ఫ్యూచర్ సిటీలో క్రికెట్ స్టేడియం
ABN , Publish Date - Aug 31 , 2026 | 06:23 AM
క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచస్థాయి క్రీడా ప్రాంగణం నిర్మాణంపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఫ్యూచర్ సిటీలో అనువైన చోటు కోసం అధికారులు అన్వేషిస్తున్నారు
100 ఎకరాల్లో నిర్మించనున్న బీసీసీఐ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో
అనువైన స్థలం కోసం అన్వేషణ100 ఎకరాల్లో నిర్మించనున్న బీసీసీఐ
సీఎం ఆదేశాలతో స్థలం కోసం అన్వేషణ
హైదరాబాద్, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచస్థాయి క్రీడా ప్రాంగణం నిర్మాణంపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఫ్యూచర్ సిటీలో అనువైన చోటు కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. డిసెంబరులో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే మేటి స్టేడియంగా నిలిచేలా దీనిని తీర్చిదిద్దనున్నారు. మనదేశంలో ప్రస్తుతం 1,32,000 సీటింగ్ సామర్థ్యంతో గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉంది. ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో అంతకంటే పెద్ద స్టేడియం నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీని నిర్మాణ వ్యయం, నిర్వహణ ఖర్చులను బీసీసీఐ భరించనుండగా, రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇవ్వనుంది. ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు (ప్రతిపాదన), శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉండటంతో ఈ స్టేడియానికి ప్రేక్షకుల రాకపోకలు కూడా సులువు అవుతాయని అధికారులు తెలిపారు. ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న స్పోర్ట్స్ సిటీ, టూరిజం, నెట్ జీరో సిటీ కాన్సెప్ట్‌లో ఈ క్రీడా ప్రాంగణం కీలక భాగం కానుంది. క్రికెట్ మ్యాచ్‌లే కాకుండా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, భారీ కాన్సర్ట్‌ల నిర్వహణకు సైతం పనికొచ్చేలా దీనిని డిజైన్ చేస్తున్నారు.