Share News

కల్తీ కల్లు తయారీకి మత్తు పదార్థాల సరఫరా.. నిందితుడిపై పీడీ యాక్ట్!

ABN , Publish Date - Nov 21 , 2026 | 03:17 PM

కల్తీ కల్లు తయారీకి వినియోగించే రసాయనాలు, మత్తు పదార్థాల అక్రమ సరఫరాకు పాల్పడుతున్న వ్యక్తిపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.

కల్తీ కల్లు తయారీకి మత్తు పదార్థాల సరఫరా.. నిందితుడిపై పీడీ యాక్ట్!
Medchal PD Act

మేడ్చల్, నవంబరు 21: కల్తీ కల్లు తయారీకి వినియోగించే రసాయనాలు, మత్తు పదార్థాల అక్రమ సరఫరాకు పాల్పడుతున్న వ్యక్తిపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సిద్దగొని రంగయ్య (45)పై పీడీ యాక్ట్ అమలు చేశారు. క్లోరల్ హైడ్రేట్, ఆల్ప్రజోలం వంటి మత్తు పదార్థాల అక్రమ సరఫరా కేసుల్లో రంగయ్య కీలక నిందితుడిగా ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.

మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీసులు నమోదు చేసిన కేసులో 25 కిలోల క్లోరల్ హైడ్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నాచారం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ అతడిపై మరో కేసు నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆల్ప్రజోలం సరఫరాకు సంబంధించి కూడా కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పిల్లాయిపల్లి గ్రామంలోని తన స్వగృహం నుంచే రంగయ్య మత్తు పదార్థాల అక్రమ సరఫరా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.


జైలులోనే పీడీ యాక్ట్ ఉత్తర్వుల జారీ..

వరుసగా మత్తు పదార్థాల అక్రమ సరఫరా కేసుల్లో నిందితుడిగా ఉన్న రంగయ్యపై పీడీ యాక్ట్ అమలు చేయాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అవినాశ్ మహంతి ఆదేశించారు. దీంతో ఎక్సైజ్ అధికారులు అతడిపై నమోదైన కేసుల వివరాలు.. నేరాలకు సంబంధించిన ఆధారాలతో జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు సమర్పించారు. వాటిని పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ పీడీ యాక్ట్ అమలుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రంగయ్య చర్లపల్లి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉండగా, జైలులోనే అతడికి నిర్బంధ ఉత్తర్వులను అధికారులు అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్‌ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్.. కాంగ్రెస్‌కు నాలుగు సూటి ప్రశ్నలు..

ఆసక్తికరంగా కొలత్తూరు ఉపఎన్నిక.. ఎంకే స్టాలిన్ మళ్లీ పోటీ చేస్తారా..?

Updated Date - Nov 21 , 2026 | 03:32 PM