రంగారెడ్డి జిల్లాలో వరుస చోరీలు.. తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా..
ABN , Publish Date - Oct 09 , 2026 | 08:54 AM
రంగారెడ్డి జిల్లా లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే తాళం వేసి ఉన్న ఇళ్లను.. నిర్మాణంలో ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి, అక్టోబర్ 9: జిల్లాలోని లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరుస దొంగతనాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఈ ఘటనలు చోటుచేసుకుంటుండటంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లతో పాటు నిర్మాణంలో ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్న దుండగులు.. తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడుతున్నారు. ఇళ్లలోని కాపర్ వైరింగ్, ఇతర విలువైన సామగ్రిని అపహరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వరుస చోరీలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్న కాలనీవాసులు.. దొంగల భయంతో అర్ధరాత్రి వేళల్లో రోడ్లపైకి వచ్చి స్వయంగా కాపలా కాస్తున్నారు.
మరోవైపు.. రాత్రివేళల్లో ఇళ్ల సమీపంలోని దుకాణాల వద్ద ఆకతాయిల గుంపులు చేరుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలనీలో గంజాయి వినియోగం, విక్రయాలపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వరుస దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు కాలనీలోని ప్రధాన మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు రాత్రివేళల్లో పోలీస్ పెట్రోలింగ్‌ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే చోరీలు జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు.. తమకు భద్రత కల్పించి, దొంగతనాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు!