Share News

గణపతి పూజ చేస్తూ పురోహితుడి మృతి

ABN , Publish Date - Sep 16 , 2026 | 01:21 AM

విఘ్నాలు తొలగి అందరికీ శుభాలు కలగాలని వినాయక పూజ చేస్తున్న పురోహితుడు.. మండపంపై పూజలోనే కుప్పకూలి కన్నుమూశారు. సోమవారం నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలం చింతలపాలెం గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకొంది

గణపతి పూజ చేస్తూ పురోహితుడి మృతి
dattu

  • అంతకుముందు పూజారితో ఇద్దరు యువకుల వాగ్వాదం.. తమ మండపంలోనే తొలి పూజ చేయాలని తోపులాట

  • నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలంలో ఘటన

  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

తిరుమలగిరి(సాగర్‌), సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): విఘ్నాలు తొలగి అందరికీ శుభాలు కలగాలని వినాయక పూజ చేస్తున్న పురోహితుడు.. మండపంపై పూజలోనే కుప్పకూలి కన్నుమూశారు. సోమవారం నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలం చింతలపాలెం గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకొంది. తాము ఏర్పాటు చేసిన మండపం వద్దే ముందుగా పూజ చేయాలంటూ ఇద్దరు యువకులు పురోహితుడితో వాగ్వాదానికి దిగి నెట్టివేయడమే ఆయన మృతికి దారితీసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపాలెం గ్రామానికి చెందిన ఉప్పల దత్తుప్రసాద్‌(65) కొన్నేళ్లుగా స్థానిక రామాలయంలో పూజారిగా వ్యవహరిస్తుండడంతోపాటు గ్రామంలో పౌరోహిత్యం చేస్తున్నారు. కాగా, సోమవారం వినాయకచవితి సందర్భంగా గ్రామస్థులు గ్రామంలో ఆరు చోట్ల వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు. పురోహితుడు దత్తుప్రసాద్‌ ఉదయం రామాలయంలో నైవేద్యం సమర్పించిన అనంతరం తన కుమారుడితో కలిసి ఆలయం సమీపంలో ఉన్న మండపం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన యువకులు గుండాల రవి, గుండాల పున్నయ్య అక్కడికి చేరుకుని తాము ఏర్పాటు చేసిన మండపం వద్దే తొలి పూజ చేయాలని పట్టుబట్టారు. పురోహితుడితో పాటు మండప నిర్వాహకులతో వాగ్వాదానికి దిగి దత్తుప్రసాద్‌ను నెట్టివేశారు. దీంతో కిందపడిపోయిన దత్తుప్రసాద్‌ మనస్తాపం చెందారు. గణేష్‌ మండపాల వద్ద తాను పూజలు నిర్వహించలేనంటూ ఆలయం వద్ద కూర్చున్నారు. దీంతో గ్రామపెద్దలు ఆయనకు నచ్చజెప్పి.. వాగ్వాదానికి దిగిన యువకులు ఏర్పాటుచేసిన గణేష్‌ మండపం వద్దకు పూజ చేయించేందుకు తీసుకెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడ పూజలు నిర్వహిస్తున్న క్రమంలోనే దత్తుప్రసాద్‌ కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే స్థానికులు నాగార్జునసాగర్‌లో కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


పూజలు చేయకుండానే నిమజ్జనం..

దత్తుప్రసాద్‌ కుమారుడు శ్రీవల్లభరాఘవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించేందుకు తరలించారు. సీఐ శ్రీను నాయక్‌, ఎస్‌ఐ వీరశేఖర్‌ సంఘటనా స్థలం వద్ద ప్రత్యక్షసాక్షుల వాంగ్మూలం నమోదు చేశారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక అనంతరం వివాదానికి కారణమైన యువకులపై చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ వీరశేఖర్‌ తెలిపారు. పురోహితుడి మృతితో గ్రామంలోని ఆరు మండపాల్లో పూజలు నిర్వహించకుండానే గణపతి విగ్రహాలను నిమజ్జనం చేశారు. కాగా, వైదిక బ్రాహ్మణ సంఘం, ధూప, దీప నైవేద్య అర్చకుల సంఘం పిలుపు మేరకు నాగార్జునసాగర్‌ నియోజకవర్గ వ్యాప్తంగా వినాయకుడి మండపాల వద్ద మంగళవారం ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించలేదు. స్థానిక పూజారుల సూచన మేరకు మండపాల్లోని విగ్రహాల వద్ద మండప నిర్వాహకులు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించారు. మండపం వద్ద జరిగిన తోపులాటతో మానసిక సంఘర్షణకు గురై దత్తుప్రసాద్‌ మరణించారని, ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేశారు. అయితే చింతలపాలెం గ్రామంలోని రామాలయం దేవుని మాన్యం సుమారు 15 ఎకరాలకు సంబంధించిన కౌలు ఆదాయాన్ని వచ్చే నాలుగేళ్లపాటు దత్తుప్రసాద్‌ కుటుంబానికి ఇవ్వాలని బ్రాహ్మణ సేవాసంఘం, చింతలపాలెం గ్రామ పెద్దలు కలిసి తీర్మానించారు. దీంతోపాటు గుండాల రవి, పున్నయ్య లు దత్తుప్రసాద్‌ కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించేలా నిర్ణయించినట్లు తెలిసింది. కాగా, మూడేళ్ల క్రితం పెద్దకుమారుడిని కృష్ణా నీటి ప్రవాహంలో కోల్పోయిన దత్తుప్రసాద్‌ కుటుంబంలో ఇప్పుడు తండ్రి మరణం తీరని శోకాన్ని నింపింది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే చంద్రకాంత్‌.. 2023 ఫిబ్రవరి 9న దత్తుప్రసాద్‌ సోదరుడైన వెంకటేశ్వరశర్మ కుమారులకు ఉపనయన క్రతువు నిర్వహిస్తున్న క్రమంలో సంధ్యావందనం అనంతరం స్నానం చేస్తుండగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు.

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల

కొత్త UPI మార్గదర్శకాలు: ఎవరికి ఛార్జీలు? ఎవరికి ఉచితం?

Updated Date - Sep 16 , 2026 | 02:25 AM