Share News

2029నాటికి ఐదు గిగావాట్ల డేటా సెంటర్లు!

ABN , Publish Date - Sep 25 , 2026 | 04:30 AM

రాష్ట్రంలో కృత్రిమ మేధ, క్లౌడ్‌, డిజిటల్‌ మౌలిక వసతుల అభివృద్థికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో 2029 నాటికి 5 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడించారు.

2029నాటికి ఐదు గిగావాట్ల  డేటా సెంటర్లు!
gwcenters

  • 30 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం: మంత్రి దుద్దిళ్ల

  • రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలో మైక్రోసాఫ్ట్‌

డేటా సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి

  • 2029నాటికి 5 గిగావాట్ల డేటా సెంటర్లు!

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కృత్రిమ మేధ, క్లౌడ్‌, డిజిటల్‌ మౌలిక వసతుల అభివృద్థికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో 2029 నాటికి 5 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో దాదాపు 300 మెగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యం ఉండగా, మరో 2 గిగావాట్ల సామర్థ్యం అభివృద్థి దశలో ఉందని తెలిపారు. గురువారం, రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలో మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేసిన ఇండియా సౌత్‌ సెంట్రల్‌ డేటా సెంటర్‌ రీజియన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2029 నాటికి ఏఐ, డిజిటల్‌ మౌలిక వసతుల రంగంలో సుమారు 30 బిలియన్‌ డాలర్ల(సుమారు 30 వేల కోట్లు) వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. మైక్రోసా్‌ఫ్టతో రాష్ట్రానికి రెండు దశాబ్దాలకు పైగా సాంకేతికత, నైపుణ్యాభివృద్థి, పరిశోధన రంగాల్లో భాగస్వామ్యం ఉందని అన్నారు. హైదరాబాద్‌లో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రస్తుతం 12 గిగావాట్ల సామర్థ్యానికి సంబంధించిన దరఖాస్తులు వచ్చాయని, వీటికి కావాల్సిన విద్యుత్‌, నీటి వనరుల లభ్యతను ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. డేటా సెంటర్ల నిర్వహణలో నీటి వినియోగం తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయాలని భావిస్తోందని మంత్రి చెప్పారు. నగరంలోని మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నుంచి శుద్ధి చేసిన గ్రే వాటర్‌ను డేటా సెంటర్లకు అందించే ప్రణాళికను వివరించారు. మైక్రోసాఫ్ట్‌ సౌత్‌ సెంట్రల్‌ రీజియన్‌లోనూ నీటి వినియోగాన్ని తగ్గించే అధునాతన కూలింగ్‌ సాంకేతికతను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.


లైఫ్‌సైన్సెస్‌-హెల్త్‌టెక్‌

జీసీసీలకు కేంద్రంగా హైదరాబాద్‌!

లైఫ్‌సైన్సెస్‌, హెల్త్‌టెక్‌ రంగాల గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు హైదరాబాద్‌ కేంద్రంగా మారిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గురువారం నగరంలో జరిగిన ‘రైజ్‌ హెల్త్‌ ఇన్నోవేషన్‌ సమ్మిట్‌- 2026’ సదస్సులో ‘అన్‌లాకింగ్‌ ఇండియా యాజ్‌ స్ట్రాటజిక్‌ హబ్‌ ఫర్‌ లైఫ్‌సైన్సెస్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ జీసీసీ’ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. హైదరాబాద్‌కు ఉన్న బలమైన లైఫ్‌సైన్సెస్‌ వ్యవస్థ, సాంకేతిక నైపుణ్యాలు జీసీసీల ఏర్పాటుకు ఎంతో కీలకమన్నారు. భారత్‌లో జీసీసీలు నిర్వహణకే పరిమితం కాకుండా.. ప్రపంచస్థాయి కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం అవుతున్నాయని సదస్సులో నిపుణులు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన సమ్మిట్‌లో ప్రభుత్వ, ఆరోగ్య, లైఫ్‌సైన్సెస్‌, టెక్నాలజీ, విద్యా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను విస్తృత స్థాయి ఫలితాలుగా ఎలా మలచాలనే అంశంపై చర్చించారు.

ఈ వార్తలు కూడా చదవండి

అమ్మాయిలు సర్కారుకు..అబ్బాయిలు ప్రైవేటుకు

గ్రామపంచాయతీల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు

Updated Date - Sep 25 , 2026 | 04:30 AM