తెలంగాణను నెంబర్‌వన్‌గా నిలిపేందుకు కష్టపడుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Nov 09 , 2026 | 08:36 PM
తెలంగాణను నెంబర్‌వన్‌గా నిలిపేందుకు కష్టపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని చెప్పారు. సోమవారం కొడంగల్‌లో నిర్వహించిన ఆత్మీయ సభలో రైతులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
కొడంగల్, నవంబర్ 09: తెలంగాణను నెంబర్‌వన్‌గా నిలిపేందుకు కష్టపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని చెప్పారు. సోమవారం కొడంగల్‌లో నిర్వహించిన ఆత్మీయ సభలో రైతులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గతంలో ఎంతోమంది మంత్రులైనా పాలమూరులో నీళ్లు పారలేదు.. వలసలు ఆగలేదని గుర్తు చేశారు.
గతంలో ఎంతమంది నేతలు మారినా.. పాలమూరు ప్రజల తలరాతలు మారలేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు వాసులు.. ఎప్పుడూ నీళ్లు, పరిశ్రమల కోసం.. ఎంతోమంది నాయకులను అడిగారని చెప్పారు. కానీ ఈ జిల్లాకు పరిశ్రమలు, నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను గతంలో పాలమూరు నుంచి గెలిపించి గుండెల్లో పెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచిన కేసీఆర్.. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. అయితే కేసీఆర్ పాలమూరు రుణం తీర్చుకుంటారని అనుకున్నామని అన్నారు. పాలమూరు ప్రాజెక్టులను ఆయన పూర్తి చేస్తారని ఆశపడ్డామని పేర్కొన్నారు.
కానీ కేసీఆర్.. మన గుండెలపై తన్ని కృష్ణా నదిలో పడేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు కనీసం కృతజ్ఞత కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. పాలమూరు జిల్లాపై ఆయన కక్ష పెంచుకున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో పాలమూరుకు చుక్కనీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
ఇక బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రూ.8.15 లక్షల కోట్ల అప్పులు చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు ధనిక రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని విమర్శించారు. ఇంత అప్పుతో ప్రయాణం తమకు సవాల్‌గా మారిందని అన్నారు. తాను సీఎం అయ్యే నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు.. ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు కృషి చేశామని అన్నారు. రాష్ట్రంలోని వ్యవస్థలను గాడిలో పెట్టామని చెప్పారు. ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు చర్యలు
గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డాడు.. చివరకు ఏమైందో చూస్తే షాకవ్వాల్సిందే..
Read Latest Telangana News And Telugu News