వికారాబాద్‌లో జంట మృతదేహాల కలకలం.. హత్యా..?, ఆత్మహత్యా..?
ABN , Publish Date - Sep 08 , 2026 | 03:36 PM
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఐనెల్లి శివారులో రెండు మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలు.. స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి.
వికారాబాద్, సెప్టెంబరు 08: తాండూరు మండలం ఐనెల్లి శివారులో రెండు మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలు.. స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. పక్కన రెండు పురుగుల మందు డబ్బాలు పడి ఉండటంతో ఇది హత్యనా..? లేక ఆత్మహత్యనా..? అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఐనెల్లి శివారులో జంట మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభించాయి. తీవ్ర దుర్వాసన రావడంతో అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతుల్లో ఒకరు పురుషుడు కాగా, మరొకరు మహిళగా గుర్తించారు. మృతదేహాల వద్ద ఎటువంటి గుర్తింపుకార్డులు దొరకలేదని పోలీసులు తెలిపారు. అలాగే మృతదేహాలు కుళ్లిపోయి ఉన్నందున గుర్తించడానికి వీలు లేకుండా ఉందని పేర్కొన్నారు. మృతులిద్దరూ భార్యాభర్తలా..?, ప్రేమికులా? అనే దానిపైనా స్పష్టత లేదన్నారు.
అలాగే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారా?, లేక ఎవరైనా హత్య చేసి మృతదేహాలను ఇక్కడ పడేశారా? వంటి అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ముందుగా వారి గుర్తింపు తెలుసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. నివేదిక వచ్చిన తర్వాత వీరి మరణాలకు గల కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కాగా, జంట మృతదేహాలు ఒకే చోట లభించడంతో అసలేం జరిగిందే దానిపై స్థానికుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్ చావును కోరుకుంటున్న సీఎం రేవంత్: వేముల ప్రశాంత్ రెడ్డి
బీఆర్‌ఎస్ దాడిలో గాయపడ్డ మహిళా పోలీసులకు మంత్రి సీతక్క పరామర్శ