Share News

రిజిస్ట్రేషన్ కు ఆస్తి పన్ను చెల్లింపుతో కొర్రీ

ABN , Publish Date - Nov 13 , 2026 | 06:23 AM

హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌/నగరం) పరిధిలో ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు ఆస్తి పన్ను చెల్లింపును తప్పనిసరి చేస్తూ రిజిస్ట్రేషన్ శాఖ జారీ చేసిన మెమోపై.. రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు, కొనుగోలుదారుల్లో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

రిజిస్ట్రేషన్ కు   ఆస్తి పన్ను చెల్లింపుతో కొర్రీ
propertytax

  • ప్రభుత్వ రాబడిపైనా ప్రభావం పడే అవకాశం

  • కొనుగోలుదారులపై అదనపు భారం

  • పలు అంశాలపై లోపించిన స్పష్టత

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌/నగరం) పరిధిలో ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు ఆస్తి పన్ను చెల్లింపును తప్పనిసరి చేస్తూ రిజిస్ట్రేషన్ శాఖ జారీ చేసిన మెమోపై.. రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు, కొనుగోలుదారుల్లో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చివరకు అధికారుల్లోనూ దీనిపై అయోమయం నెలకొంది. ఆస్తి పన్ను వసూలు స్థానిక సంస్థల (పురపాలక శాఖ) బాధ్యత కాగా.. పన్ను బకాయిలు ఉన్నాయనే కారణంతో ఆస్తి రిజిస్ట్రేషన్ ను అడ్డుకోవచ్చా? కేంద్రం చట్టం (రిజిస్ట్రేషన్ యాక్ట్‌ 1908) కింద నిర్వహించే రిజిస్ర్టేషన్‌ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించవచ్చా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ విధానాన్ని అమలు చేస్తే (రిజిస్ట్రేషన్లు తగ్గి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై ప్రభావం పడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం క్యూర్‌ పరిధిలో రోజూ 2500 నుంచి 3000 వరకు డాక్యుమెంట్‌ నమోదవుతుండగా.. ఇందులో సగానికిపైగా ఫ్లాట్లు ఉంటున్నాయి. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ బుధవారం జారీ చేసిన మెమో ప్రకారం.. ఇకపై ఎవరైనా ఒక ఆస్తిని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే, స్లాట్‌ బుక్‌ చేసే సమయంలోనే ఆస్తి పన్ను మదింపు నంబర్‌ (పీటీఐఎన్‌)/ ఖాళీ స్థలాల పన్ను గుర్తింపు నంబరును (వీఎల్‌టీఐఎన్‌) తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ నంబర్లు ఇవ్వకపోయినా స్లాట్‌ బుక్‌ అవుతుంది. కానీ, రిజిస్ర్టేషన్‌ సమయంలో ఆస్తి పన్నుకు సంబంఽధించి న్యోడ్యూస్‌ (బకాయిల్లేవు) సర్టిఫికేట్‌ లేదా తాజా పన్ను చెల్లింపు రశీదు చూపాలి. ఆస్తిపన్ను మదింపు నంబరు లేకుంటే అత్యవసర పరిస్థితుల్లో 48 గంటల తర్వాత రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు.


ఆ లోపు ఆస్తి మదింపు పూర్తి చేయించుకుని, పన్ను చెల్లించాలి. అప్పటి వరకు డాక్యుమెంటును పెండింగ్‌లో పెడతారు. ఒకవేళ 48 గంటల్లో ఆస్తి పన్ను మదింపు పూర్తి కాకపోతే? లేక కొనుగోలుదారుడు ఆస్తి పన్ను చెల్లించకపోతే ఏం చేయాలి?.. దాన్ని అలాగే ఎంత కాలం పాటు పెండింగ్‌లో పెట్టాలి? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. పురపాలక శాఖ భవన నిర్మాణం పూర్తయ్యాక.. ఓసీ(అక్యుపెన్సీ సర్టిఫికేట్‌) ఇచ్చే సమయంలోనే ఆస్తి పన్ను మదింపును పూర్తి చేయవచ్చు కదా? అన్న ప్రశ్నను రిజిస్ట్రేషన్‌ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. పాతబస్తీ లాంటి చోట్ల నోటరీ మీద ఎక్కువ రిజిస్ర్టేషన్లు జరుగుతుంటాయని.. ఈ మెమోతో అవి కూడా తగ్గిపోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆస్తుల మదింపునకు ఏళ్లుగా ఉన్న బకాయిలు చెల్లించాలని పురపాలక శాఖ అధికారులు కోరే అవకాశాలు ఉంటాయని.. అదనపు భారం పడుతుందన్న భయంతో కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ ఆసక్తి చూపకపోవచ్చని అంటున్నారు.

లావాదేవీలపై ప్రభావం..

ఇప్పటికే 22ఏ నిషేధిత జాబితా వివాదంతో రియల్‌ ఎస్టేట్‌పై కొంత ప్రభావం పడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో.. రిజిస్ట్రేషన్ శాఖ తాజాగా ఇచ్చిన మెమో వల్ల మళ్లీ లావాదేవీలు తగ్గిపోయే ప్రమాదం ఉందని రియల్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త నిబంధనతో నిర్మాణ దశలోని అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేషన్ల సంగతేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిర్మాణం పూర్తయ్యి, ఆస్తి పన్ను మదింపు జరిగే వరకు రిజిస్ట్రేషన్‌ చేయరా? అన్న సందేహాలు నెలకొన్నాయి. కొత్త లేఅవుట్లు, విల్లాలు, విభజించిన ప్లాట్లకు పన్ను గుర్తింపు సంఖ్య కేటాయించడంలో జాప్యం జరిగితే అప్పుడు కూడా లావాదేవీలు నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక వివాదాల్లో ఉన్న ఆస్తుల విషయంలోనూ పన్ను మదింపు, యజమాని పేరులో తేడాలు, విస్తీర్ణంలో తేడాలు, పాత బకాయిలపై అభ్యంతరాలు ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత జాప్యం కావచ్చు. వీటివల్ల గృహ రుణాల విడుదలపైనా ప్రభావం పడుతుంది.

ఇవి కూడా చదవండి..

తమిళనాడులోని జ్యువెలరీ షోరూమ్‌లో చోరీ.. రూ.25 కోట్ల ఆభరణాలు మాయం!

రసగుల్లా అనుకుని బాంబు కొరికి వ్యక్తి మృతి

Updated Date - Nov 13 , 2026 | 06:25 AM