ఈ నెల 20 నుంచి.. సీఎం రేవంత్ విదేశీ పర్యటన!
ABN , Publish Date - Aug 01 , 2026 | 08:11 AM
తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగష్టు 20 నుంచి సెప్టెంబరు 8 వరకు దాదాపు 20 రోజులపాటు వివిధ దేశాల్లో సీఎం పర్యటించనున్నారు. అమెరికా, యూకే సహా మరికొన్ని కీలక దేశాలకు ఆయన వెళ్లనున్నట్టు సమాచారం.
అమెరికా, యూకే సహా మరికొన్ని దేశాల్లో పెట్టుబడులే లక్ష్యంగా సెప్టెంబరు 8 వరకు టూర్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగష్టు 20 నుంచి సెప్టెంబరు 8 వరకు దాదాపు 20 రోజులపాటు వివిధ దేశాల్లో సీఎం పర్యటించనున్నారు. అమెరికా, యూకే సహా మరికొన్ని కీలక దేశాలకు ఆయన వెళ్లనున్నట్టు సమాచారం. అయితే ఆయా దేశాల్లోని కంపెనీల ప్రతినిధులు, అపాయింట్‌మెంట్‌ల నేపథ్యంలో సీఎం టూర్ షెడ్యూల్ ఆగష్టు 20-23 తేదీల మధ్య ఉండవచ్చని కూడా అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ పర్యటనలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి సంస్థలు, ప్రవాస భారతీయులతో సీఎం సమావేశాలు నిర్వహించనున్నారు. ఐటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, సెమీ కండక్టర్లు, ఎలకా్ట్రనిక్స్ తయారీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం టూర్ ఉండొచ్చని సమాచారం. అమెరికాలో చిప్ తయారీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ కంపెనీలతో, లండన్‌లో గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లు, విద్యా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపే అవకాశం ఉంది. అలాగే గతంలో విదేశీ పర్యటనల సంద ర్భంగా పలు అంతర్జాతీయ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో.. ఆయా కంపెనీల ప్రతినిధులతోనూ రేవంత్ భేటీ అయ్యే అవకాశాలున్నాయి.
సెప్టెంబరు మూడో వారంలో అసెంబ్లీ
చట్టసభల్లోకి ప్రవేశించే వయసును 21కి తగ్గించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తీర్మానం చేసేందుకు ఆగష్టు 17-18 తేదీల్లో ఒక రోజు ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఇక వర్షాకాల సమావేశాలను సెప్టెంబరు మూడో వారంలో వారంపాటు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఆగస్టులో సీఎం విదేశీ పర్యటనకు ప్రాథమిక షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో.. సెప్టెంబరు రెండో వారం వరకు ఆయన తిరిగి రాష్ట్రానికి వస్తారని, మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయనే చర్చ సచివాలయంలో జరుగుతోంది.