ఢిల్లీలో రాహుల్ గాంధీతో ముగిసిన టీపీసీసీ చీఫ్ బృందం భేటీ.. పలు అంశాలపై కీలక చర్చలు
ABN , Publish Date - Apr 23 , 2026 | 07:41 PM
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి బృందం నేడు ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసింది. ఈ బృందంలో రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా ఉన్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి బృందం నేడు ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసింది. ఈ బృందంలో రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా ఉన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరుపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిగాయి.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల పురోగతిని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలు ప్రజల్లోకి ఏ మేరకు వెళ్తున్నాయనే అంశంపై రాహుల్ ఆరా తీసినట్టు సమాచారం. ముఖ్యంగా సంస్థాగత వ్యవహారాలు, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే దిశగా మహేష్ కుమార్ గౌడ్ రాహుల్‌కు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ భేటీలో బీసీ జనగణన ప్రధానాంశంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. 'బీసీ గణన చేస్తామని ప్రధాని మోదీ చెప్పారు, కానీ అది క్షేత్రస్థాయిలో అమలు కావాలి' అని రాహుల్ పేర్కొన్నట్టు సమాచారం. బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌ను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముహూర్తం
తెలంగాణలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తీపి కబురు అందిస్తూ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టులను మే నెలలోగా భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తయిందని, త్వరలోనే తుది నిర్ణయం వెలువడుతుందని తెలిపారు.
రాహుల్ గాంధీతో భేటీ అత్యంత సంతృప్తికరంగా సాగిందని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడానికి రాహుల్ కొన్ని సూచనలు చేశారని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల దృష్ట్యా పార్టీ కేడర్‌ను సిద్ధం చేయడమే తమ తక్షణ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్
కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ములేకే మాపై విమర్శలు: కిషన్ రెడ్డి
Read Latest Telangana News And Telugu News