Share News

ABN చేతిలో గృహ నిర్మాణ సంస్థ 'వైట్ వాటర్స్' మోసం కేసు FIR

ABN , Publish Date - Feb 08 , 2026 | 05:23 PM

మూసాపేట్‌లో అపార్ట్‌మెంట్స్ నిర్మిస్తామంటూ ఫ్లాట్లు అమ్మకాలు జరిపిన 'వైట్ వాటర్స్' అనే హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ సంస్థ మోసానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఏబీఎన్ చేతికి వచ్చింది. దాదాపు 500 మంది నుంచి.. రూ. 270 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

ABN చేతిలో గృహ నిర్మాణ సంస్థ 'వైట్ వాటర్స్' మోసం కేసు FIR
White Waters Constructions fraud

హైదరాబాద్, ఫిబ్రవరి 8: సామాన్యుల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని కోట్లకు పడగలెత్తిన 'వైట్ వాటర్స్' కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ మోసాలు బట్టబయలయ్యాయి. హైదరాబాద్ కూకట్‌పల్లి సమీపంలోని మూసాపేట్ ప్రాంతానికి చెందిన సుజాత అనే మహిళ ఫిర్యాదుతో ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు రంగంలోకి దిగి, సంస్థ డైరెక్టర్లపై FIR నమోదు చేశారు.

ఒక్క ఫ్లాట్.. రెండు రిజిస్ట్రేషన్లు..

బాధితురాలు సుజాత తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు విస్తుగొలుపుతున్నాయి

నమ్మించి అమ్మకాలు:

2018లో మూసాపేట వై జంక్షన్ వద్ద ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో, మెట్రో స్టేషన్‌కు నేరుగా యాక్సెస్ ఉంటుందని బిల్డర్ నమ్మబలికారు.

చెల్లింపులు:

మొదట 1650 చ.అడుగుల ఫ్లాట్ కోసం ఒప్పందం చేసుకోగా, బిల్డర్ దానిని ఏకపక్షంగా 1945 చ.అడుగులకు పెంచి ధరను కూడా పెంచేశారు. ఇప్పటివరకు సుజాత సదరు బిల్డర్‌కు రూ. 79,94,570 చెల్లించారు.

నకిలీ తనఖా:

బాధితురాలి నుంచి 90 శాతం డబ్బు వసూలు చేసిన తర్వాత, బిల్డర్ అజయ్ సలికే మరో వ్యక్తితో కలిసి నకిలీ అమ్మకపు ఒప్పందం సృష్టించారు. అదే ఫ్లాట్‌ను ఎస్బీఐ (SBI) లో తనఖా పెట్టి ఏకంగా రూ. 1.27 కోట్ల హోమ్ లోన్ పొందడం గమనార్హం. ఈ వ్యవహారంలో బ్యాంక్ అధికారులు కూడా కుమ్మక్కయ్యారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


ఎంతమంది బాధితులు? ఎంత స్కామ్?

కేవలం ఒక్క సుజాత మాత్రమే కాదు, ఈ ప్రాజెక్ట్‌లో దాదాపు 500 మంది వినియోగదారులు బుకింగ్ చేసుకున్నారు. మొత్తం లావాదేవీల విలువ సుమారు రూ. 270 కోట్లు ఉంటుందని అంచనా.

టవర్లు A, B లు పాక్షికంగా పూర్తి కాగా, C, D టవర్లు కేవలం బేస్‌మెంట్ స్థాయిలోనే ఉన్నాయి. E, F టవర్ల పనులు ఇప్పటివరకు అసలు ప్రారంభమే కాలేదు.

ముగ్గురు డైరెక్టర్లపై కేసు నమోదు

బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన ఈఓడబ్ల్యూ పోలీసులు వైట్ వాటర్స్ కన్‌స్ట్రక్షన్స్ డైరెక్టర్లైన అజయ్ సలికే, తనయ్ సలికే, విజయలక్ష్మి సలికే లపై కేసులు నమోదు చేశారు.

సెక్షన్లు:

BNS 318(4), 316(2), 316(5) ఇంకా టీఎస్‌పీఓఎఫ్‌ఈ (TSPOFE) చట్టం 1999 సెక్షన్ 5 కింద కఠిన చర్యలకు ఉపక్రమించారు.

తమ కష్టార్జితాన్ని రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో పోగొట్టుకున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

భారత్ - మలేషియా నవశకం.. కీలక రంగాలపై ఇరు ప్రధానుల ఒప్పందాలు..

దూసుకొచ్చిన మృత్యువు.. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్తుండగా..

Updated Date - Feb 08 , 2026 | 06:46 PM