Share News

ఆ బంగారం కొండ ఎక్కడ?

ABN , Publish Date - Jun 04 , 2026 | 05:10 AM

ఒకటి కాదు.. రెండు కాదు.. 10, 20 కిలోలు కూడా కాదు! ఏకంగా 250 కిలోల బంగారం!! గత జగన్‌ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపుల రూపంలో...

ఆ బంగారం కొండ ఎక్కడ?

  • లిక్కర్‌ స్కామ్‌లో నాటి ప్రభుత్వ పెద్దలకు 250 కేజీల బంగారం ముడుపులు

  • ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.500 కోట్లు

  • హైదరాబాద్‌లో అందజేసిన డిస్టిలరీల యాజమాన్యాలు

  • సిట్‌కు మద్యం వ్యాపారి జైపాల్‌ రెడ్డి వాంగ్మూలం

  • హైదరాబాద్‌ శివారులోనే దాచారని సందేహం

  • గుట్టు తేల్చే పనిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

  • త్వరలో హైదరాబాద్‌, ఏపీలో దాడులకు సిద్ధం

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఒకటి కాదు.. రెండు కాదు.. 10, 20 కిలోలు కూడా కాదు! ఏకంగా 250 కిలోల బంగారం!! గత జగన్‌ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపుల రూపంలో అందిన బంగారం ఇది. ఆ పసిడిని హైదరాబాద్‌ నగరంలోగానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లోగానీ దాచి ఉంచారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సిట్‌తోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దృష్టి సారించినట్లు సమాచారం. మద్యం కుంభకోణంపై కూటమి సర్కారు సిట్‌ వేసిన సంగతి తెలిసిందే. దానిపై దర్యాప్తు చేసిన సిట్‌ అధికారుల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేసింది. సుమారు రూ.3,500 కోట్ల స్కాం జరిగిందని అందులో పేర్కొంది. తమకు ముడుపులు ఇచ్చిన మద్యం బ్రాండ్లనే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అందుబాటులో ఉంచడం, కొత్త-చెత్త బ్రాండ్లను అమ్మడం వంటి అక్రమాలు జరిగాయని స్పష్టం చేసింది. నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ఇవ్వకపోవడంతో పేరున్న బ్రాండ్లు అయిన ఆఫీసర్స్‌ చాయిస్‌, రాయల్‌ స్టాగ్‌ విస్కీ, కింగ్‌ ఫిషర్‌ బీర్లు ఆపేశారు.

ముడుపులు ఇవ్వడానికి సిద్ధపడిన డిస్టిలరీల యాజమాన్యాలు.. నాటి పాలకుల నుంచి అందిన సూచన మేరకు తాము ఇచ్చే ముడుపుల్లో కొంత భాగాన్ని బంగారం రూపంలో ఇచ్చినట్లు సిట్‌ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో మద్యం వ్యాపారి జైపాల్‌ రెడ్డి పూసగుచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మంజీరా బ్రాండ్‌ పేరుతో మద్యం వ్యాపారం చేస్తున్న ఎంఎస్‌ బయో అధినేత జైపాల్‌ రెడ్డిని సిట్‌ అధికారులు ఇటీవల విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. ఇలా డిస్టిలరీ యాజమాన్యాలు.. అప్పట్లో రూ.220 కోట్ల విలువైన ముడుపులతో 250 కేజీల బంగారం ముంబై, హైదరాబాద్‌ నుంచి సమీకరించి ముడుపులుగా చెల్లించినట్లు తేలింది. హైదరాబాద్‌ కేంద్రంగా సాగిన ఈ ముడుపుల వ్యవహారంలో బంగారం ఇక్కడే చేతులు మారింది. హైదరాబాద్‌ శివారులోని ఫాంహౌ్‌సల్లో సమావేశాలు జరిపి బంగారం ఎక్కడి నుంచి తేవాలి, ఎవరెవరికి ఎంత మొత్తం ఎక్కడికి చేరవేయాలి, అనేదానిపై చర్చించి ఆ మేరకు అందించారు.


జైపాల్‌ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఓవైపు సిట్‌, మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. లిక్కర్‌ కేసులో ఇప్పటికే పలు ప్రాంతాల్లో సోదాలు జరిపిన ఈడీ ప్రత్యేక బృందాలు.. త్వరలోనే 250 కిలోల బంగారం వ్యవహారంపై హైదరాబాద్‌తోపాటు ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లో దాడులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా 250 కిలోల బంగారం హైదరాబాద్‌ శివారులోని ఓ ఖరీదైన ఫ్లాట్‌లో భద్రపరిచినట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం బంగారం ఒకేచోట దాచారా, లేక వేర్వేరు ప్రాంతాలకు తరలించి భద్రపరిచారా అనేదానిపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. అయితే ఏపీ లిక్కర్‌ స్కాం వెలుగులోకి వచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థలు ఎప్పటికైనా గుర్తిస్తాయనే భయంతో ఇప్పటికే కొంత బంగారం కరిగించారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొంత బంగారాన్ని షెల్‌ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించే అవకాశం లేకపోలేదని, ఆ కోణంలోనూ దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

ఇప్పుడు రూ.500 కోట్లు...

లిక్కర్‌ స్కాం కేసులో చేతులు మారిన బంగారం నిల్వలు అలాగే ఉంటే ప్రస్తుతం దాని విలువ రూ. 500 కోట్లు ఉంటుందని అంచనా. లిక్కర్‌ స్కాం జరిగిన సమయంలో కేజీ బంగారం ధర మార్కెట్‌లో రూ.80 లక్షల నుంచి రూ.90 లక్షలు ఉంది. ఆ లెక్కన రూ.220 కోట్లతో 250 కేజీల బంగారం కొనుగోలు చేశారు. అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు బంగారం విలువ సుమారు రెండింతలు పెరిగిన నేపథ్యంలో లిక్కర్‌ స్కాం బంగారం డంప్‌ విలువ రూ.500 కోట్ల దాకా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Jun 04 , 2026 | 07:25 AM