కాళేశ్వరం భద్రతే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
ABN , Publish Date - Aug 01 , 2026 | 08:13 PM
పెద్దపల్లి పర్యటనలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు దృఢంగా ఉన్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాల వల్లే సమస్యలు తలెత్తాయని ఆరోపించారు.
పెద్దపల్లి, ఆగస్టు 1: బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాల వల్లే సమస్యలు తలెత్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పెద్దపల్లిలో జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఆర్ఎస్పి, కడెం, ఎల్లంపల్లి వంటి ప్రధాన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా దృఢంగా ఉందని, అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో నిర్మాణ లోపాల కారణంగ సమస్యలు తలెత్తాయని విమర్శించారు. ఎల్లంపల్లి పంపులను ఆన్ చేసి మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోశామని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుందని, కానీ వాస్తవ పరిస్థితులు అందరికీ తెలుసని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ నివేదికల ఆధారంగానే ప్రస్తుతం బ్యారేజీల్లో నీటి నిల్వలను పరిమితం చేస్తున్నాం. కన్నెపల్లి పంపులను వెంటనే ఆన్ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టుల ఫౌండేషన్ సక్రమంగా లేదు. ఐఐటీ బాంబే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు వచ్చే వర్షాకాలం వరకు నీటి నిల్వలను నియంత్రిస్తాం. భద్రతా సూచనలను విస్మరించి నీటిని నిల్వ చేస్తే డ్యాం దిగువన ఉన్న గ్రామాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో బాధ్యత ఎవరు వహిస్తారు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
చంద్రుడిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. శాస్త్రవేత్తలలో ఉత్కంఠ..
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..