Share News

గ్యాస్‌ బండకు.. ఈ-కేవైసీ గండం!

ABN , Publish Date - Aug 03 , 2026 | 06:06 AM

వంటగ్యాస్‌ వినియోగదారులను ఈ-కేవైసీ గండం వెంటాడుతోంది. గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతి కుటుంబం ఈ నెల 16లోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తిచేయాలని చమురు మార్కెటింగ్‌ సంస్థలు..

గ్యాస్‌ బండకు..  ఈ-కేవైసీ గండం!

  • నమోదుకు 16తో ముగియనున్న గడువు

  • బోగస్‌ కనెక్షన్ల ఏరివేత కోసం ఈ-కేవైసీ

  • ఇంటివద్దకే తెచ్చినా తీరని సమస్యలు

  • ఉపాధి, చదువుల కోసం విదేశాలకు వెళ్లిన

  • కనెక్షన్‌దారులు బయోమెట్రిక్‌ చేయలేని పరిస్థితి

  • ఉజ్వల లబ్ధిదారుల మృతితో వారసులకు చిక్కులు

  • ఒకే కుటుంబంలో ఇద్దరి కనెక్షన్లపై గందరగోళం

  • వృద్ధుల వేలిముద్రలు నమోదు కాక ఇబ్బందులు

  • వినియోగదారుల్లో కనెక్షన్‌ రద్దు కలవరం

హైదరాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): వంటగ్యాస్‌ వినియోగదారులను ఈ-కేవైసీ గండం వెంటాడుతోంది. గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతి కుటుంబం ఈ నెల 16లోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తిచేయాలని చమురు మార్కెటింగ్‌ సంస్థలు నిబంధన విధించడంతో వినియోగదారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గ్యాస్‌ ఏజెన్సీల వద్ద క్యూలో నిలబడే తిప్పలు తప్పించేందుకు డెలివరీ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే ఈ-కేవైసీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినా.. ఇతర సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. గ్యాస్‌ కనెక్షన్‌దారు విదేశాల్లో ఉండటం, మరణించడం, వృద్ధుల వేలిముద్రలు పడకపోవడంతోపాటు ఆధార్‌, గ్యాస్‌ వివరాల్లో తేడాలు, ఒకే కుటుంబంలో రెండు కనెక్షన్లు ఉండటం వంటి సమస్యలకు సరైన పరిష్కారం లభించకపోవడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇటీవల అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ఇంధన మార్కెట్‌పై పడటంతో ఎల్పీజీ సరఫరాపై ఒత్తిడి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలోనూ సరఫరా ఆలస్యం, బుకింగ్‌ డెలివరీ మధ్య తీవ్ర జాప్యం జరిగేది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ఎల్పీజీని నిజమైన గృహ వినియోగదారులకే అందించడంతోపాటు బోగస్‌, డూప్లికేట్‌, దీర్ఘకాలంగా వినియోగంలో లేని కనెక్షన్లను గుర్తించి తొలగించడంపై చమురు సంస్థలు దృష్టి పెట్టాయి. వినియోగదారు ఆధార్‌, బయోమెట్రిక్‌ వివరాలను అనుసంధానం చేయడం ద్వారా.. అసలు లబ్ధిదారును గుర్తించేందుకు ఈ-కేవైసీని విస్తృతంగా అమలు చేస్తున్నాయి.


విదేశాల్లో ఉన్నవారికి చిక్కులు..

రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు పెద్ద సంఖ్యలో వలసలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌తోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా అనేక కుటుంబాలకు చెందినవారు సౌదీ అరేబియా, ఖతర్‌, కువైట్‌, ఒమన్‌ తదితర దేశాల్లో పనిచేస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు ఇతర పట్టణాల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ర్టేలియా తదితర దేశాలకు వెళ్లారు. ఇలాంటి కుటుంబాల్లో విదేశాల్లో ఉన్న వ్యక్తి పేరుతో గ్యాస్‌ కనెక్షన్‌ ఉంటే.. ఇంట్లో భార్య, తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యులు సిలిండర్‌ వినియోగిస్తుంటారు. దీంతో బయోమెట్రిక్‌ ధ్రువీకరణ సమయంలో అసలు కనెక్షన్‌దారు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారుతోంది. ఇంటివద్దకు డెలివరీ బాయ్‌ వచ్చినా కనెక్షన్‌ బయోమెట్రిక్‌ లేకపోతే ప్రక్రియ పూర్తికావడంలేదు. ఇలాంటి వారి కోసం ‘ఇండియన్‌ ఆయిల్‌ యాప్‌’ను అందుబాటులోకి తెచ్చినా.. అది పనిచేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గతంలో కుటుంబ పెద్ద పేరుతో తీసుకున్న కనెక్షన్‌.. ప్రస్తుతం ఆమె మరణించినా కుటుంబ సభ్యులు అదే గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. ఇలాంటి కుటుంబాల్లో గ్యాస్‌ కనెక్షన్‌పై ఆందోళన నెలకొంటోంది. వాస్తవానికి ఎవరైనా గ్యాస్‌ కనెక్షన్‌దారు మరణిస్తే.. వారి చట్టబద్ధ వారసుడు లేదా కుటుంబ సభ్యుడి పేరుమీదకు కనెక్షన్‌ను బదిలీ చేసే అవకాశం ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ (ఓఎంసీ)ల నిబంధనల్లో ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో అవసరమైన పత్రాలు, పేరు మార్పు ప్రక్రియ, ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు పేద కుటుంబాలకు భారంగా మారుతున్నాయి. ఇలాంటి ఖాతాలను బోగస్‌ ఖాతాలుగా చూడకుండా వారసుడి పేరుమీదకు సులభంగా బదిలీ చేసే ప్రత్యేక ప్రక్రియ ఉండాలని వినియోగదారులు కోరుతున్నారు.


ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉంటే..

భార్యాభర్తల పేర్లపై వేర్వేరుగా ఉన్న గ్యాస్‌ కనెక్షన్ల విషయంలో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ-కేవైసీ ద్వారా రేషన్‌కార్డు, ఆధార్‌ వివరాల మ్యాపింగ్‌ జరుగుతుండటంతో.. ఒకే కుటుంబంలో రెండు కనెక్షన్లు ఉంటే వాటిని తొలగిస్తారా? లేక కమర్షియల్‌గా మారుస్తారా? రెండింట్లో ఒక కనెక్షన్‌ సబ్సిడీ ఎత్తేస్తారా? అనే దానిపై స్పష్టత లేకుండాపోయింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధుల వేలిముద్రలు సరిగా పడకపోవడం మరో సమస్యగా మారింది. ఇంటర్నెట్‌ సదుపాయాలు సరిగా లేకపోవడం, మొబైల్‌ ఫోన్ల వినియోగంపై అవగాహన లేమి, బయోమెట్రిక్‌ పరికరాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో కేవైసీ ప్రక్రియను నెమ్మదింపజేస్తున్నాయి. పట్టణాల్లో ఐటీ ఉద్యోగులు, బ్యాచిలర్లు, అద్దెకు ఉండేవారు సొంత ఊళ్లకు వెళ్లడం వంటి కారణాల వల్ల కనెక్షన్‌దారు అందుబాటులో లేని పరిస్థితులు నెలకొంటున్నాయి. వాస్తవానికి గత నెలలోనే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా.. ఈ నెల 16 వరకు గడువు పెంచారు. ఈలోపు వందశాతం పూర్తిచేయాలని ఆయిల్‌ కంపెనీలు గడువు విధించాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 70 శాతం వరకే ఈ-కేవైసీ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ-కేవైసీ చేయకపోతే కనెక్షన్‌ రద్దవుతుందంటూ జరుగుతున్న ప్రచారం వినియోగదారుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ఈ-కేవైసీ చేయనివారికి గ్యాస్‌ సరఫరాను ఏజెన్సీలు ఇప్పటికే ఆపేశాయి. ఈ-కేవైసీ పూర్తికాకపోతే సబ్సిడీ ప్రయోజనాలపై కూడా ప్రభావం ఉంటుంది. దీంతో బోగస్‌ కనెక్షన్లుంటే తొలగించాలి తప్ప.. నిజమైన లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..

వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..

Updated Date - Aug 03 , 2026 | 06:06 AM