సిద్దిపేట జిల్లా కీసరలో దారుణం.. ప్రియుడి మోజులో కుమారుడి హత్య..
ABN , Publish Date - Jun 20 , 2026 | 03:50 PM
సిద్దిపేట జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి కన్న కుమారుడినే కడతేర్చిందో కసాయి తల్లి. ఏకాంతంగా గడిపేందుకు అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి తన రెండేళ్ల కొడుకుని హతమార్చింది.
సిద్దిపేట: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడి కన్న కుమారుడినే కడతేర్చిందో కసాయి తల్లి. ఏకాంతంగా గడిపేందుకు అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి తన రెండేళ్ల కొడుకుని హతమార్చింది. అనారోగ్య సమస్యలతో చనిపోయాడని భర్తను నమ్మించే ప్రయత్నం చేసింది. చిన్నారి తండ్రి విషయం పసిగట్టడంతో చివరికి కటకటాల పాలైంది.
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుళ్లకు చెందిన ఓ కుటుంబం ఉపాధి పనుల నిమిత్తం కొన్నాళ్లుగా కీసరలో నివాసం ఉంటోంది. భర్త కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని భార్య తమ రెండేళ్ల కుమారుడిని చూసుకుంటూ ఇంటి వద్దే ఉంటోంది. అయితే, ఆమెకు ఇటీవల నవీన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త పనికి వెళ్లిన సమయంలో నవీన్ వారి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో తాము ఏకాంతంగా గడిపేందుకు చిన్నారిని అడ్డుగా భావించాడు. అలాగే బాలుడు తనకు నచ్చలేదని, చంపేద్దామని చెప్పడంతో ప్రియుడి కోసం కుమారుడిని హత్య చేసేందుకు నిర్ణయించుకుంది ఆ మహాతల్లి. ఇద్దరూ కలిసి బాలుడిని తీవ్రంగా కొట్టారు. తలకు తీవ్రగాయాలు కావడంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో నవీన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
భర్త వచ్చిన తర్వాత కుమారుడికి ఫిట్స్ వచ్చి చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసింది ఆ మహిళ. ఆ తర్వాత భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి గట్టిగా నిలదీయడంతో హత్య రహస్యం బయటపడింది. వెంటనే బాధిత తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయం చెప్పి న్యాయం చేయాలని కోరాడు. చిన్నారి మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు.. గాంధీ ఆస్పత్రి వైద్యుల సమక్షంలో రీ-పోస్ట్‌మార్టం నిర్వహించారు. నివేదికలో చిన్నారిని హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు సదరు మహిళను పోలీసులు అరెస్టు చేయగా.. ప్రియుడు నవీన్ పరారీలో ఉన్నాడు. కాగా, ప్రియుడి మోజులో కుమారుడిని హత్య చేసిన మహిళపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆస్తుల పరిరక్షణ కోసమే హైడ్రా.. డిజాస్టర్ కోసం కాదు: రంగనాథ్
టీజీ-20 లీగ్‌ను హెచ్‌సీఏ అక్రమంగా నిర్వహిస్తోంది: టీసీఏ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి..