కోర్టు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు: సుప్రీం కోర్టు
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:25 PM
కోర్టుల్లో విచారణలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఇష్టారీతిన షేర్ చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇకపై కోర్టు అనుమతి లేకుండా ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: కోర్టుల్లో విచారణలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఇష్టారీతిన షేర్ చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇకపై కోర్టు అనుమతి లేకుండా ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ అనుమతులు, లేదా సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్ అనుమతి తీసుకున్నాకే వీటిని డిజిటల్ వేదికల్లో షేర్ లేదా మోనెటైజేషన్‌కు పెట్టుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. న్యూస్ రిపోర్టింగ్‌కు మాత్రం ఈ నిబంధన వర్తించదని వివరణ ఇచ్చింది.
కోర్టు కార్యకలాపాల వీడియోలను సోషల్ మీడియాలో ఇష్టారీతిన షేర్ చేస్తున్నారంటూ ఓ జర్నలిస్టు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ మోహనల ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియాలో ఇష్టారీతిన షేర్ చేస్తున్న కోర్టు వీడియోల కారణంగా న్యాయస్థానాల గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉందని పిటిషనర్ అన్నారు. కొన్ని రోజుల క్రితం న్యాయస్థానంలో ఒక లాయర్ తన చేతిలోని కాగితాలను గాల్లోకి విసరిన వీడియోలు వైరల్‌గా మారాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారమంతా ఒక జోక్‌గా మారిందని విచారం వ్యక్తం చేశారు. లైవ్ స్ట్రీమింగ్‌తో పాటు ఇతర వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంపై ఆంక్షలు విధించాలని కోరారు.
ఈ అభ్యర్థనపై జస్టిస్ బాగ్చీ స్పందిస్తూ.. కోర్టులు 24 గంటలు నడిచే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ కావని వ్యాఖ్యానించారు. కోర్టు విచారణల లైవ్ స్ట్రీమింగ్‌లపై కూడా పరిమితులు ఉండాలని అన్నారు. కోర్టులేమీ లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్స్ కావని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లు, లైవ్ స్ట్రీమింగ్‌లకు సంబంధించి లింక్‌లను కూడా ఇష్టారీతిన షేర్ చేస్తున్నారని, వీటిపై కూడా పరిమితులు ఉండాలని జస్టిస్ బాగ్చీ అన్నారు. ఇందుకు సంబంధించి మెటా, ఎక్స్, ఇతర సోషల్ మీడియా వేదికలకు కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
రాజ్యసభ ముందుకు ‘వందేమాతరం’ బిల్లు
‘చలో పార్లమెంట్' పిటిషన్‌పై తప్పుడు ప్రచారం.. మీడియా వార్తలను ఖండించిన సీజేఐ