కవాడిపల్లికి చేరిన అనురూప్ రెడ్డి భౌతికకాయం.. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ నివాళి..
ABN , Publish Date - Jun 09 , 2026 | 07:44 PM
అమెరికాలోని లూసియానాలో ఇటీవల మృతిచెందిన తెలంగాణ యువకుడు కె.అనురూప్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. తన స్నేహితులను కాపాడే ప్రయత్నంలో యువకుడు అకాలమరణం చెందడం తీవ్ర ఆవేదన కలిగించిందని రేవంత్ పేర్కొన్నారు.
హైదరాబాద్: అమెరికాలోని లూసియానాలో ఇటీవల మృతిచెందిన తెలంగాణ యువకుడు కె.అనురూప్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. తన స్నేహితులను కాపాడే ప్రయత్నంలో యువకుడు అకాలమరణం చెందడం తీవ్ర ఆవేదన కలిగించిందని రేవంత్ పేర్కొన్నారు. తోటివారి ప్రాణాలు కాపాడేందుకు ఆయన చూపిన ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అనురూప్ రెడ్డి భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా యువకుడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనురూప్ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు.
కాగా, రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ కవాడిపల్లికి చెందిన అనురూప్ రెడ్డి(23) అమెరికాలోని లూసియానాలో ఉంటున్నారు. సరదాగా గడిపేందుకు తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ ఏడాది మే 29న టోరో బేయు పార్కుకి వెళ్లారు. అయితే, స్నేహితులు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోతుండగా ఏమాత్రం సంకోచించకుండా వారిని కాపాడారు అనురూప్ రెడ్డి. ఈ క్రమంలో తన ప్రాణాలను కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని అనురూప్ రెడ్డి భౌతికకాయాన్ని నేడు స్వగ్రామానికి చేర్చింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఆదేశాలతో కవాడిపల్లికి చేరుకున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, మందుల సామేలు.. అనురూప్ రెడ్డికి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన లేఖను వారికి అందజేశారు. ముగ్గురు యువకులను కాపాడినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అవార్డు, ఆర్థికసాయం అందించనున్నట్లు వారికి నేతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం
ఉద్యోగుల జీతాల చెల్లింపులో జాప్యం వద్దు.. అధికారులకు సీఎం వార్నింగ్