కాళేశ్వరంపై సమీక్ష.. నిపుణుల నివేదికలతోనే నిర్ణయం: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Jul 24 , 2026 | 08:53 PM
కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నిపుణుల నివేదికల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, జులై 24: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం భవిష్యత్ నిర్వహణపై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నుంచి సాంకేతిక మార్గదర్శకాలు కోరాలని అధికారులను ఆదేశించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), జియోఫిజికల్ రిపోర్ట్ (GPR), కావిటీస్ (Cavities) నివేదికలను కేంద్రానికి పంపాలని సూచించారు. అన్ని నిర్ణయాలు అధికారిక రికార్డుల్లోనే ఉండేలా వెంటనే రెసిడెంట్ కమిషనర్ ద్వారా కేంద్రానికి లేఖ పంపాలని ఆదేశించారు.
ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఫ్రీ-ఫ్లో మోడ్‌లో కొనసాగిస్తున్నామని అధికారులు వివరించారు. అన్నారం బ్యారేజీ ఫౌండేషన్‌లో కూడా కావిటీస్ గుర్తించబడటంతో ప్రస్తుతం అక్కడ నీటి నిల్వ సురక్షితం కాదని నిపుణులు అభిప్రాయపడ్డారు. మేడిగడ్డ పునరుద్ధరణ కాన్సెప్ట్ డిజైన్ ఆగస్టు చివరి నాటికి, వ్యయ అంచనాలు సెప్టెంబర్ మధ్య నాటికి సిద్ధమవుతాయని తెలిపారు. అన్నారం, సుందిళ్లపై అదనపు సాంకేతిక విశ్లేషణలు రెండు వారాల్లో పూర్తిచేసి టెక్నికల్ ఓవర్‌సైట్ కమిటీకి సమర్పించనున్నట్లు వెల్లడించారు. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్స్.. ప్రభుత్వ వర్గాల కీలక వ్యాఖ్యలు
కోర్టు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు: సుప్రీం కోర్టు