హిడ్మాను పక్కా ప్లాన్‌తో కాల్చి చంపారు.. ABN ఆంధ్రజ్యోతితో మల్లా రాజిరెడ్డి..
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:40 PM
పార్టీ అగ్ర నాయకత్వం హిడ్మా ఎన్‌కౌంటర్ కారణంగా భయపడిపోయి లొంగిపోయిందనటంలో ఎలాంటి వాస్తవం లేదని మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అన్నారు. పక్కా ప్లాన్‌తోనే మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాను భద్రతా దళాలు పట్టుకుని కాల్చి చంపాయని తెలిపారు.
హైదరాబాద్, మార్చి 13: పక్కా ప్లాన్‌తోనే మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాను భద్రతా దళాలు పట్టుకుని కాల్చి చంపాయని మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అన్నారు. పార్టీ అగ్ర నాయకత్వం హిడ్మా ఎన్‌కౌంటర్ కారణంగా భయపడిపోయి లొంగిపోయిందనటంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌పై పార్టీలో రివ్యూ జరగలేదని తెలిపారు. హిడ్మా సాహసోపేతంగా ఆపరేషన్లు చేసేవాడని, పార్టీలో అతడికి మంచి పేరుందని వెల్లడించారు.
మల్లా రాజిరెడ్డి శుక్రవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ‘మేము పోలీసుల ముందు లొంగిపోలేదు. అరెస్ట్ చేసి లొంగుబాటుగా చూపించారు. పార్టీలో దిశా నిర్దేశం చేయడానికి పరిస్థితులు అనుకూలంగా లేకుండా పోయాయి. 2023 వరకు సెంట్రల్ కమిటీ యాక్టీవ్‌గా ఉంది. ఆ తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2024లో ఆపరేషన్ కగార్ మొదలైన తరువాత పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసే స్థితి లేకుండా పోయింది. ఆపరేషన్ కగార్ లాంటివి మావోయిస్టు పార్టీ చాలా చూసింది’..
‘మేము కగార్ ఆపరేషన్‌కు భయపడి బయటికి రాలేదు. ప్రాణాలకు తెగించి దండ కారణ్యంలో పోరాటం చేశాం. రాజ్యంతో పోలిస్తే మావోయిస్టు పార్టీ బలం తగ్గింది. పార్టీ క్షీణించడానికి చాలా కారణాలు ఉన్నాయి. పార్టీలో భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, గ్రూప్‌లు ఉన్నాయనేది చర్చ మాత్రమే.. అందులో వాస్తవం లేదు. కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలో ఉన్న వాళ్లం చర్చించుకుని బయటకు వచ్చాం. ప్రజల్లో ఉండి.. ప్రజల కోసం పోరాటం చేస్తాం. మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగానే చూడాలి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఇండియాలో క్రికెట్ అంటే ఆట కాదు.. ఓ ఎమోషన్: సూర్యకుమార్ యాదవ్
రైలు చివరి బోగీపై 'X' గుర్తు ఎందుకు ఉంటుంది? మీకు తెలుసా?