Share News

రాజ్యసభ ముందుకు ‘వందేమాతరం’ బిల్లు

ABN , Publish Date - Jul 24 , 2026 | 02:31 PM

వందేమాతరం గేయాన్ని అవమానించిన వారికి శిక్ష పడేలా కేంద్రం కొత్త బిల్లును రాజ్యసభలో నేడు ప్రవేశపెట్టింది.

రాజ్యసభ ముందుకు ‘వందేమాతరం’ బిల్లు
Vandemataram Bill introduced in Rajyasabha

ఇంటర్నెట్ డెస్క్: జాతీయ గీతం ‘జనగణమన..’ స్థాయిలో వందేమాతరం గేయానికి చట్టపరమైన రక్షణలు కల్పించే దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది. హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ నేడు రాజ్యసభలో వందేమాతరం బిల్లును ప్రవేశపెట్టారు. వందేమాతరం గేయాన్ని అవమానిస్తే జైలు శిక్ష పడేలా బిల్లులో నిబంధనలు పొందుపరిచారు. అయితే, ఈ బిల్లుపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభ సోమవారానికి వాయిదా పడింది.

వందేమాతరం గేయం ఆలాపనను కావాలని అడ్డుకున్నా, గేయం ఆలాపన జరుగుతున్న సమయంలో ఇబ్బందులు కలిగించినా నేరంగా పరిగణించేలా ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టూ నేషనల్ ఆనర్ 1971 చట్టానికి కేంద్రం తాజా బిల్లులో మార్పులు ప్రతిపాదించింది. అయితే, విపక్షాలు మాత్రం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛాహక్కుకు భంగం కలిగించేలా బిల్లులో నిబంధనలు ఉన్నాయని చెబుతున్నాయి.


ఈ బిల్లుపై అభ్యంతరం చెబుతూ సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ జాన్ కేంద్రానికి లేఖ రాశారు. బిల్లును వెనక్కు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని హోం మంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. జాతీయ గీతం, జాతీయ గేయం స్థాయిలకు సంబంధించి ప్రస్తుమున్న రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా బిల్లు ఉందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో వందేమాతరం పాత్ర మరువలేనిదని అన్నారు. అయితే, ఈ బిల్లుతో దేశభక్తి, వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య ఉన్న సున్నితమైన సమతౌల్యం దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు.

బీజేపీ మాత్రం ఈ బిల్లును గట్టిగా సమర్థించింది. జాతీయ గేయమైన వందేమాతరంలో ఒకప్పుడు కొన్ని చరణాలను మాత్రమే ఆలపించేవారని, ఇప్పుడు పూర్తిస్థాయిలో పాడుతున్నారని బీజేపీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సేథ్ అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

NEET-UG సంస్కరణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

విద్యార్థులను బెదిరించే హక్కు మీకెవరిచ్చారు?.. డీయూపై రాహుల్ గాంధీ ఫైర్..

Updated Date - Jul 24 , 2026 | 03:12 PM