మేడ్చల్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు.. ఐదుగురి అరెస్టు
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:33 PM
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నకిలీ వైద్యుల వ్యవహారం కలకలం రేపింది. ఎలాంటి వైద్య అర్హతలు, డిగ్రీలు లేకుండానే క్లినిక్‌లు నిర్వహిస్తూ అల్లోపతి మందులు విక్రయిస్తూ ప్రజలకు వైద్యం చేస్తున్న ఐదుగురిని కుత్బుల్లాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
మేడ్చల్, సెప్టెంబర్ 2: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నకిలీ వైద్యుల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఎలాంటి వైద్య డిగ్రీలు.. అర్హతలు లేకుండానే కొందరు వ్యక్తులు క్లినిక్‌లు ఏర్పాటు చేసుకుని ప్రజలకు వైద్యం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారంతో కుత్బుల్లాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి పలు ప్రాంతాల్లో తనిఖీలు.. దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్న ఐదుగురు నకిలీ వైద్యులను అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ పరిధిలో ఇద్దరు, జగద్గిరిగుట్ట, పెట్ బషీరాబాద్, సూరారం పరిధిలో ఒక్కొక్కరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఎలాంటి అర్హతలు లేకుండా అల్లోపతి మందులు విక్రయించడంతో పాటు రోగులకు వైద్యం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
భారీగా మందులు, వైద్య పరికరాలు స్వాధీనం..
నిందితుల వద్ద నిర్వహించిన తనిఖీల్లో భారీగా మందులు, వైద్య పరికరాలు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ అనుమతి లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా వైద్య అర్హతలు లేని వ్యక్తులు అల్లోపతి వైద్యం చేయడం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
గొల్లగుప్ప ఘటన..చిన్నారి మృతిపై పోస్ట్‌మార్టం రిపోర్టే కీలకం: ఆస్పత్రి సూపరింటెండెంట్
అఫ్గాన్ సిరీస్‌కు నో ఛాన్స్: ఆశ చావలేదు.. కృనాల్ పాండ్య పోస్ట్ వైరల్!