Share News

నిమజ్జనోత్సవం మహా విషాదమై..

ABN , Publish Date - Sep 17 , 2026 | 02:37 AM

మూడు రోజులపాటు భక్తితో కొలిచి, అంతకు మించిన ఉత్సాహంతో గణనాథుడిని సాగనంపేందుకు వెళ్లిన ఆ యువకులు ఊహించని ప్రమాదంలో చిక్కుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. చెరువులో పడిపోయిన మిత్రుడిని కాపాడటానికి ప్రయత్నిస్తూ ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగి ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

నిమజ్జనోత్సవం  మహా విషాదమై..
ganesh Nimajjanam

  • చెరువులో మునిగి ఆరుగురు విద్యార్థుల దుర్మరణం

  • నెత్తిన విగ్రహంతో నీళ్లలోకి దిగి మునిగిన యువకుడు.. కాపాడబోయి ఒకరి వెంట మరొకరు..

  • పటాన్‌చెరు మండలం పెద్దకంజర్లలో ఘటన

  • మృతులంతా శిరీష చారిటబుల్‌ ట్రస్టుకు చెందిన

అనాథ, నిరుపేద విద్యార్థులు

పటాన్‌చెరు రూరల్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మూడు రోజులపాటు భక్తితో కొలిచి, అంతకు మించిన ఉత్సాహంతో గణనాథుడిని సాగనంపేందుకు వెళ్లిన ఆ యువకులు ఊహించని ప్రమాదంలో చిక్కుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. చెరువులో పడిపోయిన మిత్రుడిని కాపాడటానికి ప్రయత్నిస్తూ ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగి ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్దకంజర్లలో బుధవారం చోటుచేసుకుంది. పెద్దకంజర్ల గ్రామంలోని శిరీష చారిటబుల్‌ ట్రస్టులో సుమారు 70 మంది అనాథ, పేద విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా గణనాథుడిని ప్రతిష్టించుకున్న వీరు.. బుధవారం సాయంత్రం ఆశ్రమాన్ని ఆనుకుని ఉన్న నేరేడు చెరువులో నిమజ్జనానికి వెళ్లారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు 8 మంది విద్యార్థులు చెరువులోకి దిగారు. వరంగల్‌ జిల్లా బాలయ్యపల్లికి చెందిన గణేష్‌(18) విగ్రహాన్ని నెత్తిన పెట్టుకుని నీటిలో ముందుకు వెళ్తుండగా.. గతంలో ఇటుక బట్టీల కోసంతవ్వినగుంతలో చిక్కుకుని మునిగిపోయాడు. అతడిని రక్షించేందుకు మిగతావారు ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో పాలిటెక్నిక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కూకట్‌పల్లికి చెందిన శ్యాంకుమార్‌ (17), డిప్లొమా రెండో సంవత్సరం చదువుతున్న భీమవరానికి చెందిన నర్సింహరాజు (21), భద్రాచలానికి చెందిన సుమంత్‌రెడ్డి (17), పదోతరగతి చదువుతున్న వరంగల్‌ జిల్లా బాలయ్యపల్లికి చెందిన సిద్ధార్థ (17), పాలిటెక్నిక్‌ మూడో సంవత్సరం చదువుతున్న కూకట్‌పల్లికి చెందిన ఉదయ్‌కిరణ్‌ (22) వరుసగా నీట మునిగారు.


ఈత వచ్చిన మరో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలతో బయటపడి ఆశ్రమం సిబ్బందికి విషయం చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, విద్యార్థులను బయటకు తీసుకొచ్చి ఇంద్రేశంలోని ప్రాచీన్‌ గ్లోబల్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఐదుగురు మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో విద్యార్థి కన్నుమూశాడు. అప్పటివరకు ఆడుతూపాడుతూ కనిపించిన విద్యార్థులు విగతజీవులుగా మారడంతో ఆస్పత్రి ప్రాంగణంలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదర్శరెడ్డి తదితరులు ఆస్పత్రికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

ఈ వార్తలు కూడా చదవండి

బీజేపీతో పొత్తుపై కేటీఆర్‌ క్లారిటీ.. ఏమన్నారంటే

90 మంది ఎమ్మెల్యేలు భూకబ్జాలకు పాల్పడ్డారు: బండి సంజయ్‌

Updated Date - Sep 17 , 2026 | 02:37 AM