Share News

రైతు గుండెల్లో తుఫాన్‌

ABN , Publish Date - Oct 30 , 2026 | 12:48 AM

వర్షాభావ పరిస్థితులు, తెగుళ్లు, కరెంట్‌ కష్టాలతో ఇబ్బంది పడుతున్న అన్నదాతల గుండెల్లో ఆర్నబ్‌ తుఫాన్‌ అలజడి రేపుతోంది.

రైతు గుండెల్లో తుఫాన్‌

జగిత్యాల, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): వర్షాభావ పరిస్థితులు, తెగుళ్లు, కరెంట్‌ కష్టాలతో ఇబ్బంది పడుతున్న అన్నదాతల గుండెల్లో ఆర్నబ్‌ తుఫాన్‌ అలజడి రేపుతోంది. పంట చేతి కొచ్చే సమయంలో వాతావరణం మారడం, ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్ణయించిన ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వెంటనే కాంటాలు ప్రారంభించాలని కోరుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఎండకాలాన్ని తలపించిన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో చలి గాలులు వీస్తుండడంతో పాటు అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. దీంతో వరి రైతు గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తోంది. తుఫాన్‌ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వాతావరణం పూర్తిగా మేఘావృతమైంది. వర్ష సూచనలు కనిపంచడంతో రైతులు రోడ్లపై, కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కుప్పలు చేసి టార్పాలిన్లు కప్పారు. జిల్లాలో 38,910 ఎకరాలల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరానికి 35 క్వింటాళ్ల దిగుబడి చొప్పున జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో 13.65 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్న అంచనా ఉంది. మొక్కజొన్న కోతలు సైతం దాదాపుగా పూర్తయ్యాయి. రైతులు కల్లాలు, రోడ్లపై మొక్కజొన్న ఆరబెట్టుకుంటున్నారు. మార్క్‌ఫెడ్‌ ఆద్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో దళారులకు విక్రయిస్తున్నారు.

ఫ3,02,860 ఎకరాల్లో వరి సాగు..

జిల్లాలో వానాకాలం సీజన్‌లో 3,02,860 ఎకరాల్లో వరి సాగయ్యింది. ఇందులో దొడ్డు రకాలు 65,300 ఎకరాలు, సన్న రకం 2,37,560 ఎకరాల్లో సాగు చేశారు. ఇందుకు గానూ 6,72,264 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేయగా...ఇందులో సన్నరకం దిగుబడి 4,91,298 మెట్రిక్‌ టన్నులు, దొడ్డు రకం దిగుబడి 1,80,966 మెట్రిక్‌ టన్నులు వస్తుందని అంచనా ఉంది. అయితే ఎల్‌నినో ప్రభావంతో అవసరమైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలమట్టం పడిపోయి చాలాచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. నీరు ఎక్కువ అవసరం ఉన్న వరి పంటకు నీరు సరిగా పారించలేక రైతులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా వరి పంట పొట్టదశలో ఉన్నప్పుడు సరిపడా నీరు లేకచాలా చోట్ల పంట దెబ్బతింది. కొందరు రైతులు నీరు పారించలేక పశువులకు వదిలేశారు. కొందరు పంటను కాపాడుకునేందుకు అప్పులు చేసి బోర్లు తవ్వించారు. ట్యాంకర్ల ద్వారా నీటిని అందించారు. ఇదే సమయంలో కరెంటు కోతలు ఇబ్బంది పెట్టాయి. దానికితోడు తెగుళ్లు కూడా వరి పంటను దెబ్బతీశాయి. ఇప్పటికే వరి కోసిన రైతులు దిగుబడి తగ్గిందని చెబుతున్నారు. కోతకి వచ్చిన పంటల పరిస్థితి రోజుకోరకంగా ఉంటోంది. మొన్నటి దాకా తెగుళ్లు, నీరందక దెబ్బతినడంతో దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెందిన రైతులు..ఇప్పుడు వాతావరణ మార్పులతో ఇబ్బంది పడుతున్నారు.

ఫమొదలుకాని కాంటాలు...

జిల్లాలో సహకార సంఘాలు, మెప్మా తదితర వాటి ద్వారా 438 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో ఇప్పటి వరకు కాంటాలు మొదలు కాలేదు. అయితే బయట మార్కెట్‌లో సన్న వడ్లకు మంచి ధర లభిస్తుండడంతో కొందరు రైతులు కోసింది కోసినట్టే పచ్చి వడ్లను దళారులకు అమ్ముకుంటున్నారు. బోనస్‌ కోసం ఆలోచించిన రైతులు మాత్రం దళారులకు అమ్మకుండా ఆరబెడుతున్నారు. పలు ప్రాంతాల్లో వరికోత యంత్రాలు రాత్రింబవళ్లు నడుస్తున్నాయి.

ఫతుఫాన్‌తో ఆగమాగం..

మెట్‌పల్లి, మేడిపల్లి, కొడిమ్యాల, మల్యాల ప్రాంతాల్లో ముందుగా కోతకు రావడంతో అక్కడి రైతులు చాలా మంది వరి కోసి ధాన్యాన్ని వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఇంకా పలు ప్రాంతాల్లో కోతలు నడుస్తున్నాయి. మిగితా ప్రాతాల్లో ఇప్పుడిప్పుడే కోతలు ముమ్మర మయ్యాయి. కాగా పలు ప్రాంతాల్లో వరి కోసి వడ్లను ఆరబెట్టుతున్న సమయంలో తుఫాన్‌ ఆగం చేస్తోంది. కొన్ని చోట్ల రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టారు. మరికొన్ని చోట్ల పొలాల్లోనే కుప్పలు చేసి ఉంచారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Oct 30 , 2026 | 12:48 AM