పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆందోళన వద్దు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ABN , Publish Date - Apr 29 , 2026 | 05:15 PM
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా కొరత లేదని, కావాల్సినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంక్‌ల్లో పెట్రోల్, డీజిల్‌కు కొరత ఏర్పడడంతో పలు బంక్‌లు మూతబడ్డాయి. దీంతో వాహనదారులు తీసి ఉన్న బంక్‌ల వద్ద బారులు తీరారు. తాజాగా, పెట్రోల్, డీజిల్ కొరతపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో ఎక్కడా కొరత లేదని, కావాల్సినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఇంధన విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. పారిశ్రామిక డీజిల్ ధరలు పెరగడంతో, బల్క్ వినియోగదారులు కూడా రిటైల్ బంకులపై ఆధారపడటం వల్ల సాధారణ బంకులపై ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు ధరలు పెరుగుతాయన్న వదంతులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం, ఇంధన సరఫరాలో అంతరాయం కలగకుండా హై అలర్ట్ ప్రకటించాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,536 బంకుల ద్వారా నిరంతర సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటోంది. ఇంధన సరఫరాలో సమస్యలు ఉన్నా లేదా ఫిర్యాదులు చేయాలన్నా 1967 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో ఇంధన నిల్వలపై ప్రభావం పడకుండా ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. వదంతులను నమ్మి అనవసరంగా ఆందోళన చెందవద్దు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్‌ఎస్ పేరుపైనే కవిత పార్టీ పెట్టడం హాస్యాస్పదం: కోమటిరెడ్డి
రేవంత్ రెడ్డికి నాకు వ్యక్తిగత పంచాయతీ లేదు: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News