TGSRTC Special Buses: సంక్రాంతికి ఊరెళుతున్నారా? నో టెన్షన్.. 6,431 ప్రత్యేక బస్సులు!
ABN , Publish Date - Jan 07 , 2026 | 06:53 PM
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్. పండుగ రద్దీ దృష్ట్యా టీజీఎస్‌ఆర్‌టీసీ ఆరు వేల పైచిలుకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తేనుంది. జనవరి 9 నుంచి 13వ తేదీల మధ్య, ఆపై జనవరి 18, 19 తేదీల్లో ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: సంక్రాంతికి హైదరాబాద్ నుంచి అనేక మంది తమ సొంత ఊళ్లకు తరలి వెళుతుంటారు. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు అనుగుణంగా టీజీఎస్‌ఆర్‌టీసీ రంగంలోకి దిగింది. పండుగ కోసం ఏకంగా 6,431 ప్రత్యేక బస్సులు ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్ నుంచి ఇతర తెలంగాణ జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి కోసం ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 9, 10, 12, 13 తేదీల్లో ఇవి అందుబాటులో ఉంటాయని టీజీఎస్‌ఆర్‌టీసీ తెలిపింది. అంతేకాకుండా, పండుగ తరువాత సొంతూళ్ల నుంచి తిరిగొచ్చే వారి కోసం జనవరి 18, 19 తేదీల్లో కూడా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి (TGSRTC Sankranti Special Buses). అయితే, ప్రత్యేక బస్సు టిక్కెట్లపై 50 శాతం అదనంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
హైదరాబాద్‌లోని ఎమ్‌జీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరామ్‌గఢ్, ఎల్‌బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి తదితర రద్దీ స్టేషన్స్‌లో ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం టీజీఎస్ఆర్‌టీసీ ఆయా స్టేషన్‌లలో తాగు నీటి వసతి, మొబైల్ టాయ్‌లెట్స్, కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, బస్సు రాకపోకలను తెలియజేసేలా ప్రత్యేక అనౌన్స్‌మెంట్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేస్తోంది. బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికుల కోసం కొన్ని చోట్ల తాత్కాలిక షెల్టర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సంక్రాంతి నేపథ్యంలో కూడా మహిళలకు ఉచిత బస్సు సర్వీసు యథావిధిగా అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
ఇక పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారు చోరీలు వంటి ఘటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. పండుగ సమయంలో పలు ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను పెంచుతున్నట్టు కూడా చెప్పారు. కాలనీల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవడం వంటి కనీస భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
ఇవీ చదవండి:
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ఫేక్ ప్రచారం.. వాస్తవమిదే..
కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవమే కానీ..: కేటీఆర్