మ్యాట్రిమోనీలో పరిచయం.. పెళ్లి పేరుతో కోటి రూపాయల మోసం..
ABN , Publish Date - Oct 25 , 2026 | 07:58 AM
పెళ్లి పేరుతో మహిళను నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాధితురాలి నుంచి విడతలవారీగా ఏకంగా రూ.1.18 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
హైదరాబాద్, అక్టోబర్ 25: పెళ్లి పేరుతో మహిళను నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాధితురాలి నుంచి విడతలవారీగా ఏకంగా రూ.1.18 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగకుండా, తన వద్ద ఉన్న వ్యక్తిగత ఫొటోలను బయటపెడతానని బెదిరించి మరో రూ.4 లక్షలు తీసుకున్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పీర్జాదిగూడలోని కెనరా నగర్‌కు చెందిన 41 ఏళ్ల మహిళకు 2024లో మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా కోనేటి ప్రదీప్ (41) పరిచయమయ్యాడు. తనకు గతంలో వివాహమై విడాకులు తీసుకున్నానని, తల్లిదండ్రులు కూడా లేరని ఆమెకు పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమెకు దగ్గరైన ప్రదీప్, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం వివిధ అవసరాలు, ఇతర కారణాలు చెబుతూ ఆమె వద్ద నుంచి పలు దఫాలుగా భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
పెళ్లి ప్రస్తావన తెస్తే వాయిదాలు.. ఫొటోలతో బెదిరించి మరో రూ.4 లక్షలు
పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చిన ప్రదీప్, ఆ విషయం ప్రస్తావించిన ప్రతిసారీ ఏదో ఒక కారణం చెబుతూ వాయిదా వేస్తూ వచ్చాడని బాధితురాలు తెలిపింది. ఇలా కొంతకాలంగా పెళ్లి పేరుతో నమ్మిస్తూ డబ్బులు వసూలు చేయడంతో పాటు, తన వద్ద ఉన్న వ్యక్తిగత ఫొటోలను బయటపెడతానని బెదిరించినట్లు ఆరోపించింది. ఈ బెదిరింపులతో భయపడిన బాధితురాలి నుంచి మరో రూ.4 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ప్రదీప్ వ్యవహారశైలితో విసిగిపోయిన మహిళ చివరకు మేడిపల్లి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు కోనేటి ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మ్యాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా పరిచయాలు ఏర్పరచుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
ఈ వార్తలనూ చదవండి: