జైశ్రీరాం వడ్లకు రికార్డు ధర !
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:24 AM
మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో పాతరకం జైశ్రీరాం ధాన్యానికి రికార్డు ధర పలికింది.
మహబూబాబాద్‌లో క్వింటాల్ రూ.5,555
ఏనుమాములలో మక్కలు క్వింటాల్ రూ.3255
మహబూబాబాద్ అగ్రికల్చర్, వరంగల్ వ్యవసాయం, దౌల్తాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో పాతరకం జైశ్రీరాం ధాన్యానికి రికార్డు ధర పలికింది. గురువారం జైశ్రీరాం సన్నధాన్యానికి క్వింటాకు గరిష్ఠ ధర రూ.5,555 నమోదైంది. కనిష్ట ధర రూ.3,960 పలుకగా, సగటున రూ.5,080లుగా ఉంది. అలాగే ఆర్‌ఎన్‌ఆర్ రకం ధాన్యానికి గరిష్ఠంగా రూ.4,885, హెచ్‌ఎంటీ రకానికి రూ.4,930 ధర పలికింది. ఇక పత్తి క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.9,021, కనిష్టంగా రూ.5,300 ధర పలికింది. మక్కలకు రూ.3,051లకు గరిష్ఠ ధర రాగా, కనిష్టంగా రూ.2వేలు పలికింది. కాగా, కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో జైశ్రీరాం గరిష్ఠ ధర రూ.5,018 వరకు పలుకగా, ఆర్‌ఎన్‌ఆర్ రూ.4516, హెచ్‌ఎంటీ రూ.2929 వరకు ధరలు నమోదయ్యాయి. అలాగే, వరంగల్ (ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధర మళ్లీ పెరిగింది. గురువారం క్వింటాకు రూ.3255 పలికింది.
పత్తి ధర తగ్గింపు.. రైతుల ఆందోళన
పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని నీటూర్ గేటు సమీపంలోని విజయ్ ఇండస్ర్టీస్ కాటన్ మిల్లు ఎదుట ఆందోళన చేపట్టారు. నిన్నటి వరకు క్వింటాల్ పత్తికి రూ.9,200చెల్లించగా, గురువారం రూ.8,900గా నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టం కలగకుండా కొనుగోళ్లు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎల్‌నినో ప్రభావంతో ఎండలు 50 డిగ్రీలకు చేరే అవకాశం: మంత్రి తుమ్మల