Share News

క్యాతనపల్లిలో అసలేం జరుగుతోంది? ఉద్రిక్తత, లాఠీచార్జ్.. రాజకీయ రణరంగం!

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:34 AM

తెలంగాణలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే క్రమంలో ప్రధాన పార్టీల మధ్య సాగుతున్న పోరు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.

క్యాతనపల్లిలో అసలేం జరుగుతోంది? ఉద్రిక్తత, లాఠీచార్జ్.. రాజకీయ రణరంగం!
Kyathanpally Municipality Chairman Race

మంచిర్యాల, ఫిబ్రవరి 17: మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై గత కొన్ని గంటలుగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల ఎత్తుకు పైఎత్తులతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

కిడ్నాప్ ఆరోపణలు - ఫిర్యాదులు

మున్సిపల్ కార్యాలయంలో ఈ ఉదయం నుంచే హైడ్రామా మొదలైంది. 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ స్వర్ణలతను కిడ్నాప్ చేశారంటూ ఆమె అత్త లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. అయితే, స్వర్ణలత దంపతులు గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ క్యాంపులోనే ఉన్నట్లు సమాచారం. ఈ ఫిర్యాదు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అన్న కోణంలో చర్చ సాగుతోంది.

రంగంలోకి హేమాహేమీలు

మున్సిపల్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తున్న ప్రధాన పార్టీలు.. తమ పార్టీలోని కీలక నేతలను రంగంలోకి దింపాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కీలక నేతలు మోహరించారు. దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

కాంగ్రెస్ వ్యూహం: మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రంగంలోకి దిగి కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీ ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర అభ్యర్థితో కలిసి కౌన్సిల్ హాల్‌కు చేరుకున్నారు.

బీఆర్ఎస్ ప్రతివ్యూహం: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నలుగురు సీపీఐ కౌన్సిలర్లు భారీ బందోబస్తు మధ్య కార్యాలయానికి చేరుకున్నారు. ఆయా పార్టీల బలాబలాల విషయానికొస్తే, కాంగ్రెస్ (7 + 1 స్వతంత్ర), బీఆర్ఎస్ (10), సీపీఐ (4) స్థానాలు సాధించాయి.


పోలీసుల లాఠీచార్జ్.. యుద్ధభూమిగా మున్సిపాలిటీ

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను మున్సిపాలిటీ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. సుమన్ అనుచరులు పోలీసులపైకి రాళ్లు విసరడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కార్యాలయం చుట్టూ కిలోమీటర్ మేర రహదారులను సీజ్ చేసి పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు ఎవరూ మున్సిపాలిటీ కార్యాలయం వైపు రావొద్దని, పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నిన్నటి ఉద్రిక్తతల నేపథ్యంలో ఇవాళ పోలీసులు పట్టణంలో రూట్ మార్చ్ (కవాతు) నిర్వహించారు. ఎక్స్‌అఫిషియో ఓట్లు, స్వతంత్రుల మద్దతు ఎటువైపు మొగ్గుతుందనే దానిపైనే చైర్మన్ ఎన్నిక ఫలితం ఆధారపడి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

నా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు!

ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపండి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 17 , 2026 | 12:07 PM