నాంపల్లి పోక్సో కోర్టు సంచలన తీర్పు.. 33 మంది దోషులకు శిక్షలు
ABN , Publish Date - Aug 19 , 2026 | 07:36 PM
పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2015లో సీఐడీ నమోదు చేసిన కేసులో బాలికలను ట్రాప్ చేసి వ్యభిచారంలోకి దింపిన ముఠాకు చెందిన 33 మందిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం.. వారికి కఠిన శిక్షలు విధించింది.
హైదరాబాద్, ఆగస్టు 19: నాంపల్లి పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్లను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాకు చెందిన 33 మందిని దోషులుగా నిర్ధారించి, శిక్షలను ఖరారు చేసింది. 2015లో సీఐడీ నమోదు చేసిన పోక్సో కేసులో నాంపల్లి పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది బాలికలను ముఠా సభ్యులు లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాలికలను ప్రలోభాలకు గురిచేసి, వ్యభిచారంలోకి దించినట్లు తేలింది. ప్రాసిక్యూషన్ ఆరోపణలను కోర్టు విచారణలో పరిశీలించింది. సుదీర్ఘకాలం కొనసాగిన ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం న్యాయస్థానం దోషులకు శిక్షలు విధించింది.
ఐదుగురికి జీవిత ఖైదు.. బాధిత బాలికలకు రూ.5 లక్షల పరిహారం..
తీర్పులో భాగంగా ఐదుగురు దోషులకు జీవిత ఖైదు విధించగా, మరో ముగ్గురికి 14 ఏళ్ల జైలు శిక్ష, 14 మందికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. మిగిలిన దోషులకు కూడా కేసులో వారి పాత్రను బట్టి న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ కేసులో బాధితులైన తొమ్మిది మంది బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడిన ముఠాపై కఠినంగా వ్యవహరించిన నాంపల్లి పోక్సో కోర్టు తీర్పు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
తివాచీని ఇలా కూడా ఉతుకుతారా? వీడియో వైరల్
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.13,041 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం..