ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్స్.. ప్రభుత్వ వర్గాల కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 24 , 2026 | 06:33 PM
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో బాధ్యతల నుంచి తప్పుకోవడమే అత్యంత సులువైన పని అని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించినట్టు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవాలని కాక్రోచ్ జనతా పార్టీ పట్టుపడుతోంది. అయితే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ పరిస్థితుల్లో బాధ్యతల నుంచి తప్పుకోవడమే అత్యంత సులువైన పని అని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించినట్టు సమాచారం. రాజీనామా అంటే బాధ్యతల నుంచి పారిపోయినట్టేనని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజలు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించాలని భావిస్తున్నట్టు సమాచారం.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో లోపాలను సరిదిద్దడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే లోపాలకు సంబంధించి సమగ్ర జాబితాను కూడా సిద్ధం చేసిందని సమాచారం. త్వరలో దిద్దుబాటు చర్యల గురించి కూడా ప్రకటించనుంది. ఇప్పటికే ప్రభుత్వం పేపర్ లీక్ గ్యాంగులపై పలు చర్యలు తీసుకున్నట్ట సంబంధిత వర్గాలు తెలిపాయి. మరిన్ని కఠిన చర్యలు కూడా ఉంటాయని చెప్పాయి. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
నీట్ పేపర్ లీక్‌పై ఆమరణ దీక్ష ప్రారంభించిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల తరువాత నిన్న (గురువారం) దీక్షను విరమించిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లను ఆసుపత్రిలో కలిసిన అనంతరం ఈ ప్రకటన చేశారు. వాంగ్‌చుక్ దీక్ష విరమణపై సీజేపీ పార్టీ నేత అభిజిత్ దీప్కే హర్షం వ్యక్తం చేశారు. ఆయన తన ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టి జాతి అంతరాత్మను జాగృతం చేశారని ప్రశంసించారు. అయితే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకూ తమ నిరసనలు కొనసాగుతాయని సీజేపీ స్పష్టం చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
కోర్టు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు: సుప్రీం కోర్టు
రాజ్యసభ ముందుకు ‘వందేమాతరం’ బిల్లు