస్తున్నది నిజమైన ప్రజాపాలన అని తెలిపారు.

మిడ్జిల్ దత్తత బాధ్యత భట్టివిక్రమార్కకు..
మిడ్జిల్/ఊర్కొండ: మిడ్జిల్ తన సొంత ప్రాంతం కాకపోయినా.. 20 ఏళ్ల క్రితం తాను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే ప్రజలు జడ్పీటీసీగా గెలిపించారని సీఎం రేవంత్ అన్నారు. అప్పుడు వారు నాటిన మొక్క నేడు వృక్షమై ఎందరికో నీడనిచ్చే స్థాయికి ఎదిగానని, ఇప్పుడు రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉన్నప్పుడు వారికి కరువు లేకుండా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. ఇందుకోసం ఉమ్మడి మిడ్జిల్ మండలాన్ని దత్తత తీసుకొని.. అభివృద్ధి, సంక్షేమం బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించాలని డిప్యూటీ సీఎం భట్టికి సూచించారు. శనివారం సీఎం పర్యటన సందర్భంగా మండలంలోని ప్రతి గ్రామానికి రూ.50 లక్షల చొప్పున రూ.80 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అభయాంజనేయ స్వామి దేవాలయానికి రూ.11.5కోట్ల నిధులు మంజూరు చేశారు. మరోవైపు ఆనాడు మిడ్జిల్ జడ్పీటీసీగా తనపై పోటీ చేసి ఓటమిపాలైన ప్రత్యర్థి, కాంగ్రెస్ నాయకుడు గౌస్ రబ్బానీకి రాష్ట్రస్థాయిలో ఏదైనా పదవి ఇవ్వాలని డిప్యూటీ సీఎంకు సూచించారు. 2006లో తన వెంట ఉన్న అనుచరులు, ప్రస్తుత కాంగ్రెస్ నాయకులతో ప్రతి టేబుల్ వద్దకు వెళ్లి ఆత్మీయంగా పేరుపేరునా పలకరించారు.
‘హృదయాల్లో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటా’
హైదరాబాద్: ప్రజాప్రతినిధిగా ఎన్నికై 20 ఏళ్లవుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శనివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ‘‘లక్షల అక్షరాలతో రాసినా.. కోట్ల పదాలను కూర్చి చెప్పినా.. తరగని మధుర జ్ఞాపకం.. ఈ రెండు దశాబ్దాల ప్రజాజీవితం. నాడు మిడ్జిల్‌లో రేవంత్‌రెడ్డిగా మొదలై.. నేడు మీ అందరి గుండెల్లో రేవంతన్నగా నిలిచేవరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం. ఇదే స్ఫూర్తితో రేవంతన్నగా మీ హృదయాల్లో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నాను’’ అంటూ ఎక్స్‌లో పేర్కొన్నారు. కాగా, 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.