కల్యాణ వైభోగమే...
ABN, Publish Date - Feb 19 , 2026 | 12:51 AM
జీవితాంతం భార్యభర్తలిద్దరూ ఒకరి కోసం ఒకరిగా జీవించే అనురాగ బంధాన్ని ముడివేసేవి వివాహాలు, బంఽధువుల కోలాహలం మధ్య రెండు కుటుంబాలను ఒకటి చేసే ముహూర్తాలు. వివాహ బంధాల కోసం ఎదురుచూసే శుభకార్యాలకు ముహూర్తాలు మళ్లీ మొదలయ్యాయి.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
జీవితాంతం భార్యభర్తలిద్దరూ ఒకరి కోసం ఒకరిగా జీవించే అనురాగ బంధాన్ని ముడివేసేవి వివాహాలు, బంఽధువుల కోలాహలం మధ్య రెండు కుటుంబాలను ఒకటి చేసే ముహూర్తాలు. వివాహ బంధాల కోసం ఎదురుచూసే శుభకార్యాలకు ముహూర్తాలు మళ్లీ మొదలయ్యాయి. ఇంటికి తోరణాలు కట్టి పెళ్లి భాజాలు మోగనున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు నెలల విరామం తర్వాత ఈనెల 19వ తేది నుంచే ముహూర్తాలు మొదలుకావడంతో పెళ్లి భాజాలు మోగనున్నాయి. 19న ఒక్కరోజే 19 ముహూర్తాలు ఉండటంతో హడావుడి మొదలైంది. డిసెంబరు వరకు ముహూర్తాలకు కొదవ లేకపోవడంతో, జిల్లాలో పెళ్లి సందడి కనిపిస్తోంది. గతేడాది నవంబరు 27 నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి 17 శుక్రమౌఢ్యమి కొనసాగింది. ఆ తర్వాత శూన్యమాసం జనవరి 18 వరకు కొనసాగింది. ఫిబ్రవరి 17 వరకు మఘమాసం శుభమాసమే అయినా మూడం ఉండటంతో మూడు మాసాలు ముహూర్తాలు లేకుండాపోయాయి, శుక్రమౌఢ్యమి, శూన్యమాసాలతో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. సంబంధాలు కుదిరినా వివాహాలకు వాయిదా వేస్తూ వచ్చారు. తిరిగి గురువారం ముహూర్తాలు మొదలుకావడంతో జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీతో పాటు అన్ని గ్రామాల్లో పెళ్లి పనులతో కుటుంబాల్లో సందడి కనిపిస్తోంది.
శుభముహూర్తాలు ఇలా...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ముహూర్తాల్లో దాదాపు 10వేల వరకు వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలకు సంబంధించిన ముహూర్తాల్లో ఫిబ్రవరి మాసంలో 19,20,21,24,25,26 ముహూర్తాలు ఉండగా, మార్చిలో 1,3,4,7,8,,9,11,12 ఏప్రిల్లో 15,20,21,25,26,27,28,29 తేదిల్లో ముహూర్తాలు ఉన్నాయి. మే మాసంలో 1,3,5,6,7,8,13,14 తేదిల్లో, జూన్ మాసంలో 21,22,23,24,25,26,27,29 తేదిల్లో, జూలై మాసంలో 1,6,7,11 తేదిల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టు మాసంలో 16,20,21,23,26,27,30 సెప్టెంబరు మాసంలో 4,5,6 తేదిల్లో, నవంబరులో 13,14,15,18,20,21,22,26 తేదిల్లో, డిసెంబరు మాసంలో 3,12,13,18,19,20,31 తేదిల్లో ముహూర్తాలు ఉన్నాయి, వివాహాలతో పాటు గృహనిర్మాణాలు, శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలకు మంచివిగా చెబుతున్నారు.
వ్యాపార సంస్థలు కళకళ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెళ్లిళ్ల హడావిడి వ్యాపార సంస్థల్లో కనిపిస్తోంది. ప్రధానంగా వస్త్ర దుకాణాల్లో సందడి ఏర్పడింది. రేడిమేడ్ వస్త్రాల కొనుగోళ్లతో పాటు ఆభరణాల షాపుల్లో సందడిగా మారింది. పెళ్లిళ్ల సీజన్‌తో కొనుగోళ్లు పెద్దఎత్తున కొనసాగుతాయనే ఆశాభావంతో ఉన్నారు.
ముందే బుకింగ్‌లు...
వివాహా ముహూర్తాలు మొదలు కావడంతోనే జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో ని ఫంక్షన్‌హాల్‌లు ముందే బుక్‌చేసుకుంటున్నారు. ప్రధానంగా ఉండే ఫంక్షన్‌హాల్‌లు జూలై వరకు బుకింగ్‌లు ఉన్నట్లు చెబుతున్నారు. వీటితో పాటు క్యాటరింగ్, పూలడేకరేషన్, భాజా భజంత్రీలు, డప్పు చప్పుళ్లకు సంబంధించిన వారు కూడా అడ్వాన్స్‌గానే బుకింగ్ అవుతున్నారు. చివరకు వివాహాలు జరిపే పంతుళ్లకు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. పెళ్లి మహూర్తాలు మొదలు కావడంతో వస్త్ర దుకాణాలు కళకళాడుతున్నాయి.
Updated at - Feb 19 , 2026 | 12:51 AM