జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్
ABN , Publish Date - Aug 26 , 2026 | 05:44 AM
జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ ముత్తుయాదవ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై నమోదైన హత్యాయత్నం కేసులో బాధితుడికి సత్వర న్యాయం చేయడంలో ముత్తుయాదవ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగాల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో పక్షపాతం చూపించిన ముత్తుయాదవ్!
బంజారాహిల్స్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ ముత్తుయాదవ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై నమోదైన హత్యాయత్నం కేసులో బాధితుడికి సత్వర న్యాయం చేయడంలో ముత్తుయాదవ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగాల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన 25 రోజులకే ఆయన సస్పెండ్ కావడం పోలీసు శాఖలో కలకలం రేపింది. జూలై 30న జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 2లోని ఓ కార్యాలయంలో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ నార్ల సుమంత్, అతని అనుచరులు చెంగిచర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణపై ఇనుప రాడ్లు, కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన పై బాధితుడు ఈ నెల 20న ఫిర్యాదు చేయడంతో సుమంత్, అతని అనుచరులపై హత్యాయత్నం కింద కేసు నమోదైంది. అయితే దాడి జరిగిన రోజే బాధితుడు ఠాణాకు వెళ్లినా.. సీఐ ముత్తుయాదవ్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఘటన జరిగిన రోజే జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌గా ముత్తుయాదవ్ బాధ్యతలు తీసుకున్నారు. అదేరోజు రాత్రి గొడవకు సంబంధించిన సమాచారం అందడంతో ఆయన పెట్రో కార్‌ను ఘటనా స్థలానికి పంపించారు. తీవ్రంగా గాయపడిన హరికృష్ణతోపాటు మరికొంత మందిని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. మరోవైపు హరికృష్ణకు వ్యతిరేకంగా పసుపులేటి కార్తీక్ అనే వ్యక్తి మాదాపూర్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే హరికృష్ణకు తీవ్ర గాయాలు కావడంతోపాటు నడవలేని స్థితిలో ఉన్నా.. ఆస్పత్రికి పంపించకుండా ఇన్‌స్పెక్టర్ తన క్యాబిన్ వద్ద దాదాపు రెండు గంటలపాటు ఉంచారు. అంతేకాకుండా ఇన్‌స్పెక్టర్ పట్ల హరికృష్ణ అనుచితంగా ప్రవర్తించాడని జనరల్ డైరీలో రాశారు. విషయం తెలుసుకున్న హరికృష్ణ న్యాయవాది.. ఠాణాకు చేరుకొని మరుసటి రోజు హాజరు పరుస్తాననే హామీతో ఆయనను తీసుకెళ్లారు.
మెడికో లీగల్ కేసు అయినా..
తీవ్ర గాయాలపాలైన హరికృష్ణ నేరుగా గాంధీ ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడి సిబ్బంది మెడికో లీగల్ కేసు (ఎంఎల్‌సీ) కింద జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించినా ఇన్‌స్పెక్టర్ ముత్తుయాదవ్ పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. మరోవైపు బాధితుడి చేయి విరగడంతో చెంగిచర్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కట్టు వేయించుకున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో ఈ నెల 10న ఉప్పల్‌లోని మరో ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్నారు. కోలుకున్న అనంతరం బాధితుడు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నార్ల సుమంత్‌తోపాటు అతని అనుచరులు ప్రశాంత్, అరుణ్‌కుమార్‌రెడ్డి, కార్తీక్, మహేందర్‌రెడ్డి, రాము తదితరులపై హత్యాయత్నం కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా ఇన్‌స్పెక్టర్ ముత్తుయాదవ్ నిర్లక్ష్యం, పక్షపాత ధోరణి వెల్లడైనట్లు తెలిసింది. హత్యాయత్నం జరిగినా కేసు నమోదు చేయకపోవడం, బాధితుడిని ఆస్పత్రికి పంపకపోవడం, నిందితులతో నిరంతరం ‘టచ్’లో ఉంటూ వారికి వకాల్తా పుచ్చుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో మరో పోలీసు అధికారి ప్రమేయం కూడా ఉన్నట్లు గుర్తించి ఆ దిశగానూ విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు సుమంత్‌ను అరెస్టు చేయడంలో ఇన్‌స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సుమంత్ మాజీ మంత్రి ఇంట్లో ఉన్నాడని తెలిసినా, అరెస్టు చేయకుండా అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.