విచారణకు రాని భగీరథ్
ABN , Publish Date - May 14 , 2026 | 04:45 AM
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్.. బుధవారం పోలీసు విచారణకు గైర్హాజరయ్యాడు.
2 రోజులు సమయం ఇవ్వాలని, ఆధారాలతో హాజరవుతానని పోలీసులకు మెయిల్
పరిగణనలోకి తీసుకోబోమన్న డీసీపీ
మెయిల్స్ బహిరంగపరచడంపై ఆగ్రహం
మీడియాట్రయల్స్‌పై పోలీసుల అసంతృప్తి
భగీరథ్ కోసం పోలీసుల గాలింపు
బాధిత బాలికకు రెండు బర్త్ సర్టిఫికెట్లు!
ఆస్పత్రి రికార్డులు సేకరిస్తున్న పోలీసులు
భగీరథ్‌ను అరెస్టు చేయాలంటూ మహిళా సంఘాల ఆందోళన
మధ్యంతర బెయిల్‌పై నేడు విచారణ
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, మే 13 (ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్.. బుధవారం పోలీసు విచారణకు గైర్హాజరయ్యాడు. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు భగీరథ్‌ను తీసుకురావాలంటూ మంగళవారం అతని మేనమామకు పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తనకు రెండు రోజులు సమయం కావాలంటూ భగీరథ్.. పేట్ బషీరాబాద్ పోలీసులకు ఈ-మెయిల్ చేశాడు. తనపై వచ్చిన ఆరోపణలు తప్పు అని నిరూపించుకునే ఆధారాలతో 15న విచారణకు హాజరవుతానని పేర్కొన్నాడు. అయితే ఈ-మెయిల్‌ను తాము పరిగణనలోకి తీసుకోబోమని కేసు పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తున్న డీసీపీ రితిరాజ్ తెలిపారు. భగీరథ్‌ను పట్టుకోవడానికి ఐదు పోలీస్ బృందాలను రంగంలోకి దింపామన్నారు. రెండు బృందాలు ఢిల్లీలో, రెండు హైదరాబాద్‌లో, ఒక బృందం కరీంనగర్‌లో గాలిస్తున్నాయని ఏసీపీ శంకర్‌రెడ్డి వెల్లడించారు. కాగా, భగీరథ్ విచారణకు రాకపోవడాన్ని పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. అదే సమయంలో రెండు రోజుల సమయం కోరుతూ తమకు చేసిన ఈ-మెయిల్‌ను సోషల్‌మీడియాలో భగీరథ్ ప్రచారం చేసుకోవడాన్ని పోలీసులు తప్పుడుతున్నారు. మరోవైపు బాధిత బాలిక వయసు విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయని భగీరథ్ న్యాయవాది పంపిన నోటీసుకు జవాబిచ్చేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు.
బాలికకు రెండు బర్త్ సర్టిఫికెట్లు
బాధిత బాలిక వయసుకు సంబంధించి కుటుంబసభ్యులు రెండు బర్త్ సర్టిఫికెట్లను చూపిస్తున్నారని, ఆధార్ కార్డులు రెండు వేర్వేరు పేర్లతో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇలా రెండు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం బాలిక జన్మించిన హైదరాబాద్‌లోని ఆస్పత్రికి లేఖ రాశారు. దీంతోపాటు తనపై లైంగికదాడి యత్నం జరిగిందని బాధితురాలు పేర్కొన్న మూడు ప్రదేశాల్లో రెండు చోట్ల గురువారం సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేపడుతామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మైనర్ బాలికకు సంబంధించిన పోక్సో కేసులో మీడియా ట్రయల్స్ నిర్వహించడం దర్యాప్తును సంక్లిష్టం చేస్తుందన్నారు. నిష్పక్షపాతంగా ఆధారాలు సేకరిస్తున్నామని, హైకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తున్నామని తెలిపారు. బాధిత బాలిక వాంగ్మూలం ఆధారంగా ఇప్పటికే కొన్ని సెక్షన్లను అదనంగా జోడించామని, దర్యాప్తులో మరికొన్ని సెక్షన్లు జోడించే అవకాశాలను తోసిపుచ్చలేమని అంటున్నారు. కాగా, ఈ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భగీరథ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది.
లుకౌట్ నోటీసు జారీ చేయాలి: కవిత
బండి భగీరథ్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయాలని టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత కోరారు. అతడు విదేశాలకు పారిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తన కుమారుడిపై గంభీరమైన ఆరోపణలు వచ్చినా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రధానితో వేదిక పంచుకోవడం శోచనీయమన్నారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం కారణంగా బాధిత అమ్మాయి ఫొటోలు బయటకు వచ్చాయన్నారు. రాజకీయాల్లోని లేని బండి సంజయ్ కుమారుడి విషయంలో రాజకీయాలు చేయడం తనకు ఇష్టంలేదని, కానీ.. బాధితురాలికి న్యాయం జరగాలన్నదే తన అభిమతమని తెలిపారు.
బాధితురాలికి అండగా కాంగ్రెస్: మహేశ్‌గౌడ్
భగీరథ్ కేసులో బాధితురాలికి కాంగ్రెస్ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ అన్నారు. పోక్సో చట్టాన్ని తీసుకువచ్చిందే కాంగ్రెస్ అని గుర్తు చేశారు. కేసు నుంచి భగీరథ్‌ను తప్పించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. కాగా, ఇంటి దీపాన్ని చక్కదిద్దుకోలేని సంజయ్.. ఇక దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు.
బాధిత కుటుంబాన్ని కలిసిన కాంగ్రెస్ మహిళా నేతలు
బండి భగీరథ్ కేసుకు సంబంధించి బాధిత కుటుంబాన్ని బుధవారం కాంగ్రెస్ మహిళా నేతలు ఎమ్మెల్యే పద్మావతీరెడ్డి, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నేరెళ్ల శారద, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కలిశారు. వారిని ఓదార్చి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివరాలను టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్‌కు నివేదించారు. దోషులపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు, బాధితురాలికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు. కాగా, కేంద్రమంత్రి కొడుకైనా, ఇంకెవరైనా.. తప్పుచేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని మంత్రి సీతక్క అన్నారు. భగీరథ్‌పై ఫిర్యాదు రాగానే పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారని, మహిళా అధికారితో విచారణకు సీఎం ఆదేశించారని గుర్తు చేశారు.
మహిళా సంఘాల ఆందోళన
కేంద్రమంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదు చేసి వారం గడిచినా అరెస్ట్ చేయకపోవడాన్ని నిరసిస్తూ పీవోడబ్ల్యూ, పీడీఎస్‌యూ, ఐఎఫ్‌టీయూ సంఘాల ఆధ్వర్యలో బుధవారం పేట్ బషీరాబాద్ పీఎస్ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని మేడ్చల్ పీడీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా పీవోడబ్ల్యూ జాతీయనాయకురాళ్లు బి.సంధ్య, జి.ఝాన్సీ, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనురాధ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి తన స్నేహితుడి కుమారుడిని కేసు నుంచి బయట పడేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిందితుణ్ని తక్షణమే చట్టప్రకారం శిక్షించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం లోయర్ ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో చార్మినార్ బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టారు. మరోవైపు పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని, అతడు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ ఇందిరాపార్కు చౌరస్తా, అశోక్‌నగర్ చౌరస్తా ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లలో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం బండి సంజయ్, భగీరథ్ ఫొటోలతో కూడిన పోస్టర్లను అంటించారు.